Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 12 May 2022 03:38:22 IST

‘ముసుగు’ వీరులెవరు?

twitter-iconwatsapp-iconfb-icon
ముసుగు వీరులెవరు?

సీబీఐ అధికారులపైనే నిఘా

వివేకా హత్యకేసు దర్యాప్తు బృందంపై ‘కన్ను’

అధికారులకు ‘ముసుగు’ వీరుల బెదిరింపు

డ్రైవర్‌ను అడ్డుకుని హెచ్చరికలు జారీ

సీబీఐ కదలికల చిట్టా చెప్పిన ఆగంతకుడు

దర్యాప్తు అధికారుల్లో విస్మయం

సీఎస్‌, డీజీపీకి చెప్పాకే స్పందించిన పోలీసులు

ప్రైవేటు వ్యక్తుల సీసీ టీవీ కెమెరాల పరిశీలన

ఫుటేజీ కాకుండా.. మొత్తం హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం


దేశంలో ఎవరిపైనైనా సీబీఐ నిఘా వేయగలదు. కానీ... సీబీఐపైనే నిఘా వేస్తే!? ‘బాంబులు వేసి లేపేస్తా’ అని సీబీఐ వాళ్లను హెచ్చరిస్తే? ‘మీరు ఎక్కడెక్కడ తిరిగారో మొత్తం తెలుసు’ అని టూర్‌ చిట్టా మొత్తం విప్పేస్తే? అందులోనూ... వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకే ఈ అనుభవం ఎదురైతే? అది కచ్చితంగా ఘరానా మనుషుల పనే అయి ఉండాలి!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘మర్యాదగా విజయవాడకు వెళ్లిపో! లేదంటే... బాంబు వేసి లేపేస్తా! మీ టీమ్‌ మొత్తం వెళ్లిపోవాలి’... ఇది వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందం ప్రొటోకాల్‌ డ్రైవర్‌ వలీబాషాకు ఒక ‘ముసుగు’ మనిషి జారీ చేసిన హెచ్చరిక! ఎవరో ఆకతాయి, లేదా వివేకా హత్యకేసులో నిందితుల వీరాభిమాని అత్యుత్సాహంతో ఈ పని చేశారని అనుకుంటే పప్పులో కాలేసినట్లే! సదరు ముసుగు మనిషి సీబీఐ అధికారుల పర్యటనల చిట్టా మొత్తం విప్పారు. ‘మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో మొత్తం నాకు తెలుసు’ అని ఒక్కో వివరం చెప్పారు. డ్రైవర్‌ వలీబాషా ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం... వివేకా హత్యకేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు కేటాయించిన ప్రొటోకాల్‌ వాహనాలకు నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన వలీ బాషా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.


ఈ నెల 8న సీబీఐ ఎస్‌ఐ అంకిత్‌ యాదవ్‌కు భోజనం తీసుకురావడానికి ఏపీ16 టీఈ0001 కారులో వెళ్తున్నారు. అదే  దారిలో... మధ్యాహ్నం 1.40 గంటలకు ముసుగు ధరించిన ఒక వ్యక్తి వాహనాన్ని అడ్డగించాడు. ‘‘విజయవాడకు తిరిగి వెళ్లిపో. మీ టీమ్‌కు కూడా చెప్పు. అందరూ వెళ్లిపోవాలి. లేదంటే బాంబులు వేసి పేల్చేస్తా’’ అని హెచ్చరించాడు. అతను అంతటితో ఆగలేదు. సీబీఐ అధికారులు వాడుతున్న ఏపీ16టీఈ0001, ఏపీ16 టీహెచ్‌ 0001 వాహనాల కదలికలను కూడా వివరంగా చెప్పాడు. ..‘‘మే 6వ తేదీ అమరావతిలో హైకోర్టుకు వెళ్లావ్‌. అదే రోజు... హైకోర్టుకు వెళ్లేముందు విజయవాడ రైల్వే స్టేషన్‌ సమీపంలో సీబీఐ క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి స్పెషల్‌ పీపీని కారులో ఎక్కించుకున్నావ్‌. మే 7న విజయవాడ బస్టాండ్‌ సమీపంలో ఆర్టీవో ఆఫీసుకు వెళ్లావు. అదే రోజున విజయవాడలో శైలజా ట్రావెల్స్‌ ఆఫీసుకు కూడా వెళ్లావ్‌’’ అని చెప్పాడు. వెరసి... సీబీఐ టీమ్‌పై తమ నిఘా ఉందనే హెచ్చరికలు పంపించాడు. వివేకా హత్య కేసులో నిందితుడైన శివశంకర్‌ రెడ్డి జైలులో ఉన్నంత వరకు మాత్రమే సీబీఐ టీమ్‌ భద్రంగా ఉంటుందని.. అతను బయటికి వస్తే మొత్తం టీమ్‌ను చంపేస్తాడని ముసుగు మనిషి చెప్పినట్లు డ్రైవర్‌ వలీబాషా సీబీఐ ఎస్పీకి లిఖితపూర్వకంగా తెలిపారు. దీనిపై సీబీఐ ఎస్‌ఐ అంకిత్‌ యాదవ్‌ ఈనెల 8నే కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో సీబీఐ ఎస్పీపై కేసు పెట్టేందుకు చూపిన ఉత్సాహం.. సీబీఐ అధికారులను బెదిరించిన కేసులో చూపించలేదు. దీంతో సీబీఐ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డితో మాట్లాడారు. ఆ మరుసటి రోజునే కడపలోని చిన్నచౌక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 


హార్డ్‌ డిస్క్‌లు తీసుకెళ్లారు... సీబీఐ ప్రొటోకాల్‌ డ్రైవర్‌ను బెదిరించిన ముసుగు వ్యక్తిని పసిగట్టేందుకు రంగంలోకి దిగిన కడప పోలీసులు.. ఈ సంఘటన జరిగిన పద్మావతి వీధిలోని దస్తగిరి గ్రానైట్స్‌ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఏ కేసులో అయినా పోలీసులు దర్యాప్తులో భాగంగా చేసే పని... సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడమే. అవసరమైతే ఆ ఫుటేజీని కాపీ చేసుకుని తీసుకుంటారు. కానీ... ఇక్కడ ఏకంగా హార్డ్‌ డిస్క్‌లనే తీసుకెళ్లారు. అయితే ఫుటేజీ భద్రంగానే ఉంటుందా, ట్యాంపర్‌ చేస్తారా అనే అనుమానాలకు వారే తావిచ్చినట్లయింది. 


ఇంతకూ నిఘా పెట్టిందెవరు.?.. నేరస్తుల కదలికలను పసిగట్టేందుకు సీబీఐ నిఘా పెడుతుంది. ఎన్నో నేరాలను ముందుగానే అరికట్టడంతోపాటు అంతుచిక్కని నేరాల గుట్టు వెలికితీస్తుంది. అత్యంత రహస్యంగా.. సీబీఐ అధికారులు పనిచేస్తుంటారు. కానీ... తమ వాహనాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ఒక ముసుగు వ్యక్తి వివరంగా చెబుతూ బెదిరించడం సీబీఐ అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. ఎవరో అనామకుడో, ఆకతాయో తమ డ్రైవర్‌ను బెదిరించలేదని... ఏదో అజ్ఞాత శక్తి లేదా.. రహస్య బృందం తమ కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తోందన్న నిర్ధారణకు సీబీఐ వచ్చేసింది. ఎవరు నిఘా పెట్టారనే దానిపై వారు కూడా కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ‘ముసుగు వీరుల’ చుట్టూ ఉచ్చు బిగుసుకునే అవకాశముంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.