వాళ్లింకా.. పసివాళ్లే

ABN , First Publish Date - 2022-05-05T05:21:33+05:30 IST

వాళ్లింకా.. పసివాళ్లే

వాళ్లింకా.. పసివాళ్లే
ఆశప్ప, భీమే్‌షలకు అన్నం తినిపిస్తున్న తల్లి లక్ష్మి


  • అన్నదమ్ములకు అంధత్వం, వైకల్యంఫ వృద్ధ పేద తల్లిదండ్రులపై పోషణ భారం
  • మనసున్న మారాజులు ఆదుకోవాలని వేడుకోలు

కొడంగల్‌ రూరల్‌, మే4: అందరిలానే తమ కొడుకులూ పెరిగి పెద్దయ్యి ఆసరాగా ఉంటారనుకున్న ఆ తల్లిదండ్రుల కల కళ్లలైంది. పుట్టిన ఇద్దరు కొడుకులూ అంధత్వం, వైకల్యంతో బాధపడుతుండడంతో వారి బాధచూడలేక, మరోపక్క బీదరికంతో వారికి క్షోభే మిగిలింది. కొడుకులకు 20ఏళ్లు వచ్చినా పసిపిల్లల వలె సాకడం వారికి నిత్య కృత్యమైంది. ఈ దయనీయ కుటుంబ పూర్వపరాల్లోకి వెళ్తే.. పాత కొడంగల్‌కు చెందిన మామిళ్ల లక్ష్మి-మొగులయ్య దంపతులకు నలుగురు సంతానం. మొదటి, రెండో సంతానం కూతుళ్లు. మూడు, నాలుగో సంతానం కొడుకులు. ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేసి పంపించారు. కొడుకులిద్దరూ పుట్టుకతోనే అంధత్వం వచ్చింది. కాళ్లుకు సైతం వైకల్యంతో వంకరపోయి ఎదుగుదల లోపించింది. పెద్ద కొడుకు ఆశప్పకు 20ఏళ్లు. చిన్న కొడుకు భీమే్‌షకు 19ఏళ్లు. చూపు లేదు, నడవలేరు. దీంతో వారి ఆలనపాలతోనే ఆ పేద తల్లిదండ్రులకు కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి వచ్చింది. వృద్ధాప్యంలో ఆసరా కావాల్సిన కొడుకులను భుజానికెత్తుకొని మోస్తున్నారు. అన్నం తినిపించాలన్నా, స్నానం చేయించాలన్నా తల్లిదండ్రులు ఉండాల్సిందే. తమ పిల్లల వైకల్యంతో ఇబ్బందులు పడడం, వారి అవసరాలు తీరుస్తూ ఎటూ వెళ్లలేకుండా అన్ని రకాలా కష్టాలుపడుతున్న ఆ తల్లిదండ్రుల బాధ చూసే వారి కళ్లు చెమర్చుతాయి.

వ్యవసాయం చేసుకుంటూ జీవించే పేద కుటుంబానికి కొడుకుల పోషణ భారంగా మారింది. తామిద్దరం కూలి చేసుకుంటేనే ఇల్లు గడుస్తుందని, కానీ పిల్లల వద్ద ఎవరో ఒకరు ఉండక తప్పదని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తోనే కుటుంబాన్ని కష్టంమీద నెట్టుకొస్తున్నారు. ఇంతటి దయనీయ కుటుంబాన్ని ప్రభుత్వమే ఏదో విధంగా సాయం చేసి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

దాతలు ఆదుకోవాలి

మా బిడ్డలు అంధత్వం, వైకల్యత్వంతో బాధపడుతున్నారు. నడవలేరు. వారి పనులు కూడా చేసుకోలేరు. 20ఏళ్లుగా మేం పడే బాధలు ఎవరికీ రాకూడదు. దాతలు ఎవరైనా మా బిడ్డలకు వీల్‌చైర్లు అందజేస్తే రుణపడి ఉంటాం. ఎవరైనా ఆర్థికసాయమందిస్తే మా బిడ్డలకు ఆహార సరుకులు కొనుక్కుంటాం. మనసున్న మారాజులు ఆదుకోవాలని వేడుకుంటున్నాం.

- మొగులయ్య-లక్ష్మి దంపతులు

Read more