ఇళ్ల నిర్మాణానికి 3 ఆప్షన్లు
ABN, First Publish Date - 2020-12-29T07:48:34+05:30
ఇళ్ల నిర్మాణానికి 3 ఆప్షన్లు
లబ్ధిదారులే కట్టుకుంటామంటే నిర్మాణ సామగ్రి మేమే ఇస్తాం
కూలి ఖర్చు వారే పెట్టుకోవాలి
వారే సామగ్రి తెచ్చుకుంటే ఆ సొమ్ము ఖాతాల్లో వేస్తాం
ఖర్చులు భరించలేమంటే మేమే నిర్మించి ఇస్తాం
ప్రతి ఇంటికీ రెండేసి ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, ఎల్‌ఈడీ బల్బులూ..
బాబు కేసులు వేయిస్తున్నారు.. కోర్టులు స్టే ఇస్తున్నాయి
కేసులు తొలిగాక స్థలాలపై హక్కులు
ప్రస్తుతానికి డీకేటీ పట్టాలిస్తున్నాం
శ్రీకాళహస్తి సభలో సీఎం జగన్
స్వార్థపరులు కుట్రపన్ని న్యాయపరమైన సమస్యలు సృష్టిస్తూ ఇళ్ల స్థలాల పంపిణీని జాప్యం చేయిస్తున్నారు. దేవుడు వారికి మొట్టికాయలు వేస్తాడు.
ప్రస్తుతానికి డీకేటీ పట్టాలు పంపిణీ చేస్తున్నాం. కోర్టు కేసుల అడ్డంకులు తొలగగానే పూర్తి హక్కులు కల్పిస్తాం.
-సీఎం జగన్
శ్రీకాళహస్తి, డిసెంబరు 28: పక్కా ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి యూనిట్ ధర రూ.1.80 లక్షలుగా నిర్ణయించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. నిర్మాణానికి వారికి మూడు ప్రత్యామ్నాయాలు ఇస్తున్నామని చెప్పారు. వీటిలో వారికి నచ్చింది ఎంచుకోవచ్చని సూచించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరు వద్ద సోమవారం మధ్యాహ్నం పలువురు లబ్ధిదారులకు ఆయన ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అంతకుముందు పక్కా ఇళ్ల లే అవుట్ ప్రాంగణంలో పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.
‘మొదటి ప్రత్యామ్నాయంగా.. నిర్ణీత నమూనాలో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులే ముందుకొస్తే అవసరమైన నిర్మాణ సామగ్రి మొత్తం ప్రభుత్వమే అందజేస్తుంది. కూలీ ఖర్చులు మాత్రమే లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. రెండోది..నిర్మాణ సామగ్రిని లబ్ధిదారులే సమకూర్చుకుంటే ఆ మొత్తం నగదును ప్రభుత్వం వారి ఖాతాలోకి జమచేస్తుంది. చివరిది.. లబ్ధిదారులు కూలీ ఖర్చులు భరించలేమని భావిస్తే ప్రభుత్వమే నిర్మాణం పూర్తి చేసి వారికి అప్పగిస్తుంది’ అని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక ప్రతి ఇంటికీ రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, రెండు ఎల్‌ఈడీ బల్బులు, సింటెక్స్ ట్యాంకు ఉచితంగా అందజేస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టిన పేదల పక్కా ఇళ్ల నిర్మాణంతో ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతాయని.. సుమారు 30 వృత్తులకు చెందిన లక్షలాది మందికి ఉపాధి, పనులు దొరుకుతాయని తెలిపారు.
అడ్డుపడుతున్నారు..
పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు రాకుండా చంద్రబాబు దగ్గరుండి కేసులు వేయిస్తున్నారని, కోర్టులు వాటిపై స్టేలు ఇస్తున్నాయని సీఎం అన్నారు. దీనివల్ల 3.74 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. ‘ఈ నెల 25న క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ఉందని తెలిసీ.. సరిగ్గా దానికి ముందురోజు 24న హైకోర్టులో పట్టాల పంపిణీని ఆపాలంటూ పిల్ దాఖలు చేయించారు’ అని అన్నారు.
అమరావతిపై మళ్లీ అదే మాట!
సీఎం మరోసారి రాజధాని అమరావతిలో కులాల ప్రస్తావన తెచ్చారు. రాజధానికి రైతులిచ్చిన భూములను స్థానికులకు కాకుండా బయటివారికి ఇళ్ల స్థలాలివ్వడంపైనే హైకోర్టుకు వెళ్లామని ఇప్పటికే అమరావతి రైతులు స్పష్టం చేశా రు. అయినా సీఎం పట్టించుకోకుండా మళ్లీ అదే మాట్లాడారు. అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చర్యలు తీసుకుంటుంటే.. కులాల వారీగా తేడాలు వస్తాయని (డెమోగ్రఫిక్ ఇన్‌బ్యాలెన్సె్‌స) కోర్టులో కేసువేస్తే స్టే ఇచ్చారన్నారు.
జగన్ చెప్పిన తప్పు లెక్కలు
సీఎం జగన్ ప్రజల సమక్షంలోనే సభలో తప్పు లెక్క చెప్పారు. స్థానికంగా స్థలం విలువ ఎంత ఉందని కలెక్టర్‌ను అడిగానని, సెంటు రూ.7 లక్షలు పలుకుతోందని ఆయన చెప్పారని.. ఆ లెక్కన పేద లబ్ధిదారులకు రూ.7 లక్షల విలువ చేసే సెంటు భూమిని ఇంటి స్థలంగా ఇస్తున్నామని ప్రకటించారు. వాస్తవానికి అక్కడ ఎకరా విలువ రూ.7లక్షలే. దానిని భారీగా పెంచి రూ.18 లక్షల చొప్పున అధికారులు కొనుగోలు చేశారు. ముఖ్యమంత్రి చెప్పింది వాస్తవమైతే అక్కడి భూములను ప్రభుత్వం ఎకరా రూ.7 కోట్లు చొప్పున కొనుగోలు చేసి ఉండాలి కదా అని స్థానికులు అంటున్నారు.
Updated Date - 2020-12-29T07:48:34+05:30 IST