దళిత మేజిస్ట్రేట్‌పై దాడి!
ABN, First Publish Date - 2020-07-16T07:29:30+05:30
స్థల వివాదాన్ని అడ్డుపెట్టుకుని కొందరు దళిత మేజిస్ట్రేట్ రామకృష్ణపై దాడికి దిగారు. దాడి చేసింది వైసీపీ వర్గీయులేనని... వారికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా...
ఇటుకలతో కొట్టడంతో గాయాలు
మంత్రి పెద్దిరెడ్డి, ఆయన సోదరుడి అండతోనే
జస్టిస్ నాగార్జున రెడ్డిపై ఫిర్యాదు చేసినందుకే!
ఇదివరకే ట్రాక్టర్‌తో తొక్కించాలని చూశారు
పెద్దిరెడ్డి ఫోన్‌తో ఫిర్యాదు తీసుకోని ఎస్‌ఐ
మేజిస్ట్రేట్ రామకృష్ణ ఆక్రోశం
తిరుపతి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): స్థల వివాదాన్ని అడ్డుపెట్టుకుని కొందరు దళిత మేజిస్ట్రేట్ రామకృష్ణపై దాడికి దిగారు. దాడి చేసింది వైసీపీ వర్గీయులేనని... వారికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయన సోదరుడైన ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి మద్దతు ఉందని మేజిస్ట్రేట్ తెలిపారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట పట్టణంలో జరిగిన ఈ సంఘటన వివరాలను ఆయనే మీడియాకు వెల్లడించారు. మంత్రి ఒత్తిడితో తన ఫిర్యాదుపై పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని వాపోయారు. మేజిస్ట్రేట్ రామకృష్ణ ఎనిమిదేళ్ల కిందట కడప జిల్లా రాయచోటిలో పనిచేస్తూ... జస్టిస్ నాగార్జునరెడ్డితో తలెత్తిన వివాదంలో సస్పెన్షన్‌కు గురయ్యారు. సొంత ఊరైన చిత్తూరు జిల్లా బి.కొత్తకోట పట్టణం బైపా్‌సరోడ్డులో నివసిస్తున్నారు. దాడికి సంబంధించి ఆయన తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం తెల్లవారుజామున 5-6గంటల నడుమ తనఇంటి పక్కన శబ్దాలు రావడంతో ఆయన బయటికివచ్చి చూశారు. అక్కడ ఖాళీస్థలంలో ఉంచిన ఇటుకలను గుర్తుతెలియని వ్యక్తులు తరలించుకెళుతుండడం కనిపించింది. అడ్డుకుని ప్రశ్నించిన రామకృష్ణపై వారు ఇటుకలతో దాడిచేశారు. ఆయన 100కు కాల్‌చేయడంతో ఒక హెడ్‌కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నారు. అప్పటికే దాడికి పాల్పడినవారు పరారయ్యారు.
తన ఇంటివద్ద ఉన్న రిటైర్డు వీఆర్వో ఒకరితో తనకు స్థల వివాదముందని, దాడికి ఆయనే కారణం కావచ్చునని రామకృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. విచారణ నిమిత్తం ఇరువురినీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ‘‘అక్కడ జరిగిన విషయం ఎస్‌ఐకి వివరిస్తున్న సమయంలోనే మంత్రి పెద్దిరెడ్డి నుంచి ఎస్‌ఐకి ఫోన్ వచ్చింది. నా ఫిర్యాదును పట్టించుకోవద్దని మంత్రి చెప్పారు. దీంతో ఎస్‌ఐ కేసు నమోదు చేయకుండా వెళ్లిపోయారు’’ అని రామకృష్ణ వివరించారు. అనంతరం తాను ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా పోలీసుల ద్వారా వస్తేనే చికిత్స అందిస్తామని వైద్యులు చెప్పారని, దాంతో తాను మదనపల్లె వెళ్లి ప్రైవేటు ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ వైద్యుడి వద్ద వైద్యం చేయించుకున్నానని వివరించారు. తనపై దాడికి పాల్పడినవారికి మంత్రి పెద్దిరెడ్డి, ఆయన సోదరుడైన ఎమ్మెల్యే ద్వారకనాఽథ రెడ్డి మద్దతు ఉందని ఆరోపించారు. ‘‘2012లో నేను కడప జిల్లా రాయచోటిలో మేజిస్ట్రేట్‌గా పనిచేసే సమయంలో జస్టిస్ నాగార్జునరెడ్డితో వివాదం తలెత్తింది. ఆయనపై హైకోర్టుకు ఫిర్యాదు చేయడంతో 2013లో నన్ను సస్పెండ్ చేయించారు. జస్టిస్ నాగార్జునరెడ్డి బంధువులైనందునే పెద్దిరెడ్డి, వైసీపీ వర్గీయులు నన్ను వేధిస్తున్నారు. భౌతికంగా అంతం చేసేందుకూ ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో తన ఇంటివద్ద వున్న ఖాళీస్థలం గురించి రిటైర్డు వీఆర్వోతో ఉన్న వివాదాన్ని అడ్డుపెట్టుకుని గత సెప్టెంబరు 9న నన్ను ట్రాక్టర్‌తో తొక్కించి చంపాలని చూశారు. దీనిపై నేను ఇచ్చిన ఫిర్యాదు తీసుకోకుండా... నాపైనే ఎదురు కేసు నమోదు చేశారు’’ అని ఆరోపించారు. దానిపై జిల్లాఎస్పీకి ఫిర్యాదు చేశానని, తనపై నమోదైనది తప్పుడు కేసుగా 15రోజుల కిందట రుజువైందన్నారు. ఈ నేపథ్యంలో తనను మరోసారి కేసులో ఇరికించేందుకో, అంతం చేసేందుకో రెక్కీ చేశారన్నారు. మంగళవారం దాడికిదిగారని చెప్పారు. జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డిపైనా తీవ్ర ఆరోపణలు చేశారు.
స్పష్టత లేకుండాకేసు ఎలా?: ఎస్‌ఐ
మేజిస్ట్రేట్ రామకృష్ణ ఆరోపణలను బి.కొత్తకోట ఎస్‌ఐ సునీల్‌కుమార్ ఖండించారు. ‘కేసు వద్దు సమస్య పరిష్కారమైతే చాలని ఆయనే వెళ్లిపోయారు. ఏదో పల్లెలో తోసేశారని చెప్పారు. అదే రోజు సాయంత్రం చేతికి కట్టుకట్టుకుని వచ్చారు. దాడి చేశారా అని ప్రశ్నిస్తే లేదన్నారు. ఫిర్యాదు కూడా స్పష్టంగా లేదు. గతంలో ఇచ్చిన ఫిర్యాదు గురించి అడిగితే... మీ సిబ్బంది వద్దే ఉందన్నారు. సమస్య ఏమిటో స్పష్టత లేకుండా ఏమని కేసు ఫైల్ చేయాలి?’’ అని ఎస్‌ఐ ప్రశ్నించారు. ఆయన వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు కట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ వివాదంతో మంత్రి పెద్దిరెడ్డికి, ఆయన సోదరుడికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
Updated Date - 2020-07-16T07:29:30+05:30 IST