భక్తుల పాలిట కల్పవల్లి సుగుటూరు గంగమ్మ
ABN, First Publish Date - 2020-03-17T11:27:27+05:30
ఆరోగ్య వరప్రదాతగా, భక్తుల పాలిట కల్పవల్లిగా ఖ్యాతిగాంచిన పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర మంగళవారం నుంచి రెండురోజులపాటు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్త య్యాయి.
మతసామరస్యానికి ప్రతీక
నేడు, రేపు జాతర
పుంగనూరు, మార్చి 16: ఆరోగ్య వరప్రదాతగా, భక్తుల పాలిట కల్పవల్లిగా ఖ్యాతిగాంచిన పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర మంగళవారం నుంచి రెండురోజులపాటు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్త య్యాయి. మత సామరస్యానికి ప్రతీకగా, అతిపెద్ద జాతరగా పేరుపొందడంతో జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడుల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ఏటా ఉగాది పండుగకు ముందు వచ్చే మొదటి మంగళవారం గంగజాతర నిర్వహిస్తారు. శక్తి ఆలయాల్లోని 8 ప్రాంతాల్లో స్థిరపడిన సుగుటూరు గంగమ్మ సోదరీమణులైన అష్టగంగమ్మలకు భక్తులు మొక్కులు తీర్చుకుంటారు.
జమీందార్ల ఇష్టదైవం గంగమ్మ
మధుర పాండ్యుల సంతతిగా సుగుటూరు నుంచి వచ్చిన పుంగనూరు జమీందార్లు పాలేగాళ్లుగా విజయనగర రాజుల కింద శిస్తు జమానాలు వసూలు చేసేవారు. వీరు పాలన చేపట్టినప్పటినుంచి అమ్మవారిని ఇష్టదైవంగా కొలిచేవారు. రాజ్యభాగ పరిష్కారం తర్వాత పుంగనూరు చేరిన వీరు శక్తిస్వరూపిణి సుగుటూరు గంగమ్మదేవతను తీసుకువస్తుండగా ప్రస్తుతం గుడి ఉన్నచోట రథం ఇరుసు విరిగిపోవడంతో అక్కడే అమ్మవారి గుడిని నిర్మించి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. జమీందారులు పాలేగాళ్లుగా వ్యవసాయం చేసే రోజుల్లో వారు కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండగా అమ్మవారి పాదపీఠం లభించడంతో సుగుటూరు గంగమ్మను వారు ఇంటి ఇలవేల్పుగా కొలుస్తూ ఘనంగా జాతర జరిపిస్తున్నారు.
పుంగనూరులో గంగమ్మజాతరను వారం రోజుల ముందుగానే తొలి, మలి చాటింపులతో ప్రజలకు తెలియజేస్తారు. మంగళవారం పుంగనూరు ప్యాలె్‌సలో భారీ ఎత్తున గొర్రెల సంత జరుగుతుంది. జమీందారి వంశీకులు రాత్రి కలశ ప్రతిష్ఠ, శాంతిపూజ నిర్వహించి అమ్మవారి విగ్రహానికి తొలిపూజ చేస్తారు. తర్వాత వీఐపీలు పూజలు నిర్వహించి ప్యాలెస్ నుంచి అమ్మవారిని ప్రత్యేక వాహనంపై ఏర్పాటు చేసి పట్టణ పురవీధుల్లో అత్యంత వైభవంగా మేళతాళాలు, బాణసంచా, డప్పువాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహిస్తారు. బుధవారం తెల్లవారు జామున ప్యాలెస్ వద్ద ఉన్న సుగుటూరు గంగమ్మ ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు. ఈ జాతరలో బెల్లం పానకం, పసుపునీరు, మజ్జిగ, కుండలతో నింపుకుని గెరిగెలు నెత్తినపెట్టుకొని మట్టికుండలపై రెండు మూరల ఎత్తు వరకు వేపాకు, పూలతో అలంకరించి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. స్త్రీలు, పురుషులు, గంగవేషాలు వేసుకుని పురవీధుల్లో గెరిగెలతో ప్రదర్శనగా వచ్చి మొక్కులు చెలిస్తారు. భక్తులు అమ్మవారికి జంతుబలులు సమర్పించి మంగళహారతులతో మొక్కులు తీర్చుకుంటారు.
అమ్మవారు బుధవారం తెల్లవారుజామున నుంచి భక్తుల దర్శనార్థం ఆలయంలో ఉంటారు. కోపమూర్తులైన సుగుటూరు గంగమ్మ, నడివీధిగంగమ్మను ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే జాతర సందర్భంగా జనం మధ్యకు తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. మిగిలిన రోజుల్లో గృహ నిర్బంధంలోనే ఇద్దరు దేవతామూర్తులను ఉంచుతారు. జమీందారి సంతతి వారు ప్యాలె్‌సలో తొలిపూజ నిర్వహించిన అనంతరం సుగుటూరు గంగమ్మ సోదరీమణులను పరామర్శించడానికి ఊరేగింపు అనంతరం ఆలయంలో కోలువుదీరుతారు. అమ్మవారి ఊరేగింపు సందర్భంగా పుంగనూరులో శక్తి ఆలయాలుగా 8 మూలల్లో స్థిరపడ్డ అష్ట గంగమ్మలైన పాత బస్టాండు సమీపంలోని విరూపాక్షి మారెమ్మ, తూర్పుపాలెంలో స్థలగంగమ్మ, పలమనేరురోడ్డులోని మల్లారమ్మ, తూర్పు మొగసాలలోని నల్లగంగమ్మ, కట్టకిందపాళ్యంలోని పడమటి గంగమ్మ, పుంగమ్మ కట్టపై నీళ్లరాళ్ల గంగమ్మ, కోనేరు వద్ద ఉన్న బోయకొండ గంగమ్మలను పలకరిస్తూ ఊరేగింపు సాగుతుంది. జాతర మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. అన్ని మతాల వారు దర్శించుకుని వేడుకల్లో పాల్గొంటారు. జాతర సందర్భంగా పుంగనూరులోని ఆలయాలు, ఇళ్లు, రంగులతో ముస్తాబయ్యాయి.
Updated Date - 2020-03-17T11:27:27+05:30 IST