కొండలు కొల్లగట్టుతూ..

ABN , First Publish Date - 2022-05-05T05:59:53+05:30 IST

కొండలు.. గుట్టలు..

కొండలు కొల్లగట్టుతూ..
కర్నూలు శివారున జగన్నాథగట్టు అక్రమించి ఇలా ఉద్యాన పంటల సాగు

  1.  ఆక్రమణకు గురవుతున్న  జగన్నాథ గట్టు
  2.  రూ.కోట్ల విలువైన  ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం
  3.   పట్టించుకోని అధికారులు


కొండలు.. గుట్టలు.. కావేవీ కబ్జాకు అనర్హం.. అంటూ భూ మాఫియా చెలరేగిపోతోంది. కొండలను కొల్లగొట్టి.. ఆపై చదును చేసి...పక్కా ప్రణాళికతో కొంతమంది కబ్జా చేస్తున్నారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని సొంతం చేసుకుంటున్నారు. అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధుల అండదండలతో ఆనలైన రికార్డులనూ మార్చేస్తున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన  రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తోంది. కర్నూలు నగర శివారున ఉన్న జగన్నాథ స్వామి గట్టును ఇలాగే కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా పంచుకుంటున్నారు.

 

(కర్నూలు-ఆంధ్రజ్యోతి) 

కర్నూలు నగర శివారున శ్రీలక్ష్మీ జగన్నాథస్వామి గట్టు పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందుతోంది. కల్లూరు మండలం లక్ష్మీపురం, దూపాడు రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్న ఈ గట్టు విస్తీర్ణం 424 ఎకరాలు. సర్వే నంబర్లు 139, 793 పరిధిలో ఇది ఉంది. ఇదంతా ప్రభుత్వ భూమే. తొలుత కర్నూలు-చిత్తూరు వయా నంద్యాల నేషనల్‌ హైవే నిర్మాణానికి కొంత భూమి కేటాయించారు. గత టీడీపీ ప్రభుత్వం పేదలకు జీ-3 తరహాలో పక్కా ఇళ్ల నిర్మాణానికి  ఏపీ టీడ్కో సంస్థకు 125 ఎకరాలు కేటాయించింది. ఏడాది క్రితం వైసీపీ ప్రభుత్వం ఇక్కడే పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది. వివిధ అవసరాల కోసం కేటాయింపులు పోనూ వందల ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉంది. నగర శివారులో ఉండడం.. టిడ్కో ఇళ్లు నిర్మిచడంతో ఇక్కడ ఎంత తక్కువ కాదన్నా ఎకరం రూ.కోటి పైమాటే. దీంతో ఆక్రమణదారుల కన్ను జగన్నాథ గట్టుపై పడింది. అధికార పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధుల వత్తాసుతో కొందరు కబ్జా చేస్తున్నారు. ఆనలైనలో పేర్లు మార్చుకొని అమ్మకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

తిలాపాపం.. తలా పిడికెడు

లక్ష్మీపురం, దూపాడు గ్రామాల పరిధిలో ఉన్న జగన్నాథగట్టు ఎర్ర గరుసును అనుమతుల ముసుగులో కొందరు అమ్మేస్తున్నారు. ఆ గుంతలను చదును చేసి ఆక్రమిస్తున్నారు. ఇటీవల రైల్వే కోచ పరిశ్రమ, జాతీయ రహదారి నిర్మాణాలకు అవసరమైన ఎర్ర గరుసు తవ్వుకోవడానికి రెవెన్యూ అధికారులు అనుమతి ఇచ్చారు. కాంట్రాక్టర్లు అవసరమైన మేరకు తవ్వకం పూర్తి చేయగానే... ఆ గుంతలను కొందరు పూడ్చేసి దర్జాగా కబ్జా చేస్తున్నారు. కీలక ప్రజాప్రతినిధులతో రెవెన్యూ అధికారులకు సిఫారసులు చేయించుకొని ఆనలైనలో పేర్లు నమోదు చేసుకుంటున్నారని.. డీ-పట్టాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆనలైనలో పేరు మారగానే ఇతరులకు రిజిసే్ట్రషన చేయించి చేతులు మారుస్తున్నారు. ఈ భాగోతంలో భారీ మొత్తంలో నగదు చేతులు మారిందనే ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా పండ్ల తోటల పెంపకం చేపట్టారు. ఇందులో ఓ ముఖ్య పోలీసు అధికారి పాత్ర ఉన్నట్టు సమాచారం. బినామీ పేరుతో డి.పట్టా భూమిని కొనుగోలు చేసి ఆ భూమి పక్కనే ఉన్న జగన్నాథ గట్టును ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

  పేదల పట్టాలు ఏమాయెనో?

 కల్లూరు మండలం దూపాడు గ్రామం సర్వే నంబరు 139 పరిధిలో జగన్నాథ గట్టు దిగువన 12.28 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 450 మంది పేదలకు 2013లో ఇంటి పట్టాలు ఇచ్చారు. ఆనాటి అసైన్మెంట్‌ కమిటీ ఆమోదంతో ఈ పట్టాలు ఇచ్చారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్తు వంటి కనీస వసతులు లేక పేదలు ఇళ్లు నిర్మించుకోలేదు. ఆ భూములపై అక్రమార్కుల కన్ను పడింది. 2021లో కర్నూలు నగరానికి చెందిన ముగ్గురు మహిళల పేరు మీద ఆనలైన రికార్డులు మార్చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇద్దరికి 5 ఎకరాలు చొప్పున, మరొకరికి 4 ఎకరాలు ఉన్నట్టుగా మార్చినట్టు సమాచారం. ఈ భాగోతంలో భారీ మొత్తంలో నగదు చేతులు మారిందనే ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు ఇంటి పట్టాలకు ఇచ్చిన భూములు ఉన్నాయని అంటున్నారే తప్ప...అవి ఎక్కడున్నాయో క్షేత్రస్థాయిలో చూపడం లేదని దూపాడు గ్రామస్థులు చెబుతున్నారు. పేదలకు డి-పట్టా ఇవ్వాలంటే ఆసైన్మెంట్‌ కమిటీ ఆమోదం తెలపాలి. అది కూడా స్థానిక గ్రామాల్లో సెంటు పొలం ఉన్నా... నిరుపేదలకు సాగు పట్టాలు ఇవ్వాలి. అందులోనూ ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దీనికి భిన్నంగా... నిబంధనలకు నీళ్లొదిలి... ప్రభుత్వ భూములు ఆన్యాక్రాంతం చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పదేళ్లుగా ఇక్కడ పని చేసిన రెవెన్యూ అధికారులు కొందరు మామూళ్ల మత్తులో రూ.కోట్ల విలువైన జగన్నాథ గట్టు ప్రభుత్వ భూములు నిబంధనలకు విరుద్ధంగా కొందరికి కేటాయించేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములను సంరక్షించాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 


ప్రభుత్వ భూమిని కాపాడుతాం

జన్నాథగట్టు వద్ద ఎర్ర గరుసు తవ్వకానికి ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. ఆ గుంతలు చదును చేసి ఆక్రమించుకున్నారని మా దృష్టికి వచ్చింది. డీకేటీ పట్టాలు ఉన్నాయని అంటున్నారు. సర్వే చేసి ఆక్రమణలు ఉన్నట్టయితే... వాటిని తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడుతాం. 

- రమేష్‌బాబు, తహసీల్దారు

విచారిస్తాం..

కర్నూలుజగన్నాథ గట్టు తవ్వకాలు, ఆక్రమణల విషయం నా దృష్టికి రాలేదు. రెవెన్యూ అధికారులతో విచారించి చర్యలు తీసుకుంటాం. 

 - రామ సుందరరెడ్డి,  జాయింట్‌ కలెక్టరు, కర్నూలు




Read more