ముంచిన వాన
ABN, First Publish Date - 2020-09-14T11:15:57+05:30
కరు వు జిల్లాలో వర్షం వచ్చి ఒకసారి రాక మరోసారి అన్నదా తను ఏడిపిస్తూనే ఉంది.
చేతికొచ్చిన పంటలు వర్షార్పణం
పొలాల్లోనే తడిసిన వేరుశనగ
భారీగా నష్టం
లబోదిబోమంటున్న అన్నదాతలు
అనంతపురం వ్యవసాయం/రూరల్, సెప్టెంబరు 13 : కరు వు జిల్లాలో వర్షం వచ్చి ఒకసారి రాక మరోసారి అన్నదా తను ఏడిపిస్తూనే ఉంది. ప్రస్తుత జడివానకు జిల్లాలో చేతికొచ్చిన పంటలు నీట మునిగాయి. పొలాల్లోనే వేరుశనగ తడిసిపోయింది. వరి, ప్రత్తి పంటలు నీట మునిగాయి. కళ్లెదుటే పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం విస్తారంగా వర్షం పడింది. ఆయా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు ప్రాం తాల్లో అర్ధరాత్రి వరకు జల్లులు పడ్డాయి. వర్ష ప్రభావం వేరుశనగ పంటపై తీవ్రంగా పడింది. ఈ ఏడాది జూన్ నెలలోసాగు చేసిన వేరుశనగ పంట కోతలు గత వారం రోజులుగా మొదలు పెట్టారు.
పలు ప్రాంతాల్లో పంట కోతలు పూర్తి చేసి పొలాల్లోనే కుప్పలుగా ఉంచారు. మరికొన్ని ప్రాంతాల్లో కల్లాలకు తరలించుకొని వామి వేసుకున్నారు. భారీ వర్షానికి పొలాల్లో కుప్పలుగా ఉంచిన వేరుశనగ తడిసిపోయింది. తద్వారా తీవ్రంగా పంటనష్టం జరిగింది. రెండు నెలల కిందట కురిసిన వరుసగా వర్షా లకు దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది. ఈ నేపథ్యంలో అరకొరగా పండిన పంటకు కూడా మరోమా రు వర్షం నష్టం కలిగించింది. వర్షానికి వేరుశనగ పంట తడిసిపోవడంతో పంటంతా నల్లగా మారింది. పొలాల్లోనే కాయలు రాలిపోయాయి. తద్వారా రైతులకు పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు.
అనంతపురం మండలంలోనే రూ.2.7 కోట్ల నష్టం
అనంతపురం మండలంలోని పలు గ్రామాల్లో 460 హెక్టార్లల్లో కోత కోసిన వేరుశనగ పంట పొలాల్లోనే తడిసి పోయింది. తద్వారా రైతులకు రూ.2.7 కోట్ల నష్టం వాటి ల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశా రు. ఉరవకొండలో 8 హెక్టార్లల్లో పత్తి, 5 హెక్టార్లల్లో కంది, 15 హెక్టార్లల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. తద్వారా రైతులకు రూ.3 లక్షలకుపైగా నష్టం వాటిల్లింది. ధర్మవరంలో 5 హెక్టార్లలో రూ.1.44 లక్షల విలువైన వేరుశనగ దెబ్బతింది.
విస్తారంగా వర్షాలు..!
జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు విస్తారంగా వర్షం పడింది. అత్యధికంగా యల్లనూరులో 100 మి.మీ వర్షపాతం నమోదైంది. వజ్రకరూరు 60.4, గుంతకల్లు 45.0, గుత్తి, పెద్దవడుగూ రు మండలాల్లో 52.4, యాడికి 62.0, తాడిపత్రి 44.0, పె ద్దపప్పూరు 67.4, శింగనమల 40.0, పామిడి 90.4, ఉరవ కొండ, నల్లమాడ 42.2, నార్పల, పుట్లూరు 42.4, సోమందేపల్లి 40.2 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగిలిన మండ లాల్లో 26.2 మి.మీలోపు వర్షపాతం నమోదైంది. ఈనెల జిల్లా సగటు సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ఇప్పటి దాకా 119.4 మి.మీ వర్షపాతం నమోదైంది. పొంగిన వాగులు..
ఉరవకొండ పట్టణంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. రాయంపల్లి, ఉరవకొండ రహదారిలో వంకలు ఉధృతంగా ప్రవహించడంతో వరి పొలాలు నీట మునిగాయి. బూదగవి చెరువు వర్షపు నీటితో కళకళలాడింది. పామిడి మండలంలోని నీలూరు గ్రామంలో కురిసిన వర్షానికి సుగుణమ్మ అనే మహిళ ఇళ్లు శనివారం రాత్రి కుప్పకూలింది. అదేగ్రామానికి చెందిన రమణా రెడ్డి ఇళ్లు కూడా వర్షం ధాటికి కూలిపోయింది. యల్లనూరు మండలంలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో ఎర్రవంక, తిరుమలాపురం వంకలు ఉధృతంగా ప్రవహించడంతో చిత్రావతి నది కూడా ప్రవహించింది. యల్లనూరు, నిట్టూరు చెరువుల్లోకి కూడా నీరు వచ్చి చేరింది.
పెద్దవడుగూరులో శనివారం అర్ధరాత్రి వరకు ఎడతెరిపి లేకుండా పడిన వర్షానికి ప్రత్తి పంట నీటి మునిగింది. పందుల వాగు పొంగిపొర్లడంతో ఆయా గ్రామా లకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వీరన్నపల్లి సమీపంలో ఉన్న బ్రిడ్జి వరదనీటి ప్రవాహానికి తెగిపోవడంతో రాకపోకలు స్తంభించాయి.
గుత్తి: మండల వ్యాప్తంగా శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. వంకలు, వాగులు పొంగిపొర్లాయి. దీంతో ఉప్పు వంక, గుత్తి చెరువువద్ద ఉన్న కల్వర్టు, కొజ్జేపల్లి వద్ద ఉన్న కల్వర్టులు వర్షపునీటితో పొంగిపొర్లాయి. వాహనాల రాకపోకలు ఆగిపోయాయి.
Updated Date - 2020-09-14T11:15:57+05:30 IST