‘ప్రతిష్టాత్మకం’ నిన్నటితో సరి!
ABN, First Publish Date - 2020-08-01T09:58:07+05:30
సుమారు ఐదున్నరేళ్లకుపైగా కళకళలాడిన ఏపీసీఆర్డీయే.. చరిత్ర ఒడిలోకి జారిపోయింది.
- గవర్నర్ సంతకంతో సీఆర్డీయే రద్దు
- ఇకపై ఏఎంఆర్డీయేగా రూపాంతరం
- అమరావతి నిర్మాణంలో అద్భుత పాత్ర
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సుమారు ఐదున్నరేళ్లకుపైగా కళకళలాడిన ఏపీసీఆర్డీయే.. చరిత్ర ఒడిలోకి జారిపోయింది. పాలన వికేంద్రీకరణ బిల్లుతోపాటు ఏపీసీఆర్డీయే రద్దు బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేయడంతో ఇకపై సీఆర్డీయే పేరు ‘అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవల్‌పమెంట్ అథారిటీ(ఏఎంఆర్డీయే)’గా రూపాంతరం చెందనుంది. 2014, డిసెంబరు 22న ఏపీ అసెంబ్లీ ఏపీసీఆర్‌డీయే బిల్లును ఆమోదించగా, అదే నెల 30న అప్పటి వరకు ఉన్న వీజీటీఎం(ఉడా) స్థానంలో ఏపీసీఆర్డీయే ప్రారంభమైంది. ఆ రోజు నుంచి శుక్రవారం వరకు సుమారు 67 మాసాలపాటు ఉనికి లో ఉన్న సీఆర్డీయే కొద్ది రోజుల్లోనే ఏఎంఆర్డీయేగా మారనుంది. కొన్ని నెలల కిందటి వరకు ఏపీసీఆర్డీయే అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థ.
పేరుకు ప్రభుత్వ సంస్థే అయినప్పటికీ దాని ప్రధాన కార్యాలయం, అందులో పని చేస్తుండే దేశ విదేశాలకు చెందిన నిపుణులతో నిత్య సందడిగా ఉండేది. ఒక భావి మహానగరంగా అమరావతిని నిర్మించాలనే సంకల్పంతో గత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సంస్థ తదనుగుణంగానే అనతికాలంలో దేశ, విదేశాల్లో పేరొందింది. సీఆర్డీయేకు ప్రథమ కమిషనర్‌గా వ్యవహరించిన నాగులాపల్లి శ్రీకాంత్ ప్రముఖపాత్ర పోషించారు. అమరావతి కోసం సుమారు 34,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ప్రాతిపదికన ఎలాంటి ఘర్షణలు లేకుండానే సేకరించారు. రాజధానికి భూములిచ్చిన వారికి రిటర్నబుల్ ప్లాట్లను ఆన్‌లైన్ లాటరీ ద్వారా కేటాయించిన సీఆర్‌డీయే రికార్డు సృష్టించింది. అమరావతి మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్ సంస్థలతో కలసి పనిచేసింది.
Updated Date - 2020-08-01T09:58:07+05:30 IST