ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసైన్డ్‌ అంటే అలుసా!?

ABN, First Publish Date - 2020-03-06T08:39:16+05:30

అందరూ పేద, బడుగు రైతులే! జీవనాధారమైన భూములను కాపాడుకునేందుకు ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మరొకరు గుండె పగిలి మరణించారు. ఇంకో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రివర్స్‌ రాబిన్‌ హుడ్‌

బడుగుల భూములపై రెవెన్యూ జులుం

పేదల స్థలాల కోసం పేదల భూములే బలి

గతంలో ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు పంపిణీ

ఇప్పుడు.. అసైన్డ్‌ భూములూ స్వాధీనం

వాటిని అనుభవించే హక్కు లబ్ధిదారులదే

విస్తృత ప్రజాప్రయోజనాలకే సేకరించాలి

ఇళ్ల స్థలాలకు తీసుకోవడం ఇదే తొలిసారి

ఇచ్చి తీరాలంటూ అధికారుల హెచ్చరికలు

రాత్రికి రాత్రి పంటలు పీకి.. భూమి చదును

పరిహారం మాటెత్తకుండానే దౌర్జన్యం

దిగులుతో ఇద్దరు రైతుల ఆకస్మిక మృతి

కర్నూలులో మహిళా రైతు ఆత్మహత్య

అధికారులతో రోజువారీ భూ పోరాటం

గ్రామకంఠం భూములపైనా ప్రతాపం


పోలీసు జులుం... విన్నాం, చూశాం! ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది రెవెన్యూ జులుం! అవసరమైతే పోలీసులను కూడా తీసుకెళ్లి పేదలపై ప్రదర్శిస్తున్న జులుం! కన్నుపడితే చాలు... భూమిని లాగేసుకుంటున్నారు. పచ్చటి పంటలనూ తొక్కేస్తున్నారు. రాత్రికి రాత్రి చదును చేస్తున్నారు. ‘పేదలకు ఇంటి స్థలాల’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల పేదలకే కన్నీరు తెప్పిస్తున్నారు. ఉగాది రోజున 25 లక్షల మందికి ఇంటి స్థలాల పంపిణీ పండుగ ఒకవైపు! ఏళ్ల తరబడి తిండి పెడుతున్న భూములు కోల్పోతున్న బడుగు రైతుల గుండెల్లో గుబులు మరోవైపు! ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలాలు నిజంగానే పేదలకు  సంతోషం కలిగిస్తాయి. కానీ... అందుకు పేదల నుంచే బలవంతంగా భూములు లాక్కోవడం ఇందులో మరో కోణం! ఎవరి సంతోషానికి ప్రభుత్వం ఎవరిని బలిచేస్తున్నట్లు? 


నిన్న భూ లక్ష్మి! మొన్న సత్వాడ బాలరాజు..

ఇప్పుడేమో చావు బతుకుల మధ్య వెంకట విష్ణుమూర్తి! 

అందరూ పేద, బడుగు రైతులే! జీవనాధారమైన భూములను కాపాడుకునేందుకు ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మరొకరు గుండె పగిలి మరణించారు. ఇంకో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది ముగ్గురి వ్యధ కాదు. రాష్ట్రంలో వేలాది మంది పేద, బడుగు, బలహీనవర్గాల రైతుల కన్నీటి కథ. నిన్నటిదాకా తమ బతుక్కు ఆసరాగా నిలిచిన భూమి రాత్రికి రాత్రి మాయమవుతుందని తెలిసి పేదల గుండెపగిలిపోతోంది. అక్కడా, ఇక్కడా అని కాదు! రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఉగాది నాటికి 25 లక్షల పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల అమలుకు... రెవెన్యూ అధికారులు స్థలాల వేట ప్రారంభించారు. అసైన్డ్‌, గ్రామకంఠం, పోరంబోకు భూములను సాగుచేసుకుంటున్న దళిత, గిరిజన, బడుగు రైతులే వీరికి అలుసవుతున్నారు. 


ఆ భూములపైనే కన్ను

ఇంటి స్థలాల కోసం ప్రభుత్వ భూములతోపాటు భారీగా ప్రైవేటు భూములను సేకరించాలని తొలుత నిర్ణయించారు. 26 వేల ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించాలని, ఇందుకోసం రూ. 14 వేలకోట్లు అవసరమని అంచనా వేశారు. భూసేకరణకు అన్ని వేల కోట్లా... అని ఆర్థిక శాఖ చేతులెత్తేసింది. ఆర్థిక భారం పడకుండా స్థలాలు సేకరించాలని సర్కారు సూచించింది.


అంతే, ప్లాన్‌ మారింది. భూసేకరణ మార్గదర్శకాల్లో పేర్కొన్న రెండు అంశాలనే పేదలపైకి అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. అవి... గతంలో పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను వెనక్కు తీసుకొని ఇంటి స్థలాలకు పంపిణీ చేయొచ్చు. గతంలో ఇంటి స్థలాలు తీసుకొని నిర్మాణాలు చేయకుంటే, వాటిని కూడా స్వాధీనం చేసుకోవచ్చు. అసైన్డ్‌ సాగు భూములను వెనక్కు తీసుకుంటే పరిహారం ఇవ్వాలని చెప్పారు. అసైన్డ్‌ ఇంటి స్థలాన్ని తీసుకుంటే రూపాయి కూడా ఇచ్చేది లేదని తేల్చారు. భూ యజమానుల పరిస్థితి, వారి భవిష్యత్తుతో నిమిత్తం లేకుండా భూములు లాక్కుంటున్నారు.


దయా దాక్షిణ్యమేనా...

‘మీపై దయతలచి ఇచ్చిన భూములు. ఇన్నాళ్లూ తిన్నది చాలు. ఇక ఇచ్చేయండి’ అన్నట్లుగా అసైన్డ్‌ భూములపై రెవెన్యూ జులుం ప్రదర్శిస్తున్నారు. అసైన్డ్‌ భూములను కూడా అర్హులైన పేదలకే ఇస్తారు.  దళిత, గిరిజన, బడుగువర్గాల జీవనోపాధి కోసం కేటాయిస్తారు. ఆ భూములను లబ్ధిదారులు, వారి వారసులు అనుభవించవచ్చు. కానీ, యాజమాన్య హక్కులు మాత్రం ఉండవు. అంతమాత్రాన... వాటిపై ప్రభుత్వానికి అన్ని హక్కులు ఉన్నట్లు కాదు.


వాటిని ఎడాపెడా స్వాధీనం చేసుకోవడం కుదరదు. విస్తృత ప్రజా ప్రయోజనాల నిమిత్తం చేపట్టే ప్రాజెక్టులు... అంటే జలాశయాలు, రహదారుల నిర్మాణం కోసం అవసరాన్ని బట్టి మాత్రమే సేకరించవచ్చు. సేకరించే స్థలాలకు పరిహారం ఎంత ఇస్తారు, ప్రత్యామ్నాయం ఏమిటో కూడా చెప్పడంలేదు. అడిగినప్పుడు ఇస్తే పరిహారం వస్తుందని, బలవంతంగా తీసుకుంటే దమ్మిడీ కూడా రాదని బెదిరింపులకు దిగుతున్న సంఘటనలూ వెలుగులోకి వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో పంటలను తొలగించి మరీ రాత్రికిరాత్రి భూమిని చదును చేస్తున్నారు.


ఆత్మహత్యాయత్నాలు...  ఆగుతున్న గుండెలు

తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రొలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన నిరుపేద రైతు సత్వాడ బాలరాజును... అడిగినప్పుడు భూమి ఇవ్వకుంటే పరిహారం దక్కదని అధికారులు హెచ్చరించారు. ఆయన అదే రోజు రాత్రి గుండె ఆగి మరణించారు. ఈ ఘటన తర్వాతైనా ప్రభుత్వం తమ జోలికిరాదని పేద రైతులు భావించారు. కానీ, ఆ తర్వాత అసైన్డ్‌ భూముల సేకరణ వేగం మరింత పెరిగింది. అంతేకాదు, గ్రామకంఠం, చెరువుల సమీపంలోని వాగు, పోరంబోకు భూములనూ సేకరణ పరిధిలోకి తీసుకొచ్చారు.  

కర్నూలు జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరుకు చెందిన భూలక్ష్మికి రెండెకరాల భూమి ఉంది. భూసేకరణకు వ్యతిరేకంగా న్యాయం కోరుతూ ఇప్పటికే కోర్టును  ఆశ్రయించారు. అయినా, ఆ భూమిని ఇంటి స్థలాలకోసం తీసుకునే ప్రయత్నం చేయడంతో పురుగుల మందు తాగి చనిపోయింది. 

విశాఖ జిల్లా మునగపాక మండలంలో రైతు వెంకట విష్ణుమూర్తి అనుభవంలో ఉన్న గ్రామకంఠం భూమితోపాటు 12 సెంట్ల స్థలాన్ని కాపాడుకోవడం కోసం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. 

ప్రకాశం జిల్లా చిన్న కందుకూరుకు చెందిన మాణిక్యమ్మ 1.11 ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్నారు. స్థలాలకోసం ఆ భూమిని తీసుకునేందుకు ఇప్పటికే పంటను దున్నించారు. దీంతో ఆమె చావనైనా చస్తాను కాని భూమిని వదులుకోనంటూ పురుగుల మందుడబ్బా చేతపట్టుకొని పోరాటం చేస్తున్నారు. 


పేదలకోసం పేదలే బలి

పేదలకు  ఇంటి స్థలాలు ఇచ్చేందుకు అసైన్డ్‌, గ్రామకంఠం భూములను ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించినప్పుడు రెవెన్యూ అధికారులు చిత్రమైన సమాధానం చెబుతున్నారు. ‘‘గతంలో ఓ పేదకు ఎకరం సాగు భూమి ఇస్తే ఒక్కరే అనుభవించారు. ఇప్పుడు ఆదే  భూమిని 40 మంది పేదలకు ఇంటి స్థలాలుగా ఇస్తున్నాం. అందువల్ల ఎక్కువమందికి మేలు జరుగుతుంది కదా!’’ అని వాదిస్తున్నారు. అంతే తప్ప... తమ చర్య వల్ల ఎన్నో ఏళ్లుగా బువ్వ పెడుతున్న భూమిని పేదల నుంచి దూరం చేస్తున్నామని మాత్రం అంగీకరించడంలేదు. 


‘‘ఇప్పటిదాకా ప్రైవేటుగా భూములు సేకరించి ఇంటి స్థలాలు ఇచ్చాం. ఇప్పుడంతా రివర్స్‌లో నడుస్తోంది. పేదలకు ఇంటిస్థలం ఇవ్వాలంటే, మరో పేద సాగు భూమిని లాక్కోవడమే మార్గం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు’’ అని ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతి, ఆంధ్రజ్యోతి

Updated Date - 2020-03-06T08:39:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising