తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఇంచార్జ్ ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో ఉన్నతాధికారుల సమక్షంలో ధర్మారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈవోగా ఆయన బాధ్యతలు స్వీకరించడం ఇది రెండవసారి. కాగా.. సీఎం స్పెషల్ సీఎస్‌గా వెళ్తున్న జవహర్ రెడ్డికీ టీటీడీ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇదిలా ఉంటే.. ఆంధ‍్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లు ఆదివారం నాడు బదిలీ అయిన సంగతి తెలిసిందే. టీటీడీ ఈవో జవహర్‌రెడ్డిని కూడా ప్రభుత్వం బదిలీ చేయడంతో.. ఆయన స్థానంలో ధర్మారెడ్డికి ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. మొత్తానికి చూస్తే.. జవహర్ రెడ్డిని కీలక పదవి వరించిందని చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉంటే.. టీటీడీ అదనపు ఈఓగా పనిచేస్తున్న ఏవీ ధర్మారెడ్డి మరో రెండేళ్లపాటు అదే పదవిలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన డిప్యుటేషన్‌ను మరో రెండేళ్లు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపించింది. ఈనెల 14 నాటికి ఆయన డిప్యుటేషన్ ముగియనుంది. ఇప్పటికే రెండు విడతల్లో కలిపి ఏడు సంవత్సరాల డిప్యుటేషన్ పూర్తిచేసుకున్నట్లవుతుంది. కేంద్ర నిబంధనల ప్రకారం కేంద్ర సర్వీసుల నుంచి వెళ్లిన ఏ అధికారీ ఏడేళ్లకు మించి డిప్యుటేషన్‌పై ఉండటానికి వీల్లేదు. అయితే, ఆయన సర్వీసులు తమకు అవసరమని, ఇంకొంతకాలం కొనసాగించాలని సీఎం జగన్ కేంద్రానికి ప్రతిపాదన పంపించారు. ప్రస్తుతం ఈ ఫైలు కేంద్ర కేబినెట్ కార్యదర్శి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.