చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు, ఎస్పీలపై వేటు!
ABN, First Publish Date - 2020-03-16T09:02:17+05:30
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనలను రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. రెండు జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను విధుల
- ఆ నలుగురినీ తప్పించండి
- మాచర్ల సీఐని సస్పెండ్ చేయండి
- పలమనేరు డీఎస్పీ, పుంగనూరు,
- రాయదుర్గం, తాడిపత్రి సీఐల బదిలీ
- ప్రభుత్వానికి ఎస్‌ఈసీ ఆదేశం
- నామినేషన్లను అడ్డుకోవడం దారుణం
- యంత్రాంగం ఉదాసీనత బాధాకరం
- మహిళా అభ్యర్థులు, బలహీనవర్గాలపై
- దాడులు శోచనీయం
- వీటితో ఎన్నికల ప్రక్రియ అపహాస్యం
- తిరుపతి, మాచర్ల, పుంగనూరు
- ఎన్నికలపై నిశిత పరిశీలన
- అవసరమైతే కొత్త షెడ్యూల్‌కు వెనుకాడం
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టీకరణ
అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనలను రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. రెండు జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను విధుల నుంచి తప్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఆదివారమిక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో అభ్యర్థులు క్రియాశీలంగా వ్యవహరించకుండా, అడుగడుగునా నామినేషన్లు వేయకుండా వారిని అడ్డుకోవడం, శాంతియుతంగా ఎన్నికలు జరగకుండా అవరోధాలు కల్పించడం అవాంఛనీయమన్నారు. బెదిరింపులు ప్రచారమాధ్యమాల ద్వారా స్పష్టంగా కనపడుతున్నాయని.. ఇది దురదృష్టకరమని తెలిపారు. ‘ఈ సంఘటనలు ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నట్లు, భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు భావించాల్సి వస్తోంది. కొన్నిచోట్ల అధికార యంత్రాంగం పక్షపాత ధోరణితో వ్యవహరించడం, ప్రేక్షకపాత్ర వహించడం బాధాకరం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఉన్న అధికారాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంటాయి.
ఈ నేపథ్యంలో అత్యంత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న గుంటూరు కలెక్టరు, రూరల్ ఎస్పీ, చిత్తూరు కలెక్టరు, తిరుపతి అర్బన్ ఎస్పీలను విధుల నుంచి వెంటనే తప్పించి.. ప్రత్యామ్నాయ అధికారులను సూచించాలి. మాచర్లలో జరిగిన హింసాత్మక సంఘటన నేపథ్యంలో ఉదాసీనంగా వ్యవహరించి నిందితులపై కేసులు నమోదు చేసి.. వెనువెంటనే బెయిల్ మంజూరుచేయడం గర్హనీయం. అందుకు సీఐని తక్షణమే సస్పెండ్‌చేసి ప్రత్యామ్నాయంగా ఆమోదయోగ్యమైన అధికారిని నియమించాలని సూచిస్తున్నాం. హింసాత్మక సంఘటనల నేపథ్యంలో శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలు, తిరుపతి, పలమనేరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను బదిలీ చేయాలి. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, పత్రాలు చింపివేయడం వంటి సంఘటనలు పెద్దఎత్తున జరిగినట్లు నిర్ధారించిన తిరుపతి, మాచర్ల, పుంగనూరు ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తున్నాం. వాటిలో అవసరమైనచోట కొత్త షెడ్యూల్‌ను ప్రకటించడానికి వెనుకాడం’ అని స్పష్టం చేశారు. కొందరు అధికారులపై చర్యలు తీసుకోవాలని, హింసాత్మక సంఘటనలు పునరావృతం కాకూడదని ఆశిస్తున్నామన్నారు. గ్రామ వలంటీర్ల తీరుపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని, వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు.
Updated Date - 2020-03-16T09:02:17+05:30 IST