దద్దరిల్లిన ఢమరుకనాదం
ABN, First Publish Date - 2020-02-22T11:46:01+05:30
ముగ్గురు సినీ సంగీత దిగ్గజాలు ఒకే వేదికపై చేరి శివనామ స్మరణతో భక్తులను ఆకట్టుకున్నారు.
ఉర్రూతలూగించిన కోటి, మణిశర్మ, శివమణి
కిక్కిరిసిన ధూర్జటి కళాప్రాంగణం
శ్రీకాళహస్తి అర్బన్, ఫిబ్రవరి 21: ముగ్గురు సినీ సంగీత దిగ్గజాలు ఒకే వేదికపై చేరి శివనామ స్మరణతో భక్తులను ఆకట్టుకున్నారు. ఓ వైపు శివమణి డ్రమ్స్ ఆహూతులను ఉర్రూతలూగించగా మరో వైపు ఆధ్యాత్మిక గీతాలతో భక్తి తరంగం ఉప్పెనలా ఉప్పొంగింది.శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ధూర్జటి కళాప్రాంగణంలో శుక్రవారం రాత్రి తెలుగు సినీ సంగీత దర్శకులు కోటి, మణిశర్మ భక్తి సంగీత విభావరి జరిగింది. గాయకులు శ్రీకృష్ణ, అరుణ్, శ్రీకాంత్, శివతో పాటు గాయనీమణులు సాహితి, శ్రీలలితలను కోటి సభికులకు పరిచయం చేశారు.ముందుగా కోటి స్వరపరచిన కాణిపాక గణనాయక, కాణిపాక కలదాయక అన్న భక్తి సంకీర్తనలతో గాయకుడు శ్రీకృష్ణ సాంప్రదాయంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శివతత్వసాయి... ఓంనమఃశివాయ అన్న బాణీని శివతో పాటు బృందం లయబద్ధంగా ఆలపించింది. సాయినామంతో పంచాక్షరి గీతం తరువాత పెద్దరాయుడు సినిమా నుంచి సామవేదం షణ్ముఖశర్మ రచించిన ఢమఢమ గుండె ఢమరుకం మోగె గీతం ఆలపించారు.ఇక జై చిరంజీవ సినిమా నుంచి మణిశర్మ స్వరపరచిన జైజై గణేశా, జై కొడతా గణేశా అన్న పాటతో సభికుల్లో ఉత్సాహం రెట్టింపైంది. పాట మధ్యలో శివమణి పరిగెత్తుకుంటూ వేదికపైకి ఎక్కి ఒక్కసారిగా డ్రమ్స్ చేతబట్టారు. గాయకుల పాటకు శివమణి రిథమ్ తోడు కావడంతో ఆ పాట మధ్యలో నుంచి భక్తుల స్పందన తన్మయత్వంలోకి జారింది.
అనంతరం శ్రీఆంజనేయం సినిమా నుంచి మణిశర్మ స్వరపరచిన రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ అనే పాటను ఆలపించారు. అనంతరం జగమేలు శివశంకరా... నువ్వుంటే మాకింక భయమేలరా,అర్జున్ సినిమా నుంచి మధుర మధుర తర మీనాక్షి, కంచి పట్టులా కామాక్షి అన్న పాటలు భక్తులకు హుషారు తెప్పించాయి. ఇంద్ర సినిమా నుంచి భంభం భోలే శంఖం మోగెలే అన్న పాటకు సభ చప్పట్లు, కేరింతలతో మార్మోగింది. పాట చివరలో శివమణి తిరిగి తన డ్రమ్స్ వాయిద్యంతో ఒక్కసారిగా ఆహూతులను తనవైపు తిప్పుకున్నారు. శివమణి డ్రమ్స్ విన్యాసాలతో సభ ఊర్రూతలూగింది.అంతకుముందు కోటి మాట్లాడుతూ మణిశర్మ మెలోడి పాటలకు కింగ్ అన్నారు.ఎంత నిపుణత ఉన్నా ప్రచారానికి దూరంగా ఉండటం ఆయన గొప్పదనమని కొనియాడారు.శివమణి గురించి మాట్లాడుతూ దేశంలోనే ఆయనకు మించిన గొప్ప రిథమిస్ట్ లేరంటూ కొనియాడారు.కైలాస సమానక్షేత్రమైన శ్రీకాళహస్తిలో శివనామ స్మరణాన్ని ఉచ్చరించడం, వినడం ఎంతో పుణ్యఫలం అని చెప్పారు. భక్తులు ఇచ్చే ప్రోత్సాహమే తమకు ఆశీస్సులన్నారు.
Updated Date - 2020-02-22T11:46:01+05:30 IST