అల్పహారం.. భారం!

ABN , First Publish Date - 2022-05-04T16:36:16+05:30 IST

నగరంలో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర వర్గాలకు చెందిన చాలా మంది అల్పాహారం కోసం హోటళ్లపైనే ఆధారపడతారు. అందుకే ఉదయాన్నే

అల్పహారం.. భారం!

ఆఫ్‌ సెంచరీకి చేరువలో టిఫిన్‌ రేట్లు

30-40 శాతం పెరిగిన గ్యాస్‌, ఆయిల్‌ రేట్లు

అన్నింటిపైనా పెట్రో ధరల ఎఫెక్ట్‌

భారం తగ్గించుకునేందుకు అల్పాహారం ధరలు పెంచిన వ్యాపారులు

అధిక ధరలతో వేతనజీవులు ఉక్కిరి బిక్కిరి


ధర చూస్తే దోసె తినాలనే ఆశ నీరుగారిపోతోంది. వడ రేటు వింటే వామ్మో అనిపిస్తోంది. బొండం, పూరి, ఊతప్ప వాటివీ అదే దారి. పెరిగిన గ్యాస్‌, ఆయిల్‌, పెట్రోలు ధరల ప్రభావంతో అల్పాహారం భారంగా మారింది. సాధారణ హోటళ్లలోనూ దోసె, వడ రూ.45 నుంచి  రూ.50కు అమ్ముతుంటే..  మొన్నటి వరకు రూ.20 నుంచి రూ.25 వచ్చిన నాలుగు ఇడ్లీలను రూ.35 నుంచి రూ.40కు విక్రయిస్తున్నారు. ధరలను పెంచిన వ్యాపారులు  ఐటమ్‌ సైజులను తగ్గిస్తున్నారు.


హైదరాబాద్‌ సిటీ: నగరంలో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర వర్గాలకు చెందిన చాలా మంది అల్పాహారం కోసం హోటళ్లపైనే ఆధారపడతారు. అందుకే ఉదయాన్నే ఎక్కడ చూసినా కనిపించేవి టిఫిన్‌ సెంటర్లే. జన సామర్థ్యం కలిగిన ప్రాంతాల్లో హోటళ్లు ఉంటుండగా, పరిసరాల్లోనే తోపుడు బండ్లపై కూడా టిఫిన్‌ సెంటర్లు నిర్వహిస్తారు. కొంత కాలంగా కమర్షియల్‌ గ్యాస్‌, పెట్రోలు, ఆయిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వ్యాపారులకు టిఫిన్‌ సెంటర్ల నిర్వహణ భారంగా మారింది. అనివార్యంగా వివిధ రకాల టిఫిన్ల ధరలను పెంచారు. మధ్య తరగతి ప్రజానీకం మాత్రం పెరిగిన ధరలతో పోటీ పడలేకపోతున్నారు. వేతనాలు పెరగకపోవడంతో బడ్జెట్‌ పద్మనాభాలు కుదేలవుతున్నారు. 


టిఫిన్‌ సెంటర్లపై ప్రభావం  

గ్యాస్‌, ఆయిల్‌ రేట్లు, పప్పులు, కూరగాయల ధరలు భారీగా పెరగడంతో ఏడాది కాలంలోనే వివిధ రకాల టిఫిన్ల ధరలను రూ.15ల నుంచి రూ.20ల వరకు పెంచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇడ్లీ రూ.35- 40, ఇతర టిఫిన్‌ ధరలు రూ.50కు పైగా ఉంటే మధ్య తరగతి ప్రజానీకం బయట టిఫిన్‌ చేసే పరిస్థితి ఉండదు.  భార్య, ఇద్దరు పిల్లలతో ఉదయం వేళ బయట టిఫిన్‌ చేస్తే ప్రస్తుతం రూ.200లు దాటుతోంది. దాంతో బయట టిఫిన్లు చేయడం కంటే ఇంట్లోనే వండుకోవడం ఉత్తమమనే పరిస్థితి ఏర్పడింది. టిఫిన్‌ సెంటర్లలో ధరలు పెంచుకుంటే పోతే చివరకు వినియోగదారులు గణనీయంగా పడిపోయే అవకాశాలున్నాయి. ధరలతో పోటీపడలేక, వినియోగదారులకు మెరుగైన టిఫిన్లు అందించలేక కొన్ని టిఫిన్‌ సెంటర్లు మూతపడే ప్రమాదముందని,  తోపుడు బండ్ల వ్యాపారాలు తగ్గుతాయని కూకట్‌పల్లికి చెందిన ఓ టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకుడు తెలిపారు.


తలకిందులైన బడ్జెట్‌..

పిల్లలకు వేసవి సెలవులిస్తే గతంలో వారంలో ఒక్కరోజైనా బయటకు వెళ్లేమధ్యతరగతి కుటుంబాలు పెరిగిన ధరలతో బయట అడుగుపెట్టేందుకు ఆలోచిస్తున్నాయి. నలుగురు బంధువులు ఇంటికి వస్తే రోజు వారీ ఖర్చులు భరించలేక ఎప్పుడు వెళ్లిపోతారని ఆలోచిస్తున్నారు. రూ.25వేల నెల జీతం వచ్చే ఉద్యోగులు అద్దె, బైక్‌ పెట్రోలు, ఇంటి సామాన్లకే జీతమంతా ఖర్చవుతోందంటూ గగ్గోలు పెడుతున్నారు. వచ్చేనెల పిల్లల ఫీజులు కట్టాలన్నా బయట అప్పు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని యూసుఫ్‌గూడలో నివాసముంటున్న ఉద్యోగి శ్రీనివాస్‌ అంటున్నాడు. కుటుంబసభ్యుల ఇళ్లలో శుభకార్యాలయాలకు వెళ్లాలన్నా ఖర్చులు లెక్కేసుకొని వెళ్తున్నారు. రోజువారీ ఇంటి ఖర్చులకు సైతం బడ్జెట్‌ లెక్కలేస్తూ నెట్టుకొస్తున్నారు. ఽఓ వైపు ధరలు మండిపోతున్నా మరో వైపు వ్యాపారాలు లేవంటూ చిరువ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా అద్దె డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో హోటళ్లు, కిరణా షాపులు, దుకాణాలు నడిపిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు.. 


డబుల్‌ సెంచరీకి చేరువలో ఆయిల్‌ ధరలు

పెట్రోల్‌ లీటర్‌ రూ.119, గ్యాస్‌ సిలిండర్‌ రూ. 1,024 చేరడంతో ఇంట్లో వంటచేయక ముందే కన్నీలొస్తున్నాయి. వంట నూనెల ధరలు సలసలా కాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనట్లుగా డబుల్‌ సెంచరీకి చేరాయి. ఏడాదిలో సన్‌ఫ్లవర్‌ అయిల్‌ రూ. 136 నుంచి 194కి చేరగా, పామాయిల్‌ ధర రూ. 118 నుంచి 150-160కి ఎగబాకింది. పల్లి నూనే రూ.100 నుంచి 170కి చేరింది. పప్పుల ధరలు కూడా ఒక్కో కిలోపై రూ.50-60 పెరగడంతో సామాన్య ప్రజలతో పాటు టిఫిన్‌ సెంటర్లు, హోటళ్ల నిర్వాహకులు అల్లాడిపోతున్నారు. గత ఏడాదితో పోల్చితే కూరగాయల రేట్లు కూడా 20 శాతం పెరిగాయి. గత ఏడాది రూ.861.50 ఉన్న డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలెండర్‌ ధర ప్రస్తుతం రూ.1002లకు చేరింది. ఏడాదిలోనే రూ.141ల మేర ధర పెరిగింది. కమర్షియల్‌ సిలిండర్‌ ధర ప్రస్తుతం 2,562.50లకు చేరింది. ఒకేరోజు రూ.102.50 పెంచారు. మూడు నెలల్లో 457.50లకు కమర్షియల్‌ సిలిండర్‌ ధర పెరగడంతో టిఫిన్‌ సెంటర్లు, హోటళ్ల నిర్వహణ భారంగా మారుతోంది. ఇలా ప్రతీది 30నుంచి 40శాతం మేర పెరగడంతో హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లలో తినుబండరాల ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.


అందుకే ధరలు పెంచాల్సి వస్తోంది..

నిత్యావసర సరుకులు, నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ధరలతో రోజూ నష్టం వస్తోందే తప్ప ఏమీ మిగలడం లేదు. గతంలో రోజుకు రూ.10వేల నుంచి రూ.15 వేల వ్యాపారం జరిగేది. ఇందులో రూ.4వేల వరకు మిగిలేది. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. అనివార్యంగా మేం కూడా ధరలు పెంచాల్సి వస్తోంది.

-నాగరాజు, హోటల్‌ వ్యాపారి, హయత్‌నగర్‌

Read more