‘ఉప పోరు’కు టీడీపీ శ్రీకారం
ABN, First Publish Date - 2020-12-11T06:12:59+05:30
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోరుకు టీడీపీ శ్రీకారం..
అలిపిరిలో పనబాక, నేతల పూజలు
ఫోనులో దిశానిర్దేశం చేసిన చంద్రబాబు
తిరుపతి(ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోరుకు టీడీపీ శ్రీకారం చుట్టింది. ఆ పార్టీ అభ్యర్థి పనకబాక లక్ష్మి జిల్లా నాయకులతో కలసి గురువారం అలిపిరి పాదాల మండపంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, చంద్రబాబు పాలనను ప్రజలు కోరుకుంటున్నారన్నారు. సామాన్యుడికి అవసరమైన ఇసుకను దూరం చేశారని, అన్ని వర్గాల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. మల్లవరం ప్రాజెక్ట్, దుగరాజపట్నం పోర్టులు ముందుకుపోయిన పరిస్థితి కనిపించలేదన్నారు. ప్రతిగ్రామంలో పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని, తమ విజయానికి అందరూ సహకరించాలని కోరారు. పార్టీ యంత్రాంగాన్ని పటిష్ఠ పరిచేందుకు కార్యాచరణ మొదలు పెడుతున్నామని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. దాదాపు రెండేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదన్నారు. అందరినీ అణగదొక్కి, బెదిరించి పాలన చేసేందుకు శ్రీకారం చుట్టారన్నారు. యువత, అధికార వర్గాలు వైసీపీ పాలనతో మధనపడుతన్నాయని పేర్కొన్నారు. మనకు రాజధాని ఉందని చెప్పుకొనే పరిస్థితి లేదని, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదన్నారు.
అధికార యంత్రాంగం భయంతో పనిచేయాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేశారని విమర్శించారు. రోడ్లు దారుణంగా ఉన్నాయని, తట్ట మట్టి, టకార సిమెంట్ వేసిన పాపానపోలేదు. పెరిగిన ఇంటి పన్నులు చూస్తుంటే భయమేస్తోందన్నారు. మున్సిపాల్టీల్లో ఎలాంటి అభివృద్ధి చేయకపోయినా అధిక పన్నులను వసూలు చేస్తున్నారన్నారు. మద్యం వ్యాపారంలో దోచుకుంటున్నారని, ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టవేయడంలో చేతులెత్తేశారని ఆరోపించారు. ప్రజల ఆస్తులకు, ఆరోగ్యానికి రక్షణ లేకుండా పోతోందన్నారు.. ఉప ఎన్నికల్లో ఒక మంచి తీర్పును ప్రజలు ఇవ్వబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుగుణమ్మ, బత్యాల చెంగల్రాయులు, నరసింహ యాదవ్, పులివర్తి నాని, డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మబ్బు దేవనారాయణ రెడ్డి, సూరా సుధాకర్ రెడ్డి, బీఎల్ సంజయ్, చక్రాల ఉష, విజయలక్ష్మి, బ్యాంకు శాంతమ్మ, ఆర్సీ మునికృష్ణ, శ్రీధర్ వర్మ, దంపూరి భాస్కర్, మస్తాన్ నాయుడు రవినాయుడు, ఆనంద్‌గౌడ్, తిరుమల కేశవులు, రుద్రకోటి సదాశివం తదితరులు పాల్గొన్నారు.
రేణిగుంట బైపాస్ రోడ్డులో కొత్తగా ఏర్పాటు చేసిన లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ కార్యాలయాన్ని నేతలు సందర్శించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో నాయకులు ఫోన్‌లో మాట్లాడగా.. ఆయన భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. తిరుపతి నియోజకవర్గంలో టీడీపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
Updated Date - 2020-12-11T06:12:59+05:30 IST