ఓటర్ల నమోదులో అన్ని పార్టీలూ భాగస్వాములవ్వాలి
ABN, First Publish Date - 2020-12-15T06:48:34+05:30
జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు, సవరణపై ప్రజల్లో విస్తృత అవగాహన, ప్రచారం కల్పించటంలో అన్ని రాజకీయ పార్టీలూ భాగస్వాములవ్వాలని జిల్లా ఎలక్టోరల్ రోల్ పరిశీలకురాలు శోభ కోరారు.
జిల్లా ఎలక్టోరల్ రోల్ పరిశీలకురాలు శోభ
అనంతపురం, డిసెంబరు14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు, సవరణపై ప్రజల్లో విస్తృత అవగాహన, ప్రచారం కల్పించటంలో అన్ని రాజకీయ పార్టీలూ భాగస్వాములవ్వాలని జిల్లా ఎలక్టోరల్ రోల్ పరిశీలకురాలు శోభ కోరారు. సోమవారం స్థానిక రోడ్లు, భవనాలు అతిథి గృహంలో 2021 ప్రత్యేక ఓటర్ల జాబితా రూపకల్పనపై ఆమె వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితా అంశంలో జిల్లా యంత్రాంగానికి రాజకీయ పార్టీలు సహకరిస్తే.. తప్పులు లేకుండా రూపొందించే అవకాశం ఉంటుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం వరకూ కొత్తగా ఓటరు నమోదు చేసుకునేందుకు సమయముందన్నారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి, జనవరి 15 నాటికి తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామన్నారు. కొన్ని పార్టీల ప్రతినిధులు పలు అంశాలను పరిశీలకురాలి దృష్టికి తీసుకెళ్లారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆమె సమాధానమిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ ప్రతినిధులు నల్లప్ప, నారాయణస్వామి, టీడీపీ నుంచి కామేశ్వరకుమార్, వైసీపీ తరపున చంద్రశేఖర్‌రావు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
ఎలక్టోరల్ రోల్ పరిశీలకురాలిని కలిసిన కలెక్టర్
జిల్లాకు వచ్చిన ఎలక్టోరల్ రోల్ పరిశీలకురాలు శోభను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆమెను కలిసి జిల్లాలో ఓటర్ల నమోదు, సవరణలకు సంబంధించిన అంశాల పై చర్చించారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు, ఫిర్యాదులపై సమీక్షించారు.
Updated Date - 2020-12-15T06:48:34+05:30 IST