కమిషనర్ ఉన్నట్టా.. లేనట్టా?
ABN, First Publish Date - 2020-06-01T08:06:21+05:30
దేశంలో మరెక్కడా.. ఎప్పుడూ లేని విధంగా మన రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) రాజ్యాంగ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
రాష్ట్ర ఎన్నికల సంఘంలో రాజ్యాంగ సంక్షోభం!
హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గందరగోళం
కనగరాజ్ నియామకాన్ని రద్దుచేసిన హైకోర్టు
రమేశ్‌కుమార్‌ను అంగీకరించని ప్రభుత్వం
మొండి పట్టుదలతో సర్కారు అభాసుపాలు
ఇప్పట్లో స్థానిక ఎన్నికలు లేనట్లేనా?
(అమరావతి-ఆంధ్రజ్యోతి):దేశంలో మరెక్కడా.. ఎప్పుడూ లేని విధంగా మన రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) రాజ్యాంగ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రాష్ట్రప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్, జీవోల రద్దుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ కనగరాజ్ నియామకం రద్దయింది. పూర్వ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మళ్లీ పదవిలోకి వచ్చినట్లయింది. దీంతో ఆయన మళ్లీ బాధ్యతలు స్వీకరించారని ఎస్‌ఈసీ కార్యాలయం ఓ సర్క్యులర్ జారీచేసింది. దీనికి ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఆయన్ను హైకోర్టు పునర్నియమించలేదని వాదిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్లు ప్రకటించింది. దరిమిలా ఆ సర్క్యులర్‌ను ఎస్‌ఈసీ కార్యాలయం ఉపసంహరించుకుంది. ఈ పరిస్థితుల్లో కమిషనర్ ఉన్నట్లో లేనట్లో అర్థం కావడం లేదు. ఈ వ్యవహారం రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తోంది. రాజ్యాంగ సంస్థల ప్రతిష్ఠను కాపాడాల్సిన జగన్ ప్రభుత్వం.. సాక్షాత్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పునే ఖాతరు చేయకుండా సరికొత్త వివాదానికి తెరదీసింది.
కరోనా వైరస్ కారణంతో తమ అభీష్ఠానికి విరుద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదావేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై కత్తిగట్టి మరీ ఆయన తొలగింపునకు ఏకంగా ఆర్డినెన్సే జారీచేసింది. కమిషనర్ పదవీకాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించి.. పదవీ విరమణ చేసిన మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్(77)ను ఆగమేఘాలపై కమిషనర్‌గా తీసుకొచ్చి కూర్చోబెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో తాను చెప్పినట్లే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వినాలని మొండిగా వ్యవహరిస్తూ అభాసుపాలయిందని న్యాయకోవిదులు విమర్శిస్తున్నారు.
ఉద్దేశపూర్వక జాప్యం..
నిజానికి వైసీపీ భారీ మెజారిటీతో అఽధికారంలోకి వచ్చిన వెంటనే.. అదే ఊపులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుందని అందరూ భావించారు. అందుకు విరుద్ధంగా వచ్చీ రాకముందే ప్రతిపక్షాలపై కక్ష ధోరణితో వ్యవహరించడం, గ్రామాల్లో ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు. ఆ తర్వాత గ్రామ సచివాలయాల ఏర్పాటు, వలంటీర్లుగా సొంత పార్టీ వాళ్లను నియమించుకోవడంలో నిమగ్నమై స్థానిక ఎన్నికల నిర్వహణను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారు. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం అనివార్య పరిస్థితుల్లో ఎన్నికలకు మొగ్గు చూపిది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తనకు అనుకూలంగా వ్యవహరించరన్న అనుమానం మొదట నుంచీ ముఖ్యమంత్రి జగన్‌కు ఉందని పలువురు అధికారులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకొంటున్నారు. అయితే అందుకు భిన్నంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వం పలు సందర్భాల్లో ఏకపక్షంగా వ్యవహరించినప్పటికీ రమేశ్‌కుమార్ చూసీచూడనట్లు వ్యవహరించారు.
చివరకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేయడం వల్లే అవకతవకలపై చర్యలకు ఉపక్రమించారు. ఈలోపు దేశంలో కరోనా వ్యాప్తి కావడంతో నిమ్మగడ్డ ఏకంగా ఎన్నికలనే వాయిదా వేశారు. దీంతో పాటు ప్రతిపక్షాల ఫిర్యాదుల ఆధారంగా ఇద్దరు కలెక్టర్లు, మరో ఇద్దరు ఎస్పీలను బదిలీచేయాలని ఆదేశించారు. దీనిని జగన్ జీర్ణించుకోలేకపోయారు. ఆయన చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారంటూ కులం పేరిట విమర్శించారు. తర్వాత ఆయన్ను పదవి నుంచి తొలగించేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు జరిగిపోయాయి. ఆయన పదవీకాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చి రమేశ్‌మార్‌ను తొలగించి.. జస్టిస్ కనగరాజ్‌ను ఆ స్థానంలో నియమించారు. అయితే ఆర్డినెన్స్‌ను, జస్టిస్ కనగరాజన్ నియామక ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేయడంతో ఆటోమేటిక్‌గా నిమ్మగడ్డ పదవి పదిలమని తేలిపోయింది.
అయితే ఈ తీర్పును అమలు చేయని ప్రభుత్వం ఆయన ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ బాధ్యతలు చేపట్టడాన్ని తిరస్కరించింది. ఎన్నికల సంఘం కార్యాలయ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆయన బాధ్యతలు స్వీకరించినట్లుగా ఇచ్చిన సర్క్యులర్‌ను రద్దు చేయించింది. సాక్షాత్తూ అడ్వకేట్ జనరల్ ప్రెస్‌మీట్ పెట్టి రమేశ్‌కుమార్ బాధ్యతలు చేపట్టినట్లు చేసిన ప్రకటనను తప్పుపట్టారు. పైగా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు ప్రభుత్వం అప్పీలు చేస్తుందని ప్రకటించారు.
ఆయనుంటే ఎన్నికల జరపం?
రమేశ్‌కుమార్ సారథ్యంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తోంది. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో నిమ్మగడ్డ నియామకం అనివార్యమని ఆదేశాలు వచ్చినా ఎన్నికలకు అంగీకరించకపోవచ్చని అంటున్నారు. ఆయన పదవీకాలం వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు ఉంది. ఎన్నికలను అప్పటివరకు జాప్యం చేసి.. తాము నియమంచే కొత్త కమిషనర్ ఆధ్వర్యంలో ఎన్నికలు పూర్తిచేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ నిమ్మగడ్డ తిరిగి పదవిలో కూర్చున్నా కరోనా కారణంగా ఆగస్టు లోపు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే పరిస్థితి లేదు. ఆ తర్వాత చేపట్టాలనుకున్నా.. ఏదో ఒకసాకుతో మరో మూడు నెలలు వాయిదా వేసే అవకాశముంది.
Updated Date - 2020-06-01T08:06:21+05:30 IST