‘ఒక ప్లాన్ ప్రకారం వైసీపీ నేతలు మండలికి వచ్చారు’
ABN, First Publish Date - 2020-06-18T19:34:45+05:30
వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు పెట్టింది కేవలం కేపిటల్..
అమరావతి: వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు పెట్టింది కేవలం కేపిటల్ బిల్లు పాస్ చేసుకోవడమేనని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్రోప్రియేషన్ బిల్ పాస్ చేయాలని, అది అర్జెంట్ అని 30 సార్లు అడిగామన్నారు. మిగిలిన బిల్లులు తర్వాత చూద్దామని చెప్పామన్నారు. అలా ఎందుకన్నామంటే ఆ బిల్లులు సెలక్ట్ కమిటీకి రిఫరీ అయిందని ప్రభుత్వమే కోర్టు ముందు ఒప్పుకుందని అన్నారు. కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు ఆ బిల్లులు సభలో ప్రవేశపెట్టకూడదని అన్నారు. అందుకే ఆ బిల్లులపై తర్వాత చర్చ జరుపుదామని, ముందు అప్రోప్రియషన్ బిల్ పాస్ చేయాలని ఎంత చెప్పినా పట్టించుకోలేదన్నారు.
పైగా ఆ బిల్లును టీడీపీ ఆపిందని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెటేందుకు చూసిందని వైసీపీ నేతలు తిరిగి ఆరోపిస్తూ దిగజారి మాట్లాడుతున్నారని దీపక్ రెడ్డి విమర్శించారు. మొదటి రోజు ఒక్క మంత్రి కూడా లేరని, నిన్న మాత్రం మంత్రులంతా వచ్చి కూర్చున్నారని.. ఒక ప్లాన్ ప్రకారం వచ్చి మండలిలో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో వచ్చారని ఆరోపించారు. ప్లాన్ ప్రకారం అక్కడున్న కెమెరాలు, లైవ్ టెలికాస్ట్‌ను నిలిపివేశారన్నారు. వైసీపీ నేతలే తమపై దాడులు చేశారని, బయటకొచ్చి టీడీపీ నేతలు దాడులు చేశారని చెబుతున్నారని అన్నారు. వాళ్లు తమ వైపుకు వస్తే దాడి వాళ్లు చేసినట్లా? మేము చేసినట్లా? అని ప్రశ్నించారు. నోటికొచ్చినట్లు దూషించారని, ఒక మంత్రి (అనిల్ కుమార్) అయితే జిప్ ఓపెన్ చేశారని, మహిళా సభ్యులు ఉన్నా సిగ్గులేకుండా ప్రవర్తించారని దీపక్ రెడ్డి విమర్శించారు.
Updated Date - 2020-06-18T19:34:45+05:30 IST