డమ్మీ టీకా.. సక్సెస్!
ABN, First Publish Date - 2020-12-29T08:08:02+05:30
అది విజయవాడ ప్రకాశ్‌నగర్‌లోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం. సోమవారం ఉదయం.. సమయం ఉదయం 9 గంటలు.
- నాలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ డ్రైరన్
- కృష్ణా జిల్లాలో 5 చోట్ల నిర్వహణ
- పంజాబ్, గుజరాత్, అసోంలోనూ విజయవంతం
- నిజమైన టీకా మినహా మిగతా ప్రక్రియ యథాతథం
విజయవాడ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అది విజయవాడ ప్రకాశ్‌నగర్‌లోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం. సోమవారం ఉదయం.. సమయం ఉదయం 9 గంటలు. అక్కడి ఆరోగ్య సిబ్బంది అంతా హడావుడిగా ఉన్నారు. కలెక్టర్ ఇంతియాజ్ కూడా అక్కడే ఉన్నారు. ఇంతలో తమ ఫోన్‌కు మెసేజ్ వచ్చిందంటూ కొందరు అక్కడికి వచ్చారు. వారంతా కరోనా వ్యాక్సిన్ కోసం కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో పేర్లు నమోదు చేసుకున్నవారే. థర్మల్ స్కానింగ్, పోలీసుల చెకింగ్ అనంతరం.. ఒక్కొక్కరినీ లోపలికి పంపించారు. వారి పేరు, వివరాలు సరిచూసుకున్న తర్వాత మరో గదికి వెళ్లాలని సూచించారు. శిక్షణ పొందిన సిబ్బంది అక్కడ వారికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. అదేంటి కరోనాకు ఇంకా వ్యాక్సిన్ రాలేదు కదా..! టీకా వేశారని చెబతున్నారేమిటని ఆశ్చర్యపోతున్నారా..! ఇదంతా మాక్ డ్రిల్! త్వరలోనే ప్రారంభించనున్న కరోనా టీకా కార్యక్రమ సన్నద్ధతను పరీక్షించేందుకు ప్రభుత్వం నిర్వహించిన ‘డ్రై రన్’ ఇది. నిజమైన టీకా వేయడం మినహా.. మిగతా ప్రక్రియను యథాతథంగా ఇందులో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో సోమవారం నిర్వహించిన ఈ వ్యాక్సినేషన్ డ్రై రన్ విజయవంతమైంది. టీకా కార్యక్రమంపై సిబ్బందిని సన్నద్ధం చేసేందుకు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌తోపాటు పంజాబ్, గుజరాత్, అసోం రాష్ట్రాల్లో 28, 29 తేదీల్లో డ్రై రన్ నిర్వహించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
అందులో భాగంగానే ఏపీ నంచి కృష్ణా జిల్లాను ఎంపిక చేసింది. దీంతో అధికారులు సోమవారం జిల్లాలో ఐదు చోట్ల డ్రై రన్ నిర్వహించారు. విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ప్రకాశ్‌నగర్‌లోని అర్బన్ హెల్త్ సెంటర్ (ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం), నగరంలోని పూర్ణ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ (ప్రైవేటు ఆస్పత్రి), తాడిగడపలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాల, కంకిపాడు మండలం ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈ కార్యక్రమంలో భాగంగా మాక్ డ్రిల్ చేపట్టారు. ఒక్కో ఆస్పత్రి పరిధిలో 25 మంది చొప్పున మొత్తం 125 మంది ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ను గుర్తించి వారికి డ్రై వ్యాక్సిన్ (డమ్మీ టీకా) అందించారు. ఈ డ్రై రన్ ద్వారా ‘కొ-విన్’ వెబ్ పోర్టల్ పనితీరును, వ్యాక్సిన్ పంపిణీలో తలెత్తే సమస్యలను తెలుసుకున్నారు. విజయవాడలోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో కృష్ణాజిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ సోమవారం ఉదయం డ్రైరన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ఐదు చోట్ల వైద్య ఆరోగ్యశాఖ నియమించిన ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో డ్రై రన్ కొనసాగింది. నిర్వహణలో తమకు ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదని, అన్ని చోట్లా ‘కొ-విన్’ పోర్టల్ బాగా పనిచేసిందని కలెక్టరు ఇంతియాజ్, ఇతర వైద్యాధికారులు తెలిపారు.
ప్రక్రియ సాగిందిలా..
‘కొ-విన్’ వెబ్‌పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన లబ్ధిదారులకు ముందుగా టైమ్‌స్లాట్స్ ప్రకారం మొబైల్‌కు మెసేజ్ పంపించారు. వాటిని చూసుకుని వారు వ్యాక్సినేషన్ సెంటర్లకు చేరుకున్నారు. లోపలికి పంపించే ముందు వారి వివరాలన్నీ సరిచూసుకుని రిజిస్ట్రేషన్ గదికి పంపించారు. అక్కడ డిజిటల్ అసిస్టెంట్ వారి వివరాలు సరిచూసుకుని వారిని వ్యాక్సినేషన్ గదికి పంపించారు. అక్కడ శిక్షణ పొందిన ఏఎన్‌ఎం.. లబ్ధిదారులకు టీకా ఎందుకు ఇస్తున్నామో.. దానివల్ల ప్రయోజనమేంటో వివరించి ఆ తర్వాత డమ్మీ టీకా ఇచ్చారు. మళ్లీ 28 రోజుల తర్వాత రెండో డోసు టీకా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తర్వాత వారిని అరగంటపాటు అబ్జర్వేషన్ గదిలో ఉంచి దుష్ప్రభావాలు ఏమీ లేవని నిర్ధారించాక ఇంటికి పంపించి వేశారు. కాగా.. గుజరాత్‌లోని గాంధీనగర్, రాజ్‌కోట్ జిల్లాల్లో.. పంజాబ్‌లోని లూధియానా, షహీద్ భగత్‌సింగ్ నగర్ జిల్లాల్లో.. అసోంలోని సోనిత్‌పూర్, నల్బరీ జిల్లాల్లో డ్రైరన్ విజయవంతమైంది.
‘స్ట్రెయిన్’ గుర్తింపునకు ప్రాంతీయ ల్యాబ్‌లు
కరోనా పాజిటివ్‌లకు కొత్త స్ట్రెయిన్ సోకి ఉంటే జన్యుక్రమాల విశ్లేషణ(జీనోమ్ సీక్వెన్సింగ్) ద్వారా గుర్తించేందుకు 10 ప్రాంతీయ లేబొరేటరీలను కేంద్రం గుర్తించింది. రాష్ట్రాలు సేకరించే కరోనా పాజిటివ్ నమూనాల్లో 5ు ఈ ల్యాబ్‌లకు పంపాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ల్యాబ్‌ల జాబితాలో హైదరాబాద్‌లోని సీఎ్‌సఐఆర్- సీసీఎంబీ, సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ కూడా ఉన్నాయి.
Updated Date - 2020-12-29T08:08:02+05:30 IST