యాసంగి వడ్లు కొంటామన్న హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలి: Sharmila

ABN , First Publish Date - 2022-05-12T17:47:30+05:30 IST

ఐకేపీ సెంటర్లు, కల్లాల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

యాసంగి వడ్లు కొంటామన్న హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలి: Sharmila

హైదరాబాద్: ఐకేపీ సెంటర్లు, కల్లాల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం షర్మిల పత్రికా ప్రకటనను విడుదల చేశారు. యాసంగి వడ్లు కొంటమని ఇచ్చిన మాటను సీఎం నిలబెట్టుకోవాలని అన్నారు. అసని తుఫాన్ ఎఫెక్ట్‌తో రాష్ట్ర రైతాంగం తీవ్ర ఆందోళనలో పడిందన్నారు. ఎక్కడ వడ్లు తడుస్తాయో అని రైతులు తక్కువ ధరకే దళారులకు అమ్ముకుంటున్నారని అన్నారు.  ఇప్పటి వరకు ప్రభుత్వం కొన్నది కేవలం 17 శాతమే అని తెలిపారు. వడ్లు తడిసిపోయి అన్నదాత కన్నీరు పెడుతుంటే చూడలేని గుడ్డోని పాలన కేసీఆర్‌దని వైఎస్సార్టీపీ అధినేత్రి మండిపడ్డారు. ఆదుకొంటాడు అనుకొన్న దొరగారు వడ్లు కొనని పుణ్యానికి ఎకరాకు రూ.10 వేలు నష్టం రైతులకు వస్తోందన్నారు.


విత్తనం నాటిన నాటి నుంచి పంట చేతికొచ్చి అమ్ముకొనేవరకు కేసీఆర్ రైతులను అరిగోస పెడుతూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రైతున్నను ఆదుకునేది ఎవరని ప్రశ్నించారు. వడ్లు కొంటానన్న కేసీఆర్ హామీ గాలివానలకు కొట్టుకుపోతోందన్నారు. కల్లాల్లో వడ్లు వర్షాలకు తడిసిపోతే రైతు కన్నీరు తుడిచేదెవరని నిలదీశారు. గప్పాలు చెప్పుకోవడానికే వడ్లు కొంటామని చెప్పినట్లు తప్ప కొన్నది లేదని విమర్శించారు. 7వేల కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధరకు 500 ఎక్కువిచ్చి కొంటామన్న కేసీఆర్ యేతుల మాటలు ఎక్కడపోయాయని షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Read more