ఎడారిగా మారిన మత్తడివాగు ప్రాజెక్టు

ABN , First Publish Date - 2022-05-09T07:25:46+05:30 IST

నిన్న, మొన్నటి వరకు నిండుకుండలా ఉన్న మత్తడివాగు ప్రాజెక్టు ప్రస్తుతం ఎడారిని తలపిస్తోంది. పన్నెండు వందల ఎకరాలకు సాగు నీరు అందించే ఈ ప్రాజెక్టు.. ప్రస్తుతం నీరు వెలవెలబోతోంది. నిత్యం ప్రాజెక్టు మార్గం గుండా రాకపోకలు సాగించే వారిని నిండుజలాలతో

ఎడారిగా మారిన మత్తడివాగు ప్రాజెక్టు
నీరు లేక వట్టిపోయి ఎడారిగా కనిపిస్తున్న మత్తడివాగు ప్రాజెక్టు

తాంసి, మే 8: నిన్న, మొన్నటి వరకు నిండుకుండలా ఉన్న మత్తడివాగు ప్రాజెక్టు ప్రస్తుతం ఎడారిని తలపిస్తోంది. పన్నెండు వందల ఎకరాలకు సాగు నీరు అందించే  ఈ ప్రాజెక్టు.. ప్రస్తుతం నీరు వెలవెలబోతోంది. నిత్యం ప్రాజెక్టు మార్గం గుండా రాకపోకలు సాగించే వారిని నిండుజలాలతో కనువిందు చేసేది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిగా అడుగంటిపోవడంతో ఎడారిని మరిపిస్తోంది. దీంతో రహదారిపై వెళ్లేవారు అప్పుడే ప్రాజెక్టు జలాలు అండుగంటిపోవ డం పట్ల ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొన్నటి వరకు కనిపించిన నీరు.. ఒక్కసారిగా అడుగంటిపోవడం ఏమిటని అయోమయానికి గురవుతున్నారు.   మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టు అంతరాష్ట్ర రహదారికి పక్కనే ఉంది. ఈ ప్రాజెక్టులో నిత్యం నీళ్లు కనిపించేవి. కాని గత పక్షం రోజుల నుంచి నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.5 అడుగులు కాగా ప్రస్తుతం 270 అడుగులు కూడా లేవు. నిండు జలాలతో ఉండే ప్రాజెక్టు, ప్రస్తుతం నీరులేక వెలవెలబోతోంది. మత్తడివాగు ప్రాజెక్టు ఎడమకాలువ నుంచి పన్నెండు వందల ఎకరాలకు మూడు కాలాల్లో సాగునీరు అందుతుంది. దీంతో వడ్డాది, బండలనాగాపూర్‌, జామిడి, కప్పర్ల, జందాపూర్‌ గ్రామాల రైతులకు సాగునీరు అందేది. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిగా అడుగంటడం వల్ల సాగునీరు అందే అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో ప్రాజెక్టు గుట్ట కింద రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలు మధ్యలోనే ఎండిపోతాయి అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని  రైతులు కోరుతున్నారు. ఈయేడు వానాకాలం చివర్లో వర్షాలు లేక ప్రాజెక్టులోకి పూర్తిస్థాయి నీరు చేరలేకపోయింది. మొత్తం మీద నిండుకుండలా కనిపించే ప్రాజెక్టు ఎడారిని తలపించేలా కనిపిస్తుండటంతో రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని రైతులతో పాటు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more