‘లడ్డూ ప్రసాదం’ వెబ్‌సైట్‌పై కేసు
ABN, First Publish Date - 2020-12-11T07:14:53+05:30
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ప్రపంచంలో ఎక్కడికైనా డోర్ డెలివరీ చేస్తామని ప్రకటించుకున్న బాలాజీ లడ్డూ ప్రసాదం.
తిరుపతి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ప్రపంచంలో ఎక్కడికైనా డోర్ డెలివరీ చేస్తామని ప్రకటించుకున్న బాలాజీ లడ్డూ ప్రసాదం.కాం వెబ్‌సైట్‌పై తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈస్ట్ సీఐ శివప్రసాద్ రెడ్డి కథనం ప్రకారం.. కొందరు ప్రైవేటు వ్యక్తులు ఈ నెల 6న వెబ్‌సైట్ ప్రారంభించారని, దీనిపై 8వ తేదీన టీటీడీ అధికారులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని తెలిపారు. ఇదిలా ఉంటే http://balajiprasadam.com నిర్వాహకులు తమ వెబ్‌సైట్ హోం పేజీలో డిసెంబరు ఏడవ తేదీన ప్రారంభించిన వెబ్‌సైట్‌ను ఇకపై కొనసాగించడం లేదని పేర్కొన్నారు. టీటీడీ లడ్డూ కౌంటర్లలో విక్రయిస్తున్న లడ్డూలనే కొని, వాటినే తాము ఈ సంక్లిష్ట సమయంలో భక్తులకు సరఫరా చేయాలని భావించామని హోం పేజీలో పోస్టు చేయడం విశేషం.
తిరుమలలో ఏడాదికి 10 కోట్ల లడ్డూలను టీటీడీ తయారు చేసి ఒక్కో లడ్డూను రూ.50కి భక్తులకు విక్రయిస్తుంటుంది. అయితే ఈ వెబ్‌సైట్ నిర్వాహకులు కేవలం రెండు లడ్డూలను ఇంటికి సరఫరా చేయడానికి రూ.500చార్జ్ చేస్తున్నట్లు వెబ్‌సైట్ హోం పేజీలోనే ప్రకటించుకున్నారు. అలాగే నెలకు రెండు లడ్డూల వంతున ఏడాది పొడవునా పంపడానికి రూ.5000, రెండేళ్లకు రూ.9,600 చెల్లించాల్సి ఉంటుందని ప్రచారం చేసుకున్నారు.
Updated Date - 2020-12-11T07:14:53+05:30 IST