రెడ్‌క్రాస్‌కు దేశవ్యాప్త గుర్తింపు

ABN , First Publish Date - 2022-05-08T04:52:37+05:30 IST

నెల్లూరు జిల్లా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ మొత్తం 13 విభాగాల్లో ప్రత్యేక సేవలు అందిస్తూ దేశవ్యాప్త గుర్తింపు పొందింది.

రెడ్‌క్రాస్‌కు దేశవ్యాప్త గుర్తింపు
రెడ్‌క్రాస్‌ సంస్ధ

కరోనా కాలంలో సేవలకు ప్రశంసలు

నేడు ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవం

నెల్లూరు(వైద్యం), మే 7 : నెల్లూరు జిల్లా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ మొత్తం 13 విభాగాల్లో ప్రత్యేక సేవలు అందిస్తూ దేశవ్యాప్త గుర్తింపు పొందింది. మొదటి ప్రపంచ యుద్ధానాంతరం హెన్రీడ్యూనాట్‌ యుద్ధం వద్దు శాంతి కావాలనే ధ్యేయంతో ఇంటర్నేషనల్‌ రెడ్‌క్రాస్‌ను స్థాపించి రెండో ప్రపంచ యుద్ధంలో సైతం సైనికులకు, బాధితులకు సేవలు అందిస్తూ  ప్రపంచ వ్యాప్తంగా సేవలు విస్తరింపజేశారు. ఈ నేపథ్యంలో మొదటి శాంతి బహుమతిని పొందిన హెన్రీడ్యూనాట్‌ జయంతి మే 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆ సేవలను విస్తృతం చేస్తున్న జిల్లా రెడ్‌క్రాస్‌లో ప్రస్తుతం 2వేల మందికి పైగా ఉన్న సభ్యులు వివిధ స్థాయిల్లో వైద్య, తదితర సేవలు అందిస్తున్నారు. కరోనా బాధితులకు 1414 యూనిట్ల ప్లాస్మా అందజేసి దేశంలోనే రెండవ స్థానంలో, రక్తదాతల నుంచి రక్తం సేకరణలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. బ్లడ్‌బ్యాంకుతో పాటు కేన్సర్‌ విభాగం, ఎంఎస్‌ఆర్‌ స్పాస్టిక్‌ సెంటర్‌, జూనియర్‌ రెడ్‌క్రాస్‌, యూత్‌ రెడ్‌క్రాస్‌, డిసాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, జనరిక్‌ మెడిసిన్‌, ఏఆర్‌వీ క్లినిక్‌, తలసీమియా విభాగం, వైఆర్‌జీ కేర్‌, సోషల్‌ ఎమర్జెన్సీ, పినాకిని సత్యాగ్రహ తదితర విభాగాల్లో రెడ్‌క్రాస్‌ విశిష్ట సేవలు అందిస్తోంది. కొవిడ్‌ సమయంలో రెడ్‌క్రాస్‌ వలంటీర్లు దాతల సహకారంతో 5 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 55 రోజుల పాటు 85 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారులపై వస్తున్న వలస కార్మికుల కోసం ప్రత్యేక శిబిరాలు, భోజనాలు, ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరంకు తరలించారు. కొవిడ్‌ మృతుల కోసం క్రిమిటోరియం మిషన్‌ కొనుగోలు చేసి వలంటీర్ల ద్వారా 155 మృతదేహాలకు దహన సంస్కారాలు చేశారు. ఆక్సిజన్‌తో కూడిన బస్సులు ఏర్పాటు చేశారు. కొవిడ్‌ బాధితులకు ఉచితంగా మెడికల్‌ కిట్లు పంచి పెట్టారు. అలాగే నగరంలో వరద బాధితులకు  ఆహారం, దుప్పట్లు, నిత్యావసర సరకులు, 20వేల వాటర్‌ బాటిల్లు అందచేశారు. కాగా ప్రతి ఏటా బ్లడ్‌బ్యాంకు ద్వారా 25 నుంచి 50వేల వరకు స్వచ్ఛమైన రక్తంతో పాటు బ్లడ్‌ కాంపౌండెంట్స్‌ను రోగులకు అందిస్తుంది. 100 మంది దివ్యాంగులకు ఉచిత వైద్యం,  105 మంది పిల్లలకు తలసీమియా రక్త మార్పిడి చికిత్స అందించారు. కేన్సర్‌ ఆసుపత్రిని 106 పడకల ఆసుపత్రిగా మార్పు చేశారు. ఉచిత శీతల శవపేటికలు అందుబాటులోకి తెచ్చారు. 


విస్తృత సేవలు అందిస్తున్నాం

రెడ్‌క్రాస్‌ ద్వారా ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాం. కొవిడ్‌ సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందచేశాం. వలస కార్మికులకు అండగా నిలిచాం. వరద బాధితులను ఆదుకున్నాం. బ్లడ్‌బ్యాంకు ద్వారా రక్తదాలను ప్రొత్సహిస్తూ రోగులను అన్ని విధాలా ఆదుకుంటున్నాం.

- పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌



Read more