తీరం దాటిన అసాని

ABN , First Publish Date - 2022-05-12T09:18:25+05:30 IST

‘అసాని’ తుఫాన్‌ బుధవారం ఉదయం నుంచి దోబూచులాడింది. మంగళవారం రాత్రి తీరం దిశగా పయనించే క్రమంలో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. బుధవారం సాయంత్రానికి

తీరం దాటిన అసాని

కృష్ణాజిల్లా కృత్తివెన్ను వద్ద తీరం దాటి తీవ్ర వాయుగుండంగా మార్పు

ఈశాన్యం దిశగా కదులుతూ కాకినాడ వద్ద సముద్రంలో కలిసే చాన్స్‌

అలల తాకిడికి కాకినాడ-ఉప్పాడ బీచ్‌ రోడ్డు 5 కిలోమీటర్ల మేర ఛిద్రం

నేడు, రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

పలు జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు

అప్రమత్తమైన కలెక్టర్లు, ఎస్పీలు

జోరు వాన.. వణికిన గుంటూరు, బాపట్ల 

ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం.. రైతుకు కష్టం ’

హెల్ప్‌లైన్‌ నంబర్లు 1070,1800425101



(ఆంధ్రజ్యోతి-న్యూ్‌సనెట్‌వర్క్‌)

‘అసాని’ తుఫాన్‌ బుధవారం ఉదయం నుంచి దోబూచులాడింది. మంగళవారం రాత్రి తీరం దిశగా పయనించే క్రమంలో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. బుధవారం సాయంత్రానికి కృష్ణాజిల్లా కృత్తివెన్ను వద్ద(మచిలీపట్నం-నరసాపురం మధ్య) తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 55 నుంచి 65, అప్పుడప్పుడు 75 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచాయి. మచిలీపట్నం, నరసాపురం సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. తీరం దాటిన తీవ్ర వాయుగుండం ఉత్తర ఈశాన్యంగా యానాం, కాకినాడ, తుని వరకు తీరం వెంబడి పయనిస్తూ గురువారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం, కాకినాడ వద్ద సముద్రంలో కలిసే అవకాశం ఉందని పేర్కొంది.


తీవ్ర వాయుగుండం ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు కోస్తాలో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు, కొద్ది ప్రాంతాల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల తీరాల్లో అలలు ఎగసిపడుతున్నాయి. కళింగపట్నం నుంచి ఓడరేవు వరకు గల అన్ని ప్రధాన పోర్టుల్లో ఏడో నంబరు, కృష్ణపట్నంలో ఐదో నంబరు ప్రమాద హెచ్చరికలు ఎగురవేశారు. అసాని తుఫాన్‌ తీరం దాటడంపై భారత వాతావరణ శాఖ బుధవారం రాత్రి తొలిసారి ప్రకటన చేసింది. తుఫాన్‌గా ఏర్పడక ముందు ఉత్తర కోస్తాకు సమీపంగా వచ్చి దిశ మార్చుకుని తీరానికి సమాంతరంగా ఒడిసా వైపు వెళుతుందని ప్రకటించింది. తరువాత ఒడిసాలోని రిడ్జ్‌ ప్రభావంతో గోదావరి జిల్లాల్లో తీరం దాటి.. దిశ మార్చుకుని ఉత్తర కోస్తావైపు వచ్చే క్రమంలో తీరానికి ఆనుకుని పయనించి మళ్లీ సముద్రంలో ప్రవేశిస్తుందని మంగళవారం ఉదయం నుంచి బుధవారం సాయంత్రం వరకు చెబుతూ వచ్చింది. చివరకు బుధవారం సాయంత్రం తుఫాన్‌ మరింత బలహీనపడి కృత్తివెన్ను దగ్గర తీరం దాటిందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. 


ఉప్పాడ అల్లకల్లోలం

కాకినాడ జిల్లాకు అసాని ముప్పు తప్పినా తుఫాను ప్రభావంతో వణికింది. తీర ప్రాంతమైన ఉప్పాడలో తీరని నష్టం మిగిలింది. భారీగా ఎగసిపడ్డ కెరటాల ఉధృతికి బుధవారం తెల్లవారుజామున కోనపాపపేటలో పది వరకు మత్స్యకారుల ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయి. దీంతో  మత్స్యకారులు బిక్కుబిక్కుమని గడిపారు. ఇదే గ్రామంలో తీరం వరకు ఉన్న మూడు సిమెంట్‌ రోడ్లు సముద్రంలో కలిసిపోయాయి. కాకినాడ-ఉప్పాడ బీచ్‌ రోడ్డు తీవ్రమైన రాకాసి అలల ధాటికి పూర్తిగా ఛిద్రమైపోయింది. ఏమాత్రం గుర్తుపట్టలేనంతగా ఈ రహదారి మారిపోయింది. గాలులు, కెరటాల తాకిడికి పెద్దపెద్ద రాళ్లు ఈ రోడ్డుపై పడ్డంతో అయిదు కిలోమీటర్ల మేర రోడ్డుపై ఎటుచూసినా రాళ్లు జల్లినట్టు కనిపించింది. దీంతో ఈ రహదారిపై పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. అటు భారీ పెనుగాలులతో కాకినాడ పోర్టులో ఎగుమతి, దిగుమతులు నిలిచిపోయాయి. 


వణికిన కృష్ణా

కృష్ణాజిల్లాను అసాని తీవ్ర తుపాను వణికించింది. బుధవారం మఽధ్యాహ్నం సమయానికి మచిలీపట్నంకు 30 కిలోమీటర్ల దూరం వరకు వచ్చిన తీవ్ర తుపాను బలహీనపడింది. కలెక్టర్‌  రంజిత్‌బాషా, ఎస్పీ సిద్ధార్థకౌశల్‌, రెవెన్యూ అధికారులు ప్రభావిత గ్రామాలు సహా మంగినపూడి బీచ్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్‌ తెలిపారు. రెండురోజులుగా తుఫాను ప్రభావంతో తీరప్రాంతం వెంబడి బలమైన గాలులు వీయడంతో అవనిగడ్డ, మోపిదేవి, తోట్లవల్లూరు తదితర ప్రాంతాల్లో అరటి, బొప్పాయి తోటలు ధ్వంసమయ్యాయి. బుధవారం నాటికి 100 ఎకరాల్లో అరటి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా వేశారు. దివిసీమలోని కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. 


విమానాలు, రైళ్లు రద్దు .. మరో రెండు రోజులు ఇంతే

అసాని ప్రభావంతో రాష్ట్రం నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులు రద్దయ్యాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి విశాఖపట్నం, విజయవాడ వెళ్లాల్సిన పలు సర్వీసులు రద్దయ్యాయని అధికారులు బుధవారం పేర్కొన్నారు. ఇండిగో, స్సైస్‌జెట్‌, ఎయిర్‌ ఇండియా విమాన సర్వీలు రద్దయ్యాయని తెలిపారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా విశాఖపట్నం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన 56 విమాన సర్వీసులను రద్దు చేసినట్టు డైరెక్టర్‌ కె.శ్రీనివాసరావు తెలిపారు. ఇక, విజయవాడ నుంచి నడిచే విమాన సర్వీసులన్నీ రద్దయ్యాయి. మరోవైపు.. తుఫాను ప్రభావంతో కాకినాడ-విజయవాడ, కాకినాడ-విశాఖ మధ్య మెము రైళ్లను గురువారం రద్దు చేశారు.


అత్యవసర సాయానికి హెల్ప్‌లైన్‌ 

అమరావతి, మే 11 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ 24 గంటలూ అందుబాటులో ఉండేలా హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల ప్రజలు అత్యవసర సహాయం కోసం 1070, 1800425101 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. 

Read more