ఇసుక సరఫరాను సులభతరం చేయాలి
ABN, First Publish Date - 2020-12-17T07:01:51+05:30
జిల్లాలో ప్రజా, ప్రభుత్వ అవసరాలను దృష్టిలో ఉంచుకుని. ఇసుక సరఫరాను సులభతరం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, సీఎంఓ కార్యదర్శి సొలమన్ ఆరోఖ్యరాజ్.. జిల్లా కలెక్టర్, జేసీలను ఆదేశించారు. ఆ మేరకు అవసరమైన ఇసుక నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
కలెక్టర్, జేసీలకు రాష్ట్ర అధికారుల ఆదేశాలు
అనంతపురం, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రజా, ప్రభుత్వ అవసరాలను దృష్టిలో ఉంచుకుని. ఇసుక సరఫరాను సులభతరం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, సీఎంఓ కార్యదర్శి సొలమన్ ఆరోఖ్యరాజ్.. జిల్లా కలెక్టర్, జేసీలను ఆదేశించారు. ఆ మేరకు అవసరమైన ఇసుక నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. బుధవారం సచివాలయం నుంచి వారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఇసుక నిల్వలను పెంచుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక బుకింగ్ శాతం పెంచాలన్నారు. అందుబాటులో ఉన్న ఇసుక రీచ్‌లతోపాటు అవకాశమున్న చోట్ల కొత్త వాటిని గుర్తించి, స్టాక్ పాయింట్లలో నిల్వ ఉంచాలన్నారు. భూగర్బజల శాఖ అధికారుల సమన్వయంతో రీ సర్వే నిర్వహించి, అనుకూలమైన చోట్ల కొత్త రీచ్‌లను గుర్తించి, అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రభుత్వ నిర్మాణాలు, గృహ నిర్మాణాలకు భారీ స్థాయిలో ఇసుక అవసరమవుతుందన్నారు. దీనిని దృష్టి లో ఉంచుకుని, ఇసుక నిల్వలను పెంచుకునేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. డోర్ డెలివరీ నిర్వహణను నిరంతరాయంగా సాగించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు.. తనకల్లు తహసీల్దార్ కార్యాలయం నుంచి హాజరయ్యారు. జిల్లాలో పరిస్థితిని ఆయన వారికి వివరించారు. అక్టోబరులో కురిసిన భారీ వర్షాలు, నివర్ తుఫాను ప్రభావంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని 130 థర్డ్ ఆర్డర్ ఇసుక రీచుల్లో నీరు చేరిందన్నారు. తద్వారా ఇసుక నిల్వలను పెంచుకోలేకపోయామన్నారు. వినియోగదారుల అవసరాలకు సరిపడా ఇసుకను అందించటం పై దృష్టి సారించామన్నారు. ప్రభుత్వ భవన నిర్మాణాలకు ఇసుకను అందుబాటులో ఉంచామన్నారు. కొత్తగా 11 రీచులను గుర్తించామనీ, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపుతామని వివరించారు. వీలైనంత త్వరలో ఇసుక నిల్వలను పెంచుకుంటామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కదిరి ఆర్డీఓ వెంకటశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యాలను పూర్తి చేయాలి.. బ్యాంకర్లకు కలెక్టర్ ఆదేశం
జగనన్న తోడు, వైఎ్‌సఆర్ బీమా పథకాలకు సంబంధించి నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ గంధం చంద్రుడు.. బ్యాంకర్లను ఆదేశించారు. ఆయన బుధవారం బ్యాంకర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్న తోడు, వైఎ్‌సఆర్ బీమా పథకాల ద్వారా మం జూరు చేయాల్సిన రుణాలపై మాట్లాడారు. జిల్లాలోని 482 బ్యాంకు శాఖల్లో జగనన్న తోడు, వైఎ్‌సఆర్ బీమా ప్రక్రియను వందశాతం పూర్తి చేయాలన్నారు. ఆ క్రమంలో నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేసి, లబ్ధిదారులకు రుణాలను త్వరితగతిన అందించాలన్నారు. మంగళవారం వరకూ 20 మండలాల్లో జగనన్న తోడుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్‌కు జేసీ సిరి, డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి, మెప్మా పీడీ రమణారెడ్డి, ఎల్‌డీఎం మోహన్‌మురళి, బ్యాంకు కంట్రోలర్ హాజరయ్యారు.
Updated Date - 2020-12-17T07:01:51+05:30 IST