సబ్బం హరి ఇంటి ప్రహరీ కూల్చివేత
ABN, First Publish Date - 2020-10-04T08:24:57+05:30
విశాఖలో టీడీపీనేత, మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి ప్రహరీ, మరుగుదొడ్డిని జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. జేసీబీలు,
విశాఖలో తెల్లవారుజామున ఆపరేషన్
పార్కు స్థలం కలుపుకొన్నారంటూ
కొన్ని నిర్మాణాలు తొలగింపు
ఫెన్సింగ్ వేసి, బోర్డు ఏర్పాటు
హరి ఇంటి వద్ద టెన్షన్ టెన్షన్
నోటీసు ఇవ్వలేదంటూ అభ్యంతరం
కక్ష సాధింపంటూ వాగ్వాదం
సబ్బంహరి ఇంటి ప్రహరీ కూల్చివేత
ఎంచుకొన్న టైం, కూల్చిన తీరుతో అధికారుల చర్యపై అనుమానాలు!
విశాఖపట్నం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): విశాఖలో టీడీపీనేత, మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి ప్రహరీ, మరుగుదొడ్డిని జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. జేసీబీలు, వందలాదిమంది పోలీసులతో సీతమ్మధారలోని ఆయన నివాసం వద్దకు అధికారులు శనివారం తెల్లవారుజాము 3.30 గంటలకు తరలివచ్చారు. సబ్బంహరి తన అభ్యంతరాలను, నిరసనలను వ్యక్తం చేస్తుండగానే.. అక్రమమంటూ కొన్ని నిర్మాణాలను కూల్చేశారు. నాలుగు గంటలకు మొదలైన కూల్చివేతలు ఉదయం పదిగంటల వరకు కొనసాగాయి. అనంతరం ఫెన్సింగ్ నాటి, జీవీఎంసీ బోర్డు ఏర్పాటుచేసి వెనుదిరిగారు. ఆక్రమణల తొలగింపులో భాగంగానే సబ్బంహరి నివాస ప్రాంగణంలో ఈ కూల్చివేతలు సాగించినట్టు అధికారులు పేర్కొన్నారు
అయితే, ఈ కూల్చివేతలకు అధికారులు ఎంచుకొన్న సమయం, కూల్చిన తీరుతో ఈ వ్యవహారం రాజకీయవేడి రేపింది. జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తున్న వారిలో సబ్బంహరి ఒకరు కావడంతో... ఇదంతా ‘కక్ష సాధింపులో భాగమే’ అనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
టెన్షన్.. టెన్షన్..
తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో పదుల సంఖ్యలో జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బంది, పోలీసులు కలిసి జేసీబీ, బాబ్‌కాట్‌తో సీతమ్మధారలోని సబ్బం హరి ఇంటి వద్దకు చేరుకున్నారు. నాలుగుగంటల సమయంలో కూల్చివేతలు ప్రారంభించారు. ఆ సమయంలో ఇంట్లో హరి నిద్రపోతున్నారు. విషయం తెలిసి బయటకువచ్చారు. తనకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారని జేసీబీకి అడ్డంగా సబ్బంహరి నిలబడ్డారు. సిబ్బంది ఫెన్సింగ్ పోల్స్ వేయబోగా, హరి అనుచరులు అడ్డుకున్నారు.
ఇదీ స్థలం కథ!
సీతమ్మధార నార్త్ ఎక్స్‌టెన్షన్‌లో ఏపీఎ్‌సఈబీ లేఅవుట్‌లో సబ్బంహరి ఇల్లు ఉంది. తన ఇంటికి తూర్పు వైపున ఉన్న మూడు ప్లాట్లను 1998లో సబ్బం హరి ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేశారు. పార్కును ఆనుకుని ఉన్న ఆ స్థలంలో దక్షిణం వైపు రోడ్డును ఆనుకుని కొంతస్థలంలో వాచ్‌మన్, సెక్యూరిటీ గార్డుల కోసం చిన్న పోర్షన్ నిర్మించారు. దీనికి జీవీఎంసీ నుంచి ప్లాన్ తీసుకున్నారు. మిగిలిన స్థలాన్ని ఖాళీగానే వదిలేసి లాన్‌ను ఏర్పాటుచేశారు.
అయితే ఈ క్రమంలో పార్కు స్థలాన్ని పది అడుగులు ఆక్రమించారనేది జీవీఎంసీ అధికారుల ఆరోపణ. అయితే, ప్రతి కొనుగోలునూ ధ్రువీకరించే పత్రాలు తన వద్ద ఉన్నాయని టౌన్‌ప్లానింగ్ జోన్-2 ఏసీపీ మహాపాత్రకు హరి తెలిపారు. పార్కు ప్రహరీ నుంచి పది అడుగుల రోడ్డు మాత్రమే ఉందని, అది తన స్థలానికి మాత్రమే కనెక్టవిటీ ఉన్నందున లాన్ ఏర్పాటుచేశానని, కావాలంటే ఆ స్థలాన్ని తీసుకోవచ్చునని సబ్బంహరి సూచించారు.
తనకు ముందుగా చెప్పి ఉంటే తానే ఫెన్సింగ్ ఏర్పాటుచేసి, మరుగుదొడ్డిని తొలగించేవాడినన్నారు. దీంతో అ ధికారులు ఆమేరకు స్థలంలో ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు.
Updated Date - 2020-10-04T08:24:57+05:30 IST