తీవ్ర అనారోగ్యం వల్లే స్విమ్స్‌లో మరణాలు: డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ
ABN, First Publish Date - 2020-09-18T16:39:32+05:30
స్విమ్స్ కొవిడ్ ఆస్ప త్రిలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండడానికి కారణం..
తిరుపతి(ఆంధ్రజ్యోతి): స్విమ్స్ కొవిడ్ ఆస్ప త్రిలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండడానికి కారణం.. వైరస్ తీవ్రంగా సోకినవారు, ఇతర ఆరోగ్య సమస్య లున్నవారు, వృద్ధులు, వెంటిలేటర్ అవసరం ఉన్నవారు ఎక్కువగా రావడమేనని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ తెలిపారు. ఆంధ్రజ్యోతిలో వస్తున్న కథనాలపై స్పందిస్తూ ఆమె, ఈ క్లిష్ట కాలంలో స్విమ్స్ అందిస్తున్న సేవల గురించి వివరించారు. ఈ వివరాలతో ఒక ప్రకటనను మెడికల్ సూపరింటెండెంట్ పేరుతో స్విమ్స్ గురువారం విడుదల చేసింది.
దీని ప్రకారం.. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు 15 దాకా తీవ్ర అనారోగ్యంతో ఉన్న 3407 మంది కొవిడ్ సోకినవారు ఆస్పత్రిలో వైద్యం కోసం చేరారు. వీరిలో 87శాతం మంది ఆరోగ్యం కుదుటపడి డిశ్చార్జి అయ్యారు. కొవిడ్ బాధితులకు చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నదైనా రోగుల సామాజిక, ఆర్థిక పరిస్థితులతో నిమిత్తం లేకుండా అందరికీ వైద్య సాయం అంది స్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటిదాకా 2.21 కోట్ల రూపాయల విలువ చేసే రెమ్‌డెసివర్ ఇంజక్షన్లు, రూ.5.4లక్షల విలువ చేసే టోస్లిజుమాబ్ ఇంజ క్షన్లను అందించినట్లు ప్రకటనలో వివరించారు. మూత్రపిండాల సమస్యతో ఉన్న 200మంది పాజిటివ్ బాధితులకు డయాలసిస్ సేవలందించామని తెలిపారు. కిడ్నీ మార్పిడి జరిగిన 20 మంది పాజిటివ్ పేషెంట్లకు కూడా వైద్యం అందించామన్నారు.
1.79లక్షల టెస్టులు
ఇప్పటిదాకా స్విమ్స్ వీఆర్‌డీఎల్ ల్యాబ్‌లో 1,79,226 మందికి పరీక్షలు నిర్వహించగా, వీరిలో 25,991 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారని తెలిపారు.
విధుల్లో 300 మంది
డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది దాదాపు 300 మంది రాష్ట్ర కొవిడ్ ఆస్పత్రిలో సేవలందిస్తున్నారని వివరించారు. వివిధ విభాగాధిపతులు, 50 శాతం మంది ఫ్యాకల్టీ వైద్యులు, పీజీ డాక్టర్లు, 30 శాతం మంది ఇంటర్నీస్, వందలాదిమంది నర్సులు, పారా మెడికల్ సిబ్బంది వైరస్ బారినపడ్డా కోలుకుని వైద్యసేవలు అందిస్తున్నారని స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు.
కౌన్సెలింగ్ కేంద్రం
కొవిడ్ ఆస్పత్రిలో రోగుల సహాయకుల కౌన్సెలింగ్ ప్రతి రోజూ మధ్యాహ్నం రెండు నుంచి నిర్వహిస్తున్నామని తెలిపారు. సీసీ టీవీల ద్వారా ఎప్పటికప్పుడు రోగుల స్థితిని పర్యవేక్షిస్తున్నామని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్ ద్వారా కుటుంబాలకు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. స్విమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో 24 గంటలూ హెల్ప్‌లైన్ నెంబరు అందుబాటులో ఉంటుందని, 8333924682 నెంబరుకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు.
Updated Date - 2020-09-18T16:39:32+05:30 IST