ఏపీలో ఒంటి కాలు...ఒంటి కన్ను పాలన: ముప్పాళ్ల నాగేశ్వరరావు
ABN, First Publish Date - 2020-07-09T18:56:34+05:30
ఏపీలో ఒంటి కాలు...ఒంటి కన్ను పాలన: ముప్పాళ్ల నాగేశ్వరరావు
గుంటూరు: రాజధాని అంశంలో బీజేపీ ద్వంద వైఖరి అవలంబిస్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మినహా అన్ని పార్టీలు అమరావతినే రాజధాని కోరుతున్నాయని తెలిపారు. అన్నిరకాల సర్వేలల్లోనూ రాజధాని అమరావతి సరైన నిర్ణయం అని వచ్చిందన్నారు. వైసీపీ పార్టీ శ్వాశత్వం కాదని, 70 సంవత్సరాల పాలన చేసిన కాంగ్రెస్ కనుమరుగైందని గుర్తు చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని మార్చకోకపోతే కాంగ్రెస్‌కు పట్టిన గతే వైసీపీకి పడుతుందని హెచ్చరించారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన హితవు పలికారు. ఒంటి కాలు, ఒంటి కన్ను పాలన ఆంద్రప్రదేశ్ రాష్టంలో కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి ఇలాంటి నిర్ణయం మంచిది కాదన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, హైకోర్టును కర్నూలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజధాని అమరావతిపై ప్రధాని మోదీ స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామన్నారు. విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదని తెలిపారు. స్మృతీ వనాన్ని మార్చాల్సిన అవసరం లేదని..ఎక్కడైతే గత ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేశారో అక్కడే ఏర్పాటు చేయాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
Updated Date - 2020-07-09T18:56:34+05:30 IST