రేపు రాజధాని రణభేరి పేరుతో నిరసన: పువ్వాడ సుధాకర్
ABN, First Publish Date - 2020-08-22T17:20:56+05:30
రాజధానిని తరలించవద్దంటూ రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం రేపటికి 250వ రోజుకు చేరుకుంటుంది.
అమరావతి: రాజధానిని తరలించవద్దంటూ రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం రేపటికి 250వ రోజుకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా రేపు రాజధాని రణభేరి పేరుతో అన్ని శిబిరాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అమరావతి జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ తెలిపారు. రేపు అన్ని శిబిరాల్లో పళ్ళాలు, గరిటేలు మోగిస్తామన్నారు. అన్నదాత ఆక్రందన పేరుతో నిరసనలు చేపడుతామని... కొంగుచాచి భిక్షాటన కార్యక్రమం చేస్తామని ఆయన తెలిపారు. కాగడాల ప్రదర్శన వంటి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని కార్యక్రమాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తున్నామని... శాంతియుతంగా రేపు రాజధాని రణభేరి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని సుధాకర్ తెలియజేశారు.
అమరావతి దళిత జేఏసీ నేత మార్టిన్ మాట్లాడుతూ... సీఎం దళితుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. దగపడ్డ దళితుడా పేరుతో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చాక రాజధానిలో దళితులు తిండికి లేక అల్లాడుతున్నారని మార్టిన్ మండిపడ్డారు.
ముస్లిం జేఏసీ నేత సాహెబ్ జాన్ మాట్లాడుతూ...సీఎం మాటలు విని విశాఖ ప్రజలు మోసపోవద్దని కోరారు. రాజధానిలో ఈ ప్రభుత్వం వల్ల దళితులు, ముస్లింలు మోసపోయారన్నారు.
ఎస్టీ రైతు రాంబాబు మాట్లాడుతూ... రాజధానిలో ఒక కమ్మ వారే ఉన్నారని ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అన్ని వర్గాల వారు రాజధానికి భూములు ఇచ్చారని తెలిపారు.
Updated Date - 2020-08-22T17:20:56+05:30 IST