ఒకేరోజు 496
ABN, First Publish Date - 2020-07-18T10:59:33+05:30
జిల్లాలో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. గురువారం రాత్రి 9 గంటల నుంచీ శుక్రవారం రాత్రి 9 గంటల వరకూ 24 గంటల ..
తిరుపతిలోనే 336 కరోనా కేసులు
హడలెత్తిపోతున్న జనం
తిరుపతి, జూలై 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. గురువారం రాత్రి 9 గంటల నుంచీ శుక్రవారం రాత్రి 9 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో ఏకంగా 496 పాజిటివ్ కేసులను యంత్రాంగం గుర్తించింది. జిల్లాలో ఇప్పటి వరకూ ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఒక తిరుపతి నగరంలో మాత్రమే 336 కేసులను గుర్తించగా మిగిలిన 160 కేసులూ ఇతర మండలాల్లో వెలుగు చూశాయి.
కాగా తాజా కేసుల్లో తిరుపతి రూరల్‌లో 34, చిత్తూరులో 22, పలమనేరు, పుత్తూరుల్లో 11 చొప్పున, రేణిగుంటలో 10, బీఎన్ కండ్రిగ, సత్యవేడు, శ్రీకాళహస్తిలలో 5 చొప్పున నమోదయ్యాయి. అలాగే నాగలాపురం, పాకాల మండలాల్లో 4 చొప్పున, ఐరాల, పుంగనూరు, విజయపురం, ఏర్పేడు, చంద్రగిరి మండలాల్లో 3 చొప్పున, జీడీనెల్లూరు, పాలసముద్రం, పీలేరు, పూతలపట్టు, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం, వరదయ్యపాలెం మండలాల్లో 2 చొప్పున, చిన్నగొట్టిగల్లు, కలికిరి, నగరి, నారాయణవనం, సదుం, యాదమరి, వడమాలపేట, కార్వేటినగరం, తవణంపల్లె, బంగారుపాలెం మండలాల్లో ఒక్కొక్కటి వంతున కేసులు నమోదయ్యాయి.
కొత్తగా గుర్తించిన ఈ కేసులతో కలిపి ఇప్పటి వరకూ జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 4539కి చేరుకుంది. కాగా తిరుపతిలో రోజూ వందలమంది కరోనా బారిన పడుతుండడంతో నగరం భయాందోళనతో వణికిపోతుండగా జిల్లావ్యాప్తంగానూ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నందున ప్రజానీకం హడలెత్తిపోతోంది.కేసులు విపరీతంగా పెరిగిపోతుండడానికి తోడు మరణాల సంఖ్య కూడా పెరుగుతుండడం జనానికి ఆందోళన కలిగిస్తోంది.
Updated Date - 2020-07-18T10:59:33+05:30 IST