జగనన్నా ‘సహకారం’ ఏదన్నా..!
ABN, First Publish Date - 2020-12-28T06:33:10+05:30
చిత్తూరు, రేణిగుంట సహకార చక్కెర ఫ్యాక్టరీలు, చిత్తూరు సహకార డెయిరీ దశాబ్దాలపాటు రాష్ట్ర సహకార రంగానికి తలమానికంగా నిలిచాయి. ఆ తర్వాత నిర్వహణాపరమైన లోపాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల పర్యవసానంగా క్రమేపీ నష్టాల బాట పట్టాయి.
జిల్లాలో తెరచుకోని చక్కెర ఫ్యాక్టరీలు
విజయా డెయిరీని విడిచి అమూల్ వెంట..
రైతులకిచ్చిన మాట నెరవేర్చని సీఎం
ఎన్నికల్లో గెలిచి అధికారం చేపడితే సహకార రంగంలో మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను, విజయా డెయిరీని తిరిగి తెరిపిస్తా. చెరకు.. పాడి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చేస్తా.
- ఎన్నికల ముందు జిల్లా పర్యటనలో జగన్ రైతులకిచ్చిన మాట
ఈ హామీతో మెజారిటీ ప్రజలు జగన్ వైపు మొగ్గుచూపారు. జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకుగానూ 13.. మూడు లోక్‌సభ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి ఏడాదన్నర దాటుతున్నా ఈ హామీలేవీ అములు కాలేదు. భవిష్యత్తులోనూ ఆ దిశగా ఎలాంటి ఆశారేఖలూ గోచరించడం లేదు.
- తిరుపతి, ఆంధ్రజ్యోతి
చిత్తూరు, రేణిగుంట సహకార చక్కెర ఫ్యాక్టరీలు, చిత్తూరు సహకార డెయిరీ దశాబ్దాలపాటు రాష్ట్ర సహకార రంగానికి తలమానికంగా నిలిచాయి. ఆ తర్వాత నిర్వహణాపరమైన లోపాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల పర్యవసానంగా క్రమేపీ నష్టాల బాట పట్టాయి. 1999-2004 నడుమ చంద్రబాబు సీఎంగా ఉండగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఈ మూడు సంస్థలూ మూతపడ్డాయి. 2004 ఎన్నికల్లో వీటిని తిరిగి తెరిపిస్తానని హామీ ఇచ్చి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జిల్లా ప్రజల మద్దతు సాధించారు. ఆయన డెయిరీని విడిచిపెట్టి సహకార చక్కెర ఫ్యాక్టరీలను మాత్రం తిరిగి తెరిపించారు. కొంతకాలంపాటు నడిచిన ఆ రెండు ఫ్యాక్టరీలు.. తిరిగి నష్టాలతో కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. కాకతాళీయంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే 2014-15లో మళ్లీ మూతపడ్డాయి. 2019 ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ వీటి పునరుద్ధరణకు హామీ ఇచ్చారు. ఆయన అధికారంలోకి రాగానే తండ్రి తరహాలోనే డెయిరీ సంగతి పక్కన పెట్టి చక్కెర ఫ్యాక్టరీలపై దృష్టి సారించారు. వాటి పునరుద్ధరణకు గల అవకాశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ నిపుణుల కమిటీని నియమించారు. ఈ కమిటీ చిత్తూరు, రేణిగుంట ఫ్యాక్టరీలను పరిశీలించింది. వివిధ వర్గాలతో చర్చించింది. చిత్తూరు ఫ్యాక్టరీ పునరుద్ధరణ సాధ్యం కాదని, రేణిగుంట ఫ్యాక్టరీని మాత్రం తిరిగి తెరవచ్చని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అంతే.. అక్కడితో సరి. రెండు ఫ్యాక్టరీలను తెరిపించాలని జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు గానీ, మంత్రులు గానీ, ఎంపీలు గానీ సీఎంపై ఒత్తిడి తేవడం లేదు. కనీసం దీనిపై సీఎంతో చర్చించిన దాఖలాలూ లేవు. చిత్తూరు ఫ్యాక్టరీ సంగతి దేవుడెరుగు.. కనీసం నిపుణుల కమిటీ సిఫారసు చేసిన రేణిగుంట ఫ్యాక్టరీనైనా తెరుచుకుంటే చాలని చెరకు రైతులు ఆశగా నిరీక్షిస్తున్నారు. సహకార రంగంలోని రెండు ఫ్యాక్టరీలూ మూతపడడం, ప్రైవేటు రంగంలోని ఫ్యాక్టరీలు కూడా దాదాపు అదే స్థితిలో ఉండటంతో జిల్లాలో చెరకు సాగు దాదాపు కనుమరుగయ్యే ప్రమాదం దాపురించింది. క్రషింగ్ సీజనులో ఒకటీ రెండు ప్రైవేటు ఫ్యాక్టరీలు తెరిచినా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం లేదు. దీంతో చెరకు సాగుకు రైతులు సాహసించలేకపోతున్నారు.
‘అమూల్’పై ప్రేమతో..
జిల్లాలో సహకార డెయిరీ ఒకప్పుడు దేశంలోనే రెండో స్థానంలో ఉండేది. పాడి రంగంలో అమితమైన పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టింది. అలాంటి డెయిరీని తిరిగి తెరిపిస్తానని వైసీపీ అధినేతగా హామీ ఇచ్చిన జగన్.. సీఎంగా ఇప్పుడా ప్రస్తావనే మరిచారు. దానికి భిన్నంగా గుజరాత్‌కు చెందిన డెయిరీ ‘అమూల్’ వెంట ప్రభుత్వం పరుగులు తీస్తోంది. ప్రభుత్వాదేశాలతో జిల్లా అధికారులు అమూల్ డెయిరీకి పాలు పోసేలా రైతుల వెంటబడి బతిమాలుతున్నారు. సహకార డెయిరీ విషయంలో తండ్రీ కొడుకులిద్దరూ పాడిరైతులకు ఇచ్చిన హామీలను విస్మరించారనే అపప్రధను మూటగట్టుకుంటున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ ఇచ్చిన హామీలకు కట్టుబడి సహకార రంగానికి చెందిన చిత్తూరు, రేణిగుంట చక్కెర ఫ్యాక్టరీలను తిరిగి తెరిపించాలని, అమూల్ డెయిరీకి మద్దతిచ్చే బదులు సహకార డెయిరీని పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.
Updated Date - 2020-12-28T06:33:10+05:30 IST