రద్దీప్రాంతాలు ఖాళీ
ABN, First Publish Date - 2020-03-16T08:55:20+05:30
నోవెల్ కరోనా వైరస్ ప్రభావం ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నా సోషల్ మీడియాలో వస్తున్న విస్తృత కథనాలపట్ల ప్రజల్లో కలవరం ఎక్కువవుతోంది. సినిమా థియేటర్లు, రైల్వేస్టేషన్‌లు ఖాళీగా మారాయి.
సినిమా థియేటర్లు, రైల్వేస్టేషన్‌ల వద్ద తగ్గిన జనసంచారం
సామర్లకోట, మార్చి 15:
నోవెల్ కరోనా వైరస్ ప్రభావం ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నా సోషల్ మీడియాలో వస్తున్న విస్తృత కథనాలపట్ల ప్రజల్లో కలవరం ఎక్కువవుతోంది. సినిమా థియేటర్లు, రైల్వేస్టేషన్‌లు ఖాళీగా మారాయి. శనివారం రాత్రి సామర్లకోటలోని మూడు థియేటర్లలో రెండో ఆటను జనం లేక పూర్తిగా నిలిపివేశారు. చాలామంది ముక్కుకి, నోటికి మాస్క్‌లు ధరించడం కనిపిస్తోంది.
జాతర్లు, విహారయాత్రలకు బ్రేక్
ఉగాది పండుగ రోజులు సమీపించడంతో సామర్లకోట, పెద్దాపురం, కాండ్రకోట తదితర ప్రాంతాల్లో చాలామంది జాతర్లకు వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారు. నియోజకవర్గంలోని కాండ్రకోటలో జాతర జరుగుతుండడంతో సామర్లకోటలో రైలు దిగి పలు జిల్లాల ప్రజలు అక్కడికి వెళ్తుంటారు. జాతరలో జనసంద్రత అధికంగా ఉండడంవల్ల భక్తులు అంతగా ఆసక్తి కనబరచడం లేదు. పెళ్లిళ్లపై కూడా కరోనా ప్రభావం పడనుంది. పెళ్లిళ్లకు వెళ్లే వారి సంఖ్య కూడా తగ్గుతోంది. పలువురు నాన్‌వెజ్ వంటకాలకు బదులు వెజ్ వంటకాలకే ప్రాధాన్యమిస్తున్నారు. కరోనా బాధితులను గుర్తించేందుకు వైద్యఆరోగ్యశాఖ సూచనతో వలంటీర్లు చేస్తున్న ఇంటింటా సర్వే సక్రమంగా జరగడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు.
జూ కోరుకొండ మండలం శ్రీరంగపట్నానికి చెందిన 34ఏళ్ల వ్యక్తి ఆస్ట్రేలియానుంచి ఫారెన్ ఎక్స్‌పర్ట్‌గా గాడిమొగ రిలయన్స్ సంస్థకు వచ్చిన నిమిత్తం తన భార్య, కుమారుడు, కుమార్తెతో జిల్లాకు రాగా వారికి వైరస్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌రిపోర్టు వచ్చింది.
జూ కువైట్‌నుంచి వచ్చిన మలికిపురం మండలం చింతలమర్రికి చెందిన 26ఏళ్ల పురుషుడికి నెగిటివ్ రిపోర్టు వచ్చింది.
జూ కత్తర్ నుంచి వచ్చిన మలికిపురానికి చెందిన 39ఏళ్ల పురుషుడు, యూకేనుంచి వచ్చిన రాజమహేంద్రవరానికి చెందిన 36ఏళ్ల పురుషుడు, మస్కట్‌నుంచి వచ్చిన రామచంద్రపురం మండలం శ్రీరాంపేటకు చెందిన 32ఏళ్లపురుషుడికి ఈనెల 14న పరీక్షలు నిర్వహించి విజయవాడ సిద్దార్థ మెడికల్ సైన్సెస్ ల్యాబ్‌కు పంపగా ఆదివారం నెగిటివ్ రిపోర్టు వచ్చింది.
జూ ఇటీవల దుబాయినుంచి వచ్చిన 38ఏళ్ల మహిళను ఆదివారం జీజీహెచ్‌కు తరలించగా ఆమె శ్వాబ్‌ను పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. ప్రసుత్తం ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో పరీక్షలు నిర్వహించి రిపోర్టులు రాని 8మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురికి నెగిటివ్ రిపోర్ట్స్ రావడంతో వారి ఇళ్లకు తరలించి వైద్యఆరోగ్యశాఖాధికారుల 28 రోజులపాటు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటారు.
జూ దుబాయినుంచి వచ్చిన రాజానగరం మండలం కొండ గుంటూరుకు చెందిన 22ఏళ్ల పురుషుడు, కెనాడనుంచి వచ్చిన బిక్కవోలు మండలం ఊలపల్లికి చెందిన 30ఏళ్ల పురుషుడు, దుబాయినుంచి వచ్చిన కొత్తపేట మండలం దేవరపల్లికి చెందిన 46ఏళ్ల పురుషుడు, మలేషియానుంచి వచ్చిన రాజమహేంద్రవరం గాంధీపురానికి చెందిన 36ఏళ్ల పురుషుడు వీరి నలుగురికి ఈనెల 13న జీజీహెచ్‌లో శ్వాబ్ తీసి పరీక్ష నిమిత్తం తిరుపతి స్విమ్స్‌కు పంపగా వారి రిపోర్టు రావాల్సి ఉంది.
ప్రత్యేక వార్డు ఏర్పాటు..డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్
విదేశాలనుంచి వచ్చిన వారికి కరోనా వైరస్ పరీక్షలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విదేశాలనుంచి వచ్చిన వారికి జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో ఉంచి వారికి కరోనా వైరస్‌పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స అందజేస్తున్నాం. వైరస్ నివారణకోసం వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి. రెండు చేతులను సబ్బులతో పరిశుభ్రంగా కడుక్కోవాలి. చేతులను ముక్కు, నోటికి తాకరాదు. విపరీతమైన దగ్గు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలి.
Updated Date - 2020-03-16T08:55:20+05:30 IST