పుట్‌పాత్‌లు ఎక్కడ?

ABN , First Publish Date - 2022-05-10T05:30:00+05:30 IST

నంద్యాల సంజీవనగర్‌ సెంటర్‌లో ఓ ప్రముఖ షాపింగ్‌ మాల్‌ నిర్వాహకులు పుట్‌పాత్‌పైనే స్టీల్‌ రైలింగ్‌తో మెట్లు ఏర్పాటు చేశారిలా.

పుట్‌పాత్‌లు ఎక్కడ?

జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా ఆక్రమణలు 

 పట్టణవాసులకు ట్రాఫిక్‌ అవస్థలు

 పట్టించుకోని అధికార యంత్రాంగం 


నంద్యాల సంజీవనగర్‌ సెంటర్‌లో ఓ ప్రముఖ షాపింగ్‌ మాల్‌ నిర్వాహకులు పుట్‌పాత్‌పైనే స్టీల్‌ రైలింగ్‌తో మెట్లు ఏర్పాటు చేశారిలా. సంజీవనగర్‌ నుంచి శ్రీనివాసనగర్‌ వెళ్లే ఈ ప్రధాన రహదారిలో ఫుట్‌పాత్‌ నిర్మించినప్పటికీ అది  ఉపయోగ కరంగా లేదు. షాపింగ్‌ మాల్‌ నిర్వాహకుల తరహా లోనే రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌ను ఆక్రమించేశారు. 


నంద్యాల టౌన్‌, మే 10 : నంద్యాలలో నాలుగేళ్ల క్రితం రోడ్ల విస్తరణ జరిగింది. ఎన్నో దశాబ్దాలుగా ట్రాఫిక్‌ సమస్యకు ప్రధాన కారణమైన రోడ్ల విస్తరణకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మోక్షం లభించింది. గాంధీచౌక్‌ నుంచి పద్మావతినగర్‌ ఆర్చీ వరకు ఉన్న రోడ్డును 60అడుగులుగా, పద్మావతినగర్‌ ఆర్చీ నుంచి నూనెపల్లె ఓవర్‌ బ్రిడ్జి వరకు ఉన్న రోడ్డును 80అడుగుల రోడ్డుగా విస్తరించారు. విస్తరణ చేయడంతో పాటు సుందరీకరణ నిమిత్తం పద్మావతినగర్‌ నుంచి నూనెపల్లె వరకు మార్గమధ్యంలో పూల మొక్కలు పెంచేందుకు అనువుగా డివైడర్లను, ప్రత్యేక లైటింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. గాంధీచౌక్‌ నుంచి నూనెపల్లె వరకు రోడ్డు విస్తరణలో భాగంగా ఇరువైపులా ఫుట్‌పాత్‌లను నిర్మించారు. ఫుట్‌పాత్‌లపై కుడా (కర్నూలు అర్బన్‌ డెవలఫ్‌మెంట్‌ అథారిటీ) అభివృద్ధిలో భాగంగా పూలకుండీలను కూడా ఏర్పాటు చేశారు. కొన్నాళ్లపాటు బాగానే ఉన్నప్పటికీ రానురాను పరిస్థితి పూర్తిగా ఆక్రమణల దిశగా మారింది. ప్రస్తుతం నంద్యాల జిల్లాగా ఆవిర్భవించడంతో 50దాకా జిల్లాస్థాయి ప్రభుత్వ కార్యాలయాలు నంద్యాలకు తరలివచ్చాయి. అధికార యంత్రాంగం, ఇతర నియోజకవర్గాల నుంచి ప్రజల రాకపోకల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్యను పెంచుతున్న ఫుట్‌పాత్‌ల అక్రమణలు తొలగించాల్సిన అవసర ఉంది. అయితే ఆక్రమణలపై కొరఢా ఝుళిపించా ల్సిన పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బంది మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీనికితోడు రాజకీయ నేతల ఒత్తిడి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అత్యంత రద్దీగా ఉండే గాంధీ చౌక్‌లో వన్‌వే ఏర్పాటు చేసినా ఆక్రమణలపై దృష్టి సారించకపోవడం గమనార్హం. 


వ్యాపార నిమిత్తం ఫుట్‌పాత్‌పైనే షెడ్‌ నిర్మించారు. పట్టణ నడిబొడ్డున మార్కెట్‌యార్డు పక్కనే ఓ గదిని అద్దెకు తీసుకొని వ్యాపారం చేసుకుంటున్న వారు ముందు వైపు ఉన్న ఫుట్‌పాత్‌పై ఏకంగా రేకుల షెడ్డుతో అదనంగా గదిని నిర్మించుకున్నారు.


శ్రీనివాస సెంటర్‌ నుంచి గాంధీ చౌక్‌కు వెళ్దే దారిలో ఎడమ వైపు  పుట్‌పాత్‌పై నిర్మించిన దుకాణం ఇది.  లోపల ఉండాల్సిన వ్యాపార సామగ్రిని ఫుట్‌పాత్‌పై పెట్టిన దృశ్యమిది. ప్రజలు పలుసార్లు ప్రశ్నిస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు.


 గాంఽధీ చౌక్‌ నుంచి శ్రీనివాస సెంటర్‌కు వెళ్లేటప్పుడు ఎడమ వైపు ఫుట్‌పాత్‌ను కొందరు ఆక్రమించుకున్నారు. గార్మెంట్స్‌, సైకిల్‌ షాపులు, ఎలక్ర్టికల్‌ వంటి వ్యాపారాలు చేసుకునే వారంతా తమ వ్యాపార సామగ్రిని ఫుట్‌పాత్‌పైనే పెడుతున్నారు. దీంతో ద్విచక్ర వాహనదారులు కొనుగోలు కోసం వచ్చినప్పుడు తమ వాహనాలను రోడ్డుపైనే నిలబెట్టాల్సి వస్తోంది. 


 పద్మావతినగర్‌ ఆర్చి నుంచి నూనెపల్లెకు పోయే రోడ్డులో గెలివి స్కూల్‌ నుంచి భరతమాత గుడి లైన్‌ టర్నింగ్‌ వరకు దాదాపు 200 మీటర్ల పొడవున పుట్‌పాత్‌ను పూర్తిగా అక్రమించిన దృశ్యమిది. ఇక్కడ ఫుట్‌పాత్‌పై వ్యాపారంతో పాటు ప్రధాన రోడ్డుపై తోపుడు బండ్లు నిలుపుతుండడంతో అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో సాయంత్రం సమయంలో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. 


సాయిబాబా దేవాలయం నుంచి నాగులకుంట దేవాలయం వరకు  పుట్‌పాత్‌ అసలు ఆగుపించడం లేదు. మొత్తం అక్రమించేశారు. ఎక్కడైనా చిరు వ్యాపారులు ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేసుకుంటే వారిపై ప్రతాపం చూపే అధికార యంత్రాంగం శాశ్వత నిర్మాణాలు, వరండాలు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


ఆక్రమణలు తొలగిస్తాం 


పట్టణంలోని ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. ఆరు నెలల క్రితం స్పెషల్‌ డ్రైవ్‌ చేశాం. కానీ మళ్లీ ఆక్రమించేశారు. ఈసారి శాశ్వత ప్రతిపాదికన కట్టుదిట్టమైన చర్యలు చేపడతాం. 


- వెంకటకృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌, నంద్యాల

Read more