వంకను తలపిస్తున్న పూలకుంట రోడ్డు
ABN, First Publish Date - 2020-10-04T09:15:14+05:30
మండలంలోని పూలకుంట గ్రామంలో ఓ ప్రధాన రహదారి వర్షపు నీటితో వంకను తలపిస్తోంది.
గ్రామస్థులకు తప్పని అవస్థలు
పట్టించుకోని పాలకులు, అధికారులు
అనంతపురం రూరల్, అక్టోబరు3: మండలంలోని పూలకుంట గ్రామంలో ఓ ప్రధాన రహదారి వర్షపు నీటితో వంకను తలపిస్తోంది. దీంతో గ్రామస్థుల అవస్థలు వర్ణతీతంగా మారాయి. వర్షపు నీరు వెళ్లేందుకు అవకాశం లేని కారణంగా నీరంతా ఇళ్ల ముంగిట నిలుస్తోంది. మోకాలి లోతు మేర నీరు ఉండటంతో ప్రజలు తీవ్ర అసౌకార్యానికి గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పరిస్థితి చూసి వెళ్లడం తప్ప.. సమస్యను పరిష్కరించలేదని గ్రామస్థులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. గ్రామం నుంచి దుర్గం, నార్పల, అనంతపురం నగరానికి వెళ్లే వీలుంది.
అయితే గతంలో మట్టి రోడ్డు కారణంగా గ్రామస్థులు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో రూ.5 లక్షలతో కొంతమేర సీసీ రోడ్డు నిర్మించారు. అయితే రోడ్డు నిర్మాణం సక్రమం లేనికారణంగా నీరంత రోడ్డు పైనే నిలుస్తోంది. సీసీ రోడ్డు ఎత్తు పెంచడం వల్ల నీరు నిలిచిపోతోంది. అయితే ఇటివల కురిసిన వర్షాలకు రోడ్డు మరింతగా వర్షనీటికి అధ్వానంగా మారింది. ఇదిలా ఉండగా స్థానికంగానే సచివాలయం ఉండటం గమనార్హం. నిత్యం అధికారులు అక్కడే ఉంటున్నా వాటిని పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.
మరమ్మత్తులు చేసిన ప్రయోజనం ఏదీ..?
గ్రామస్థులు సమస్యలను ఇటివల అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈక్రమంలోనే అధికారులు రోడ్డుకు ఇరువైపులా మట్టిని తోలి చదును చేశారు. అయితే నీళ్లు వెళ్లేందుకు ఆస్కారం లేకపోవడంతో అధికారులు రోడ్డుకు ఇరువైపులా మట్టిని తోలినా ప్రయోజనం లేకుండా పోయిందని గ్రామస్థులు చెబుతున్నారు. కాగా రోడ్డు పక్కన కాలువ ఏర్పాటు చేస్తే నీరు వెళ్లేందుకు అవకాశం ఉంది.
అయితే స్థానికంగా ఉండే కొంత మంది అధికార పార్టీ నాయకులు అడ్డు పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు కాలువ ఏర్పాటు చేస్తేందుకు ప్రయత్నించినా అధికారులు సైతం ప్రజా ప్రతినిధుల పేర్లు చెప్పి ఆ పని కూడా చేయకుండా అడ్డు పడినట్లు గ్రామస్థులు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనప్పటికీ రోడ్డు సక్రమంగా వేయని కారణంగా గ్రామస్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.
Updated Date - 2020-10-04T09:15:14+05:30 IST