ఇళ్ల పట్టాల లబ్ధిదారులు 30.6 లక్షల మంది!
ABN, First Publish Date - 2020-11-28T08:25:46+05:30
‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో క్రిస్మస్ పండుగనాడు 30.6 లక్షల లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలివ్వాలన్న నిర్ణయానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
11 వేల పంచాయతీల్లో 17,500 లేఅవుట్లు
క్రిస్మస్ నాడు పంపిణీ.. కేబినెట్ నిర్ణయం
28.3 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం.. మూడేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యం
సీఆర్‌డీఏలో ‘స్టార్టప్’ ఒప్పందాలన్నీ రద్దు.. ఉద్యోగులకు జనవరి వేతనంతో డీఏ చెల్లింపు
2న అమూల్‌కు శ్రీకారం.. మహిళలకు పాడిపశువులు..10న గొర్రెలు, మేకల పంపిణీ
21 నుంచి భూ సమగ్ర సర్వే.. టేకరికండిలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీకి 105 ఎకరాలు
ఉత్తరాంధ్ర, పల్నాడు కార్పొరేషన్లకు ఓకే.. ‘గేమింగ్’ ఆర్డినెన్స్‌కూ.. మంత్రివర్గం నిర్ణయాలు
అమరావతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో క్రిస్మస్ పండుగనాడు 30.6 లక్షల లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలివ్వాలన్న నిర్ణయానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. శుక్రవారమిక్కడి సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా రాష్ట్రంలో నివర్ తుఫాన్ వల్ల కలిగిన నష్టాన్ని డిసెంబరు 15కల్లా లెక్కించాలని.. 30వ తేదీకల్లా బాధితులకు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా సహాయ శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 చొప్పున ఇవ్వాలని నిర్దేశించారు. పంట నష్టపోయిన ప్రాంతాల్లో 80 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలని.. ఆస్తినష్టం, ప్రాణనష్టం ఉంటే.. మార్గదర్శకాల ప్రకారం త్వరగా పరిహారం అందించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 30.6 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలిచ్చేందుకు మొత్తం 66,518 కోట్ల ఎకరాలను సేకరించారు. 11 వేల పంచాయతీల్లో 17,500 లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు.
ప్రసుత్తానికి లబ్ధిదారులకు డీ ఫాం పట్టాలు పంపిణీ చేస్తారు. కోర్టు కేసులు పరిష్కారమయ్యాక కన్వేయెన్స్ డీడ్స్ ఇస్తారు. అలాగే ‘వైఎస్సార్-జగనన్న కాలనీ’ల కింద 28.3 లక్షల మంది ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. మూడేళ్లలో నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో యూనిట్ రూ.1.8 లక్షల చొప్పున తొలి దశలో 8,494 లే అవుట్లలో సుమారు 16 లక్షల ఇళ్లు నిర్మిస్తారు. 18 నెలల్లో తొలి దశలో ఇళ్ల నిర్మాణానికి రూ.28,800 కోట్లు ఖర్చుచేస్తారు. అలాగే పేదల ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. డిసెంబరు 25 నుంచి మొదలుపెట్టి రెండు వారాల పాటు రోజూ లక్ష చొప్పున 175 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణ పనులు మొదలుపెడతారు. మిగతా 13 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే ఏడాది డిసెంబరులో ప్రారంభించి 2023 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రాష్ట్రమంతా రూ.927 కోట్లతో సమగ్ర భూ సర్వేకు నిర్ణయం.. వచ్చే నెల 21 నుంచి ‘వైఎస్సార్-జగనన్న’ శాశ్వత భూ హక్కు-భూ రక్షణ పథకం.
విజయనగరం జిల్లా కురుపాం మం డలం టేకరికండిలో జేఎన్‌టీయూ గిరిజన ఇంజనీరింగ్ కళాశాల స్థాపనకు 105.32 ఎకరాల కేటాయింపు.
2019 ఖరీఫ్ నుంచి రైతులకు ఉచిత బీమా అమలుకు అంగీకారం. పంటల బీమా డిసెంబరు 15న పంపిణీ.
వ్యవసాయ భూమి(వ్యవసాయేతర భూములుగా మార్పిడి)-2020 ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర.
రాష్ట్ర ఫిషరీస్ వర్సిటీ చట్టం-2020లో ఫిషరీస్ గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్‌లో క్వాలిటీ విద్యను అందించే బిల్లుకు ఆమోదం. ఉత్తరాం ధ్ర సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఆమోద ముద్ర. పల్నాడు దుర్భిక్ష నివార ణ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఆమోదం. రూ.776.50 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధుల తో డ్యామ్ రిహేబిలిటేషన్ అం డ్ ఇంప్లిమెంట్ ప్రాజెక్టు కింద పనులు చేపట్టేందుకు జీవో 62 కు ఆమోదముద్ర. సోమశిల- కండలేరు ఫ్లండ్ ఫ్లో కెనాల్ సామర్థ్యం 24 వేల క్యూసెక్కులకు పెంచేందుకు రూ.918.80 కోట్లతో విస్తరణ పనులు. అనంతపురం జిల్లా కడప బ్రాంచి కెనాల్ పరిధిలోని 1,729 కుటుంబాలకు రూ.240.53 కోట్ల పరిహారం చెల్లించేందుకు అంగీకారం.
పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.142 కోట్ల పనులకు ఆమోదం. ఏపీఎ్‌సడీసీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఇచ్చిన రూ.35 వేల కోట్ల గ్యారెంటీకి ఆమోదం. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఏపీ రెంటల్ యాక్టు-1994 సవరణలకు ఆమోదం.
ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ చెల్లింపు
ఉద్యోగులకు డీఏ బకాయిలు, పెన్షనర్లకు డీఏ చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు 2018 జూలై నుంచి మూలవేతనంపై పెంచిన డీఏ 3.144 శాతాన్ని వచ్చే జనవరి వేతనంతో చెల్లిస్తా రు. పెంచిన మొత్తంతో కలిపి డీఏ 30.3928 శాతంగా ఉంటుంది. అదేవిధంగా 2019 జూలై నుంచి పెంచిన 5.24ు కరువు బత్యాన్ని 2022 జనవరి నెల జీతంతో చెల్లిస్తారు. కరోనాతో మార్చి ,ఏప్రిల్ నెలల్లో ప్రజా ప్రతినిధులకు వంద శాతం, ఆలిండియా సర్వీసు ఉద్యోగులకు 60ు, ఇతర ఉద్యోగులకు 50 శాతం, ఔట్ సోర్సింగ్, కాట్రాక్టు ఉద్యోగులకు 10 శాతం చొప్పున కోత విధించిన జీతాలను.. డిసెంబ రు, జనవరి వేతనాలతో కలిపి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.
‘జగనన్న చేయూత’ కార్యక్రమం కింద డిసెంబరు 2న మహిళా లబ్ధిదారులకు పాడిపశువులు పంపిణీ చేయాల ని నిర్ణయించారు. అదే రోజున అమూల్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చారు. డిసెంబరు 10న 2.49 లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెలు, మేకలను పంపిణీ చేసే పథకానికి ఆమోదం తెలిపారు. రాష్ట్ర పశు దాణా బిల్లు-2020ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సీఆర్‌డీఏ పరిధిలో స్టార్టప్ ఏరియా డెవల్‌పమెంట్ ప్రాజెక్టు పరిధిలోని ఒప్పందాలన్నీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలివీ..
Updated Date - 2020-11-28T08:25:46+05:30 IST