డేంజర్...డేంజర్
ABN, First Publish Date - 2020-06-18T11:11:33+05:30
తిరుపతిలో ఉదయం వాకింగ్ మొదలు రాత్రి 10 గంటల వరకూ రోడ్లపై జనం కనిపిస్తూనే ఉన్నారు
అప్రమత్తం కాకుంటే చేయిదాటిపోయే ప్రమాదం
తిరుపతిలో ఇలా
ఆంధ్రజ్యోతి,తిరుపతి: తిరుపతిలో ఉదయం వాకింగ్ మొదలు రాత్రి 10 గంటల వరకూ రోడ్లపై జనం కనిపిస్తూనే ఉన్నారు. ప్రధానంగా చిన్నబజారు వీధి, తీర్థకట్టవీధి, గాంధీరోడ్డు కిక్కిరిసిపోయి ఉంటున్నాయి. కొందరు మాస్క్‌లను అలంకారప్రాయానికే పరిమితం చేశారు. మాస్ శానిటైజేషన్, రెడ్‌జోన్లలో కఠిన ఆంక్షల అమలును కార్పొరేషన్ అధికారులు, పోలీసులు పట్టించుకోవడంలేదు. ప్రస్తుతం నగరంలో 12 కంటైన్మెంట్ జోన్లు, 69 పాజిటివ్ కేసులున్నాయి.బుధవారమే పది కేసులు నమోదయ్యాయి. ఇటీవల కేసుల్లో చాలావరకు ఎవరినుంచి వైరస్ సోకిందో అంతుపట్టడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాగే కొనసాగితే త్వరలోనే వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
శ్రీకాళహస్తిలో కేసుల జోరు
శ్రీకాళహస్తిలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నా... జనం మాత్రం నిబంధనలు పాటించడం లేదు. అధికార యంత్రాంగం కూడా చూసీచూడనట్టే ఉంటోంది. ఫలితంగా పట్టణంలోనే 117 మందికి ఈ వైరస్ సోకింది. వీరే కాకుండా శ్రీకాళహస్తి మూలాలతో 9మంది ఉద్యోగులకూ కరోనా వచ్చింది. ఇవి కలిపితే ఈ సంఖ్య 126కు చేరుతుంది. ఇద్దరు మరణించారు కూడా. అయినా పట్టణంలో లాక్‌డౌన్ ఛాయలే లేవు. సంపూర్ణ లాక్‌డౌన్ సమయంలో మాత్రమే కొన్ని రోజులు జనం ఇళ్లకు పరిమితమయ్యారు. ప్రస్తుతం సడలింపులు ఇవ్వడంతో విచ్చలవిడిగా వీధుల్లోకి వచ్చేస్తున్నారు. దుకాణాల వద్ద భౌతిక దూరం అసలు పాటించడం లేదు. కొంతమంది మాస్కులు ధరించకుండానే వీధుల్లోకి వస్తున్నారు. కంటైన్‌మెంట్ జోన్లలో కూడా నిబంధనలు పాటించడం లేదు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించమని చెప్పేవారే లేరు.
భౌతిక దూరం బలాదూర్
కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నా పుంగనూరులో ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదు. దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద గుంపులు గుంపులుగా కన్పిస్తున్నారు. బుధవారం రెవెన్యూ, సబ్‌రిజిస్ర్టార్, ఎంపీడీవో కార్యాలయాల వద్ద ప్రజలు మాస్కులు ధరించకుండా ఇలా కిక్కిరిసి కనిపించారు.
- పుంగనూరు
నిబంధనలు బేఖాతరు
కరోనా నిబంధనలను చిత్తూరు జనం బేఖాతరు చేస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి ఏ వీధిలో చూసినా జనం గుంపులుగా గుమిగూడడం కన్పించింది. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల వద్దా క్యూల్లో తోసుకుంటూ అవస్థలు పడ్డారు. మాస్కులు ధరిస్తేనే సరుకులు ఇవ్వాలంటూ కమిషనర్ ఆదేశించినా ఎక్కడా పాటించడం లేదు. కొద్దిరోజులు మాస్కులు లేనివారికి జరిమానా విధించిన అధికారులు ఆపై పట్టించుకోకపోవడం సమస్యగా మారింది.
-చిత్తూరు
Updated Date - 2020-06-18T11:11:33+05:30 IST