నిత్యావసరాల రవాణాకు ఆటంకం లేదు
ABN, First Publish Date - 2020-03-27T10:35:06+05:30
లాక్‌డౌన్‌లో భాగంగా నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలను మాత్రమే జిల్లాలోకి
జేసీ లక్ష్మీశ
కాకినాడ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌లో భాగంగా నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలను మాత్రమే జిల్లాలోకి అనుమతిస్తున్నామని జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. నిత్యావసర సరుకుల రవాణా, పంపిణీపై మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మధుసూదనరెడ్డి, ప్రత్యేక కమిషనర్ ప్రద్యుమ్న, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ కె.శశిధర్ గురువారం అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జేసీ మాట్లాడుతూ జిల్లాలో 15 రైతు బజార్లు ఉన్నాయని, వాటిలో 11 బజార్లను ఖాళీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీలైన ప్రాంతాల్లో మొబైల్ బజార్లు ఏర్పాటు చేస్తామన్నారు.
నిత్యావసర సరుకుల ధరలను పర్యవేక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేశామన్నారు. సరుకు రవాణా చేసే వాహనాలకు ఇబ్బంది లేకుండా పోలీస్‌శాఖ ద్వారా అనుమతులు ఇప్పిస్తున్నామని ఆయన చెప్పారు. సరుకు రవాణాకు ఎటువంటి ఆటంకం కలిగించవద్దని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారన్నారు.
ఈ నెల 29వ తేదీ నుంచి వలంటీర్లు, సచివాలయ సిబ్బంది వినియోగదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఇంటి వద్దకు వచ్చి సరుకులు పంపిణీ చేస్తారని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ఆయన సూచించారు. సమావేశంలో అడ్మిన్ ఎస్పీ కె.కుమార్, డీఎస్‌వో ప్రసాదరావు, మార్కెటింగ్ శాఖ ఏడీ కిశోర్, సివిల్ సప్లయిస్ డీఎం జయరాములు, డీపీవో నాగేశ్వర్ నాయక్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కె.రమేష్, డీఆర్‌డీఏ పీడీ హరిహరినాఽథ్, మత్స్యశాఖ జేడీ జయరావు పాల్గొన్నారు.
Updated Date - 2020-03-27T10:35:06+05:30 IST