ఈనెల 20న రాష్ట్రవ్యాప్త నిరసనలకు సీపీఐ పిలుపు
ABN, First Publish Date - 2020-06-18T14:47:49+05:30
ఈనెల 20న రాష్ట్రవ్యాప్త నిరసనలకు సీపీఐ పిలుపు
అమరావతి: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ ఈ నెల 20న రాష్ట్రవ్యాప్త నిరసనలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 11 రోజులుగా రోజువారీ పెరుగుదలతో లీటర్ పెట్రోల్‌పై రూ.6.02, డీజిల్‌పై రూ.6.40కి పెరిగాయన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్రోలు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలను విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తొందని మండిపడ్డారు. ముడి చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని విమర్శించారు.
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలపై మరింత భారం పడుతుందన్నారు. బ్యాంకు రుణ ఎగవేతదారులకు, కార్పోరేట్ శక్తులకు తాయిలాలు ఇస్తున్న కేంద్రం ప్రజలపై పెట్రోభారం మోపడం తగదని వ్యాఖ్యానించారు. ఈ నెల 20న సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో జరగనున్న నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ప్రజానీకానికి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2020-06-18T14:47:49+05:30 IST