హరితహారం లక్ష్య సాధనకు

ABN , First Publish Date - 2022-05-13T06:54:18+05:30 IST

హరితహారం లక్ష్య సాధనకు అంకితభావంతో ఉద్యోగులు కృషి చేయాలని కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో హరితహారంపై సమీక్షించారు.

హరితహారం లక్ష్య సాధనకు

అధికారులు కృషి చేయాలి

కలెక్టర్‌ నారాయణరెడ్డి

నిజామాబాద్‌అర్బన్‌, మే 12: హరితహారం లక్ష్య సాధనకు అంకితభావంతో ఉద్యోగులు కృషి చేయాలని కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో  హరితహారంపై సమీక్షించారు. జూన్‌ రెండో వారం నుంచి హరితహారం కార్యక్రమం మొదలవుతుందని ఆయాశాఖల అధికారులు సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఈ దఫా 45 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సారంగాపూర్‌, చిన్నాపూర్‌ అర్బన్‌ పార్కుల్లో మొక్కలు నాటాలన్నారు. శ్రీరామ్‌సాగర్‌, నిజాంసాగర్‌ కాల్వల వెంట మొక్కలు నాటాలని సూచించారు. ఇప్పటి వరకు నాటిన మొక్కలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా, జిల్లా అటవీశాఖ అధికారి సునీల్‌, మల్లారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

సంక్షేమశాఖల పనితీరు మెరుగుపడాలి..

సంక్షేమశాఖల పనితీరు మరింత మెరుగపడాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ నారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ సంక్షేమశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి హాస్టల్‌లోనూ సీట్ల సంఖ్యకు అనుగుణంగా వందశాతం విద్యార్థుల అడ్మిషన్‌లు జరగాలని, వసతి గృహాల సంక్షేమ అధికారులు, ఏఎస్‌డబ్లూవోలు ప్రవేశాల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. పోస్ట్‌మెట్రిక్‌ వసతిగృహాల్లో పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ ప్రీమెట్రిక్‌ హాస్టల్‌లో మొత్తం 3400 మంది విద్యార్థుల ప్రవేశాలు జరగాలన్నారు. సమావేశంలో ఎస్సీ సంక్షేమ అధికారి శశికళ పాల్గొన్నారు.

ప్రశాంతంగా న్యూ హౌజింగ్‌ బోర్డు ప్ల్లాట్ల వేలం..

జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌ న్యూహౌజింగ్‌బోర్డు కాలనీ ప్లాట్ల వేలంపాట ప్రక్రియ గురువారం ప్రగతిభవన్‌లో కలెక్టర్‌ నేతృత్వంలో నిర్వహించారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో వాణిజ్యపరమైన విభాగంలో 2 ప్లాట్లు, నివాస యోగ్యం కలిగిన 19 ప్లాట్లకు ముందస్తుగా లక్ష చొప్పున ఈఎండీలు చెల్లించిన ఔత్సాహిక బిల్డర్లు వేలంపాటలో పాల్గొన్నారు. గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు వేలంపాట వివరాలు పంపిస్తామని అక్కడి నుంచి అనుమతి వచ్చిన తర్వాత ప్లాట్లు కేటాయించడం జరుగుతుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, హౌజింగ్‌ ఈఈ బాలనాయక్‌ పాల్గొన్నారు.

ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి..

గ్రూప్స్‌తో పాటు పోలీసుశాఖలో ఉద్యోగాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగించుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌లో మెరిట్‌ టెస్టు ప్రాతిపదికన ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ప్రారంభమైందన్నారు. ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నందున స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో అందిస్తున్న శిక్షణ కోసం ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. ఎస్సీ అభ్యర్థులు పోలీసు ఉద్యోగాల శిక్షణ కోసం ఏఎస్‌బ్ల్యూవో సోమశేఖర్‌ 9440196945, గ్రూప్స్‌ ఎగ్జామ్స్‌ కోసం ఏఎస్‌డబ్లూవో భూమయ్య 9346679373 సంప్రదించాలని కోరారు. బీసీ అభ్యర్థులు స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ వెంకన్నను సంప్రదించాలన్నారు. ఎస్టీ అభ్యర్థులు సుద్దపల్లి ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధనుంజయ్‌ 9440235108, ఎస్టీ మహిళా అభ్యర్థులు సిరికొండ ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం కల్పన 9966185910 నెంబర్‌లను సంప్రదించాలని ఆయన కోరారు.

Read more