ఎంత కష్టం..!
ABN, First Publish Date - 2020-03-27T10:14:16+05:30
విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొంతలం గ్రామానికి చెందిన యువకులు హైదరాబాద్‌లో వలస పనులకు వెళ్లి అష్టకష్టాల
హైదరాబాద్ నుంచి విశాఖకు కాలినడకన కూలీలు
వలస పనులకు వెళ్లి అష్టకష్టాలు పడ్డ యువకులు
తుని, మార్చి 26:
విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొంతలం గ్రామానికి చెందిన యువకులు హైదరాబాద్‌లో వలస పనులకు వెళ్లి అష్టకష్టాల పాలయ్యారు. కరోనా కారణంగా దేశంలో కర్ఫ్యూ విధించడంతో వారు హైదరాబాద్‌నుంచి స్వగ్రామానికి కాలినడకన బయలుదేరి గురువారం తుని చేరుకున్నారు. హైదరాబాద్‌లో బంజారాహిల్స్ రోడ్డు నెంబరు.14లో అద్దె భవనంలో ఉంటూ భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసేందుకు వెళ్లిన శెనపతి నరసింహారావు, శెనపతి శ్రీను, యర్రంశెట్టి సాయి, సితిన సాయి, సితిన లోవరాజు, సవితిన వరహాలరాజులు అనేక ఇబ్బందులు పడ్డారు.
ఈనెల 10నుంచి హైదరాబాద్‌లో పనులు నిలిపివేశారు. ఇంతలో కరోనా ప్రభావంతో కర్ఫ్యూ విధించడంతో ఇళ్లనుంచి బయటకు రావద్దని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పనులు లేకపోవడంతో తిండికి కూడా కష్టమవుతుండడంతో స్వగ్రామానికి వెళ్లిపోవాలని వారంతా నిర్ణయించుకున్నారు. తెలంగాణ అధికారులు వారిని ఏపీ బోర్డర్ కోదాడ వరకు లారీలో పంపించారు. అక్కడకు చేరిన తర్వాత కాలినడకన బయల్దేరారు. బుధవారం అర్ధరాత్రికి రాజమహేంద్రవరం చేరుకున్నారు. అక్కడినుంచి తెల్లవారుజామున బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు తుని చేరుకున్నారు.
మంచినీరు, అరటి పండ్లు, బిస్కెట్లే ఆహారం
హైదరాబాద్‌నుంచి బయలుదేరిన తర్వాత ఒకపూట కూడా భోజనం చేయకుండా మార్గమధ్యలో దొరికిన ఆహారం తీసుకుంటూ వచ్చారు. దుకాణాలు కూడా బంద్ చేయడంతో దారిలో ఎవరినైనా కనీసం మంచినీళ్లు అడిగినా సహాయం చేయలేదని వారు వాపోయారు. అరటిపండ్లు, బిస్కెట్లు, మంచినీళ్లతోనే మూడు రోజులు గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రోడ్డుపై వెళ్లే వాహనదారులను ఎక్కించుకోండంటూ ప్రాథేయపడ్డా ఫలితం లేకుండా పోయిందన్నారు.
వస్తామనుకోలేదు
సొంత ఊరికి వస్తామని అనుకోలేదు. కూలిపని కోసం వెళ్లి అక్కడ పడ్డ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. ఎందుకంటే కరోనా ప్రభావంతో కర్ఫ్యూవల్ల బయటకు వస్తే పోలీసులతో భయం. దీంతో రూమ్‌లో ఉన్న సామన్లు నిండుకున్నాయి. పనికోసం వెళ్లి నెల రోజులు కూడా గడవకపోవడంతో అరకొరగా డబ్బులు మాత్రమే మా దగ్గర ఉన్నాయి. వాటితోనే స్వగ్రామానికి చేరుకోగలుగుతున్నాం.
-వరహాలరాజు, వలస కార్మికుడు
మంచినీళ్లు అడిగితే పలికేవారు కాదు
ఆంధ్ర బోర్డర్ వరకు తెలంగాణ పోలీసులు సహాయం చేశారు. అక్కడినుంచి తుని చేరుకునేంత వరకూ చాలా కష్టాలు పడ్డాం. తిందామంటే తిండి దొరకలేదు. నడవడానికి ఓపిక లేకపోయినా సొంతూరికి పోవాలన్న తపనతో కాళ్లు ఈడ్చుకుంటూ వచ్చాం.
-నరసింహారావు, కార్మికుడు
Updated Date - 2020-03-27T10:14:16+05:30 IST