వేసవిలో వన్యప్రాణులకు భరోసా

ABN , First Publish Date - 2022-05-03T05:48:23+05:30 IST

వేసవి వచ్చిందంటే వన్యప్రాణులకు తాగునీటి కష్టాలు మొదలవుతాయి. అడవుల్లో నీటి వనరులు ఎండిపోవడంతో దప్పిక తీరక ప్రాణాలు కోల్పోతుంటాయి. ఎండతీవ్రతకు అడవుల్లోనే మరణించిన సంఘటనలు కోకోల్లలు. మరోవైపు నీటి కోసం పరిసర గ్రామాలల్లోకి వచ్చి అడవి జంతువులు వేటగాళ్ల చెరలో పడుతుంటాయి. అందుకే వేసవిలో వన్యప్రాణులను, వన సంపదను రక్షించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. మూగజీవుల దాహార్తిని తీర్చే చర్యలకు శ్రీకారం చుట్టింది. సాసర్‌పిట్లు, నీటి కుంటలు, చెక్‌డ్యాంలను ఏర్పాటు చేస్తున్నది.

వేసవిలో వన్యప్రాణులకు భరోసా
అడవిలో సాసర్‌పిట్‌ను నింపుతున్న ఉద్యోగి

పెరుగుతున్న భానుడి ప్రతాపం

అటవీ జంతువుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాట్లు

నీటి కుంటలు, చెక్‌డ్యాంలు, సాసర్‌పిట్‌ల నిర్మాణం


దుబ్బాక, మే 2: వేసవి వచ్చిందంటే వన్యప్రాణులకు తాగునీటి కష్టాలు మొదలవుతాయి. అడవుల్లో నీటి వనరులు ఎండిపోవడంతో దప్పిక తీరక ప్రాణాలు కోల్పోతుంటాయి. ఎండతీవ్రతకు అడవుల్లోనే మరణించిన సంఘటనలు కోకోల్లలు. మరోవైపు నీటి కోసం పరిసర గ్రామాలల్లోకి వచ్చి అడవి జంతువులు వేటగాళ్ల చెరలో పడుతుంటాయి. అందుకే వేసవిలో వన్యప్రాణులను, వన సంపదను రక్షించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. మూగజీవుల దాహార్తిని తీర్చే చర్యలకు శ్రీకారం చుట్టింది. సాసర్‌పిట్లు, నీటి కుంటలు, చెక్‌డ్యాంలను ఏర్పాటు చేస్తున్నది.


6,600 హెక్టార్ల అడవి

దుబ్బాక రేంజ్‌ పరిధిలో దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్‌, తొగుట సెక్షన్‌లు ఉన్నాయి. వాటిలో   దుబ్బాక, గంబీర్‌పూర్‌, చింతమడక, మిరుదొడ్డి, దొమ్మాట, రామారం, ఇందుప్రియల్‌, గొడుగుపల్లి, వడ్డేపల్లి, తోగుట, తుక్కాపూర్‌, పెద్దమాసన్‌పల్లి, ఏటిగడ్డకిష్టాపూర్‌ బీట్లు ఉన్నాయి. సుమారు 6,6,63.05 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి విస్తరించి ఉన్నది. జింకలు, మనుబోతులు, కొండగొర్లు, చుక్కల దుప్పిలు, గడ్డిజింకలు, ఆడవిపందులు, నెమళ్లు, కుందేళ్లు ఉన్నాయి. నీటి కోసం వన్యప్రాణులు పరిసర గ్రామాల్లో పొలాలకు వద్దకు వస్తుంటాయి. నెమళ్లు, అడవిపందులతో పాటు కోతులు, కొండముచ్చులు దాహర్తీ తీర్చుకునే క్రమంలో పొలాలకు రక్షణగా ఏర్పాటు చేసిన కరెంటు తీగలు తగిలి మృతి చెందుతున్నాయి. 


జంతువుల దప్పిక తీర్చే ఏర్పాట్లు

వన్యప్రాణులు వేసవిలో దాహం తీర్చుకోవడానికి అడవిని విడిచి బయటకి రాకుండా అటవీశాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. దుబ్బాక రేంజ్‌ పరిధిలోని అడవిలో రాక్‌ఫిల్‌ డ్యాంలు, చెక్‌డ్యాంలు, నీటి కుంటలు ఏర్పాటు చేశారు. వర్షపు నీటిని ఒడిసి పట్టడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. వేసవిలో నీటి వనరులు ఎండిపోయిన క్రమంలో సాసర్‌పిట్లు ఏర్పాటుచేసి, ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. వణ్యప్రాణుల కదలికలను తెలుసుకునేందుకు వాటి దగ్గర కెమెరాలను బిగించి పరిశీలిస్తున్నారు. మనుబోతులు, జింకలు, గడ్డి జింకలు, చుక్కల దుప్పిలకు సాసర్‌పిట్లు జీవాధారంగా నిలుస్తున్నాయి. నెమళ్లు, కుందేళ్లు పెద్దసంఖ్యలో చేరుకుని దాహార్తిని తీర్చుకుంటున్నాయి.


వినూత్న ప్రయోగం.. సోలార్‌ పంప్‌సెట్‌

వాహనాలు వెళ్లలేని ప్రాంతాల్లో నీటి వనరుల్లో ప్రతీరోజు ట్యాంకర్లతో నీటిని నింపడం కష్టంతో కూడుకున్న పని. అధికారులు శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించి సోలార్‌ పంప్‌సెట్ల ఏర్పాటును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. దుబ్బాక మండలం చీకోడ్‌ రిజర్వు ఫారెస్టులోని మల్లన్నగుట్ట అటవీ ప్రాంతంలో కల్లేరు చెరువులో బోరు తవ్వించారు. సబ్‌మెర్సిబుల్‌ పంప్‌సెట్‌ను ఏర్పాటుచేసి, సోలార్‌ ఫలకల సాయంతో కరెంటు సరఫరా చేస్తున్నారుపీ పంపు పగలంతా భూగర్భ జలాలను తోడి కల్లేరు చెరువును నింపుతున్నది. వేసవిలో వన్యప్రాణులకు ఆధారంగా నిలుస్తున్నది. అలాగే అడవిలో అగ్నిప్రమాదాలు జరగకుండా 16 కిలోమీటర్ల పొడువు ఫైర్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. 

Read more