పుచ్చి కందిపప్పుపై ‘పంచాయితీ’

ABN , First Publish Date - 2021-02-20T07:09:37+05:30 IST

అంగన్‌వాడీల్లో పిల్లలకు, గర్భిణులకు పుచ్చిపోయిన కందిపప్పు పంపిణీ చేస్తున్నారంటూ ‘ఆంధ్రజ్యోతి’ రాసిన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. పుచ్చుకందిపప్పుపై పెద్ద పంచాయితీయే జరిగింది.

పుచ్చి కందిపప్పుపై ‘పంచాయితీ’

  • రాజధాని వరకూ పప్పు వ్యవహారం
  • తిరిగిచ్చేయండి.. ప్యాకెట్లు ఇస్తాం..
  • అంగన్‌వాడీలకు పౌరసరఫరాల శాఖ అధికారుల సూచన
  • ఆ పప్పుకు డబ్బులివ్వొద్దు: ఐసీడీఎస్‌ డైరెక్టర్‌ ఆదేశం
  • మూడు ప్రాజెక్టుల పరిధిలో పప్పు పాడైనట్టు అధికారులు గుర్తింపు
  • నేటి నుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో పాడైనది తీసుకుని ప్యాకెట్లు పంపిణీ  ఏర్పాటు
  • ‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్టు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

అంగన్‌వాడీల్లో పిల్లలకు, గర్భిణులకు పుచ్చిపోయిన కందిపప్పు పంపిణీ చేస్తున్నారంటూ ‘ఆంధ్రజ్యోతి’ రాసిన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. పుచ్చుకందిపప్పుపై పెద్ద పంచాయితీయే జరిగింది. దీనిపై జిల్లావ్యాప్తంగా కలకలంరేగడంతోపాటు రాజధాని స్థాయిలో కూడా దీనిపై స్పందించడం గమనార్హం. కొందరు అధికారులు భుజాలు తడుముకోగా, కొందరు అధి కారులు వెంటనే పాడైన పప్పును వెనక్కి ఇచ్చేమని ఐసీడీఎస్‌ అధికారులను కోరారు. శనివారం నుంచి ప్యాకెట్ల ద్వారా మంచి కందిపప్పు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో కోరుకొం డ, పిఠాపురం ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఈ రకమైన కందిపప్పు పంపిణీ అయినట్టు ప్రాథమికంగా గుర్తించారు. అంగన్‌వాడీ కేంద్రాలతోపాటు రేషన్‌షాపుల ద్వారా వినియోగదారుల కూడా ఈ రకం పప్పు పంపిణీ అయినట్టు సమాచారం. అంగన్‌వాడీలకు పుచ్చిపోయిన పప్పు సరఫరా చేయడంపై జిల్లా అధికార్లతోపాటు సివిల్‌ సప్లయిస్‌ ఎండీ కూడా ఆరా తీసి, అది వెంటనే వెనక్కి తీసుకుని, ప్యాకెట్లలో ఉన్న పప్పును పంపిణీ చేయమని ఆదేశించారు. అంతేకాక ఈ పప్పు ఎలా  వచ్చింది, ఎవరు సరఫ రా చేశారనే విషయం గురించి కూడా ఆరా తీసినట్టు తెలిసింది. ఐసీడీఎస్‌ డైరెక్టర్‌ తీవ్రంగా స్పందించడంతోపాటు రెండు నెలల పాటు సరఫరా చేసిన ఈ పప్పుకు డబ్బులు ఇవొద్దని కూడా ఆదేశించడం గమనార్హం. గతేడాది మార్చి నెల నుంచి లూజు కందిపప్పు సరఫరా కావడం గమనార్హం. అంతకుముందు ప్యాకెట్ల రూపంలో వచ్చేది. లూజు రావడం వల్లే ఈ సమస్య వచ్చినట్టు గుర్తించారు. కరోనా సమయంలో కందిపప్పు వచ్చినా పంపిణీ చేయకుండా శనగలు పంపిణీ చేయడం వెనుక కూడా  కొందరి స్వలాభం ఉన్నట్టు తెలిసింది. పైగా అప్పట్లో శనగలు నాసిరకంగా ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 


జిల్లాలో 28 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు


 జిల్లాలో 28 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ప్రాజెక్టులు ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు, గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ చేయడం ఈ పథకం లక్ష్యం.  పౌష్టికాహారం లేకపోవడం వల్ల  అనేక కుటుంబాలు, పిల్లలు, గర్భిణులు అనారోగ్యానికి గురవ్వడం, కాన్పులు కష్టం కావడం తెలిసిందే. ప్రభుత్వాలు ఈ సమస్యలు లేకుండా చేయడం కోసం కొంతమేరకైనా ఈ పథకం ద్వారా తోడ్పడుతున్నాయి. కానీ మధ్యలో దళారీ వ్యవస్థ, అవినీతిపరులైన అధికారులు, రాజకీయ ఒత్తిళ్ల వల్ల పప్పు సరఫరా చేసే కాంట్రాక్టర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. దీంతో అసలు ఉద్దేశం దెబ్బతింటోంది. బరితెగించడం వల్లే పసిబిడ్డలకు, గర్భి ణులకు ఇటువంటి పప్పు సరఫరా చేశారు. ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనం జిల్లాలోని 28 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంతరకూ చెప్పినా పట్టించుకోని అధికారులు స్పందించడంతో అంగ న్‌వాడీ కేంద్రాలలోనూ, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు నిర్వాహకుల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో మూడు ప్రాజెక్టుల పరిధిలో ఇటువంటి నాసిరకం పప్పు పంపిణీ అయినట్టు గుర్తించినట్టు  ఐసీడీఎస్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. కోరుకొండ ఐసీడీఎస్‌ పరిధిలోనూ, పిఠాపురం ఐసీడీఎస్‌తోపాటు, మరోచోట గుర్తించామన్నారు. కోరుకొండ ప్రాజెక్టు పరిధిలోని బొమ్మూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో ఇది ఎక్కువ జరిగినట్టు తేలింది. సాధారణంగా పౌరసరఫరాల అధికారులు ప్యాకెట్లు ద్వారానే పప్పు సరఫరా చేసేవారు. కొంతకాలం కిందట నుంచి లూజు సరఫరా చేసి, ప్రస్తుతం ప్యాకెట్లు రాలేదు, లూజు వచ్చిందని, దీనిని అందరూ అర్ధం చేసుకుని సర్దుకుపోవాలని ఆదేశిస్తూ ఓ ఉన్నతాధికారి మెసేజ్‌ పెట్టినట్టు కొందరు చెబుతున్నారు. సాధారణంగా కాంట్రాక్టర్‌ నాణ్యమైన పప్పును, ప్యాకెట్లు రూపంలో సరఫరా చేయాలి. పప్పుకు, ప్యాకెట్‌ కవరుకు కూడా ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుంది. కానీ గత మార్చి నుంచే లూజు పప్పు సరఫరా చేయడం వల్ల ప్యాకెట్ల చార్జి పేరిట కూడా రూ.కోట్లు కాజేసినట్టు అనుమానిస్తున్నారు. రాజానగరం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో శనివారం పప్పు వెనక్కి తీసుకుని, ప్యాకెట్లు పంపిణీ చేయనున్నట్టు ఓ అధికారి తెలిపారు.


  • డీఎం అధికారుల వివరణ


 ఆంధ్రజ్యోతిలో వచ్చిన ‘అంగన్‌వాడీల్లో దారుణాలు’ కథనానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ వివరణ ఇచ్చారు. పుచ్చిపోయిన కందిపప్పు సరఫరా చేస్తున్నారనేది యదార్థం కాదని ఖండిస్తూ, పుచ్చిపప్పుకు సంబంధించిన వివరాలు కూడా ఇచ్చారు. తాము మంచి కందిపప్పే ఇచ్చామని, కానీ డీలర్లు కరోనా సమయంలో ఇచ్చిన పప్పునిల్వ చేసి, అజాగ్త్త్రత్తగా ఉండడం వల్ల పాడైపోయిందని, దానిని అంగన్‌వాడీలకు డీలర్లే సరఫరా చేశారన్నారు. జిల్లా ఎలాట్‌ చేసిన కందిపప్పు కాంట్రాక్టర్‌ ద్వారా, ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు వెళుతుందని, అక్కడ శాంపిల్స్‌ తీసి, తమ జిల్లా కార్యాలయ ప్రయోగశాలలో సాంకేతిక సిబ్బంది నాణ్యతను విశ్లేషణ చేసిన తర్వాత నాణ్యతా ప్రమాణాలు ఉంటేనే దిగుమతి చేస్తామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు, కార్డుదారులకు మంచినాణ్యత గల పప్పునే ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ద్వారా రేషన్‌ డీలర్లకు అలాట్‌మెంట్‌ ప్రకారం ఇస్తామన్నారు. రాజమహేంద్రవరంలో ఇటీవల కరోనా సమయంలో కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేయుటకు రేషన్‌డీలర్లకు సరఫరా చేసిన కందిపప్పు నిల్వ లు డీలర్ల వద్ద రెండు నెలలకు పైగా ఇంకా కొంత స్టాక్‌ ఉండిపోవడంతో, డీలర్ల భద్రతా లోపం వల్ల కొంతమేర పాడైందన్నారు. దానిని కొందరు డీలర్లు అంగన్‌వాడీ కేంద్రాలకు ఇచ్చి, తామిచ్చిన మంచి పప్పును తమ వద్దే ఉంచుకున్నట్టు తమకు తెలిసిందని వివరించారు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీలకు, కార్డుదారులకు ఎట్టిపరిస్థితులలోనూ ఈ నిల్వ పప్పును సరఫరా చేయవద్దని  రేషన్‌ డీలర్లకు కఠిన హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఎంఎల్‌ఎస్‌పాయింట్లలో నాసిరకం పప్పు వస్తే, అది ఇవ్వకుండా నాణ్యత ఉన్న పప్పు ఇవ్వాలని ఆదేశించామన్నారు. 

Read more