తొలి స్వదేశీ ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ క్యాండిడేట్‌

ABN , First Publish Date - 2022-05-14T09:27:00+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల తయారీలో ఒక విప్లవం ‘ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీ’.

తొలి స్వదేశీ ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ క్యాండిడేట్‌

  • అభివృద్ధి చేసిన సీసీఎంబీ .. 
  • ఎలుకలపై ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు
  • వ్యాక్సిన్ల ఉత్పత్తికి సంప్రదిస్తున్న కంపెనీలు

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల తయారీలో ఒక విప్లవం ‘ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీ’. దేశంలోనే తొలిసారిగా కరోనాపై పనిచేసే ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ క్యాండిడేట్‌ను హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) అభివృద్ధి చేసింది. ఈవిషయాన్ని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ కుమార్‌ నందికూరి శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కరోనాతో పాటు డెంగీ, క్షయ, మలేరియా వంటి వ్యాధులకు ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలను తయారుచేసేందుకూ ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. సీసీఎంబీలోని అటల్‌ ఇంక్యుబేషన్‌ సీఈవో డాక్టర్‌ మధుసూధనరావు సారథ్యంలోని పరిశోధకుల బృందం ‘ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీ’ని అభివృద్ధి చేసిందన్నారు. ప్రీ-క్లినికల్‌ ప్రయోగాల్లో భాగంగా మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ (ఎం-ఆర్‌ఎన్‌ఏ) వ్యాక్సిన్‌ను ఎలుకలకు రెండు డోసుల్లో ఇచ్చారు. అనంతరం వాటికి పరీక్షలు నిర్వహించగా.. రోగ నిరోధక స్పందన పెరిగిందని, పెద్దసంఖ్యలో యాంటీబాడీలు విడుదలయ్యాయని పరిశోధకులు గుర్తించారు. ఈ యాంటీబాడీలు.. మనుషులకు సోకే కరోనా వైర్‌సపైనా 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తాయని అధ్యయనంలో తేలింది. ఈ టెక్నాలజీ ఆధారంగా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తామంటూ పలు కంపెనీలు తమను సంప్రదిస్తున్నాయని అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ సీఈవో డాక్టర్‌ మధుసూధనరావు తెలిపారు.


జంతువులపై అధ్యయనం కోసం నమూనాలను బెంగళూరు పరిశోధనా సంస్థకు పంపామన్నారు. అక్కడి నుంచి ఒకటి, రెండు నెలల్లోగా ఫలితాలు వస్తే, పరిశోధనల ప్రక్రియ ముగిసినట్టేనని పేర్కొన్నారు. ఆ తర్వాత ఎం-ఆర్‌ఎన్‌ఏ టీకాల ఉత్పత్తి ప్రక్రియకు శ్రీకారం చుట్టొచ్చని ఆయన చెప్పారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన జెనోవా బయో కంపెనీ ఇంతకుముందు అభివృద్ధిచేసిన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌కు, తమ వ్యాక్సిన్‌ క్యాండిడేట్‌కు చాలా తేడా ఉందన్నారు. జెనోవా బయో కంపెనీ సెల్ఫ్‌ రెప్లికేటింగ్‌ ఆర్‌ఎన్‌ఏ పరిజ్ఞానంతో ఎంఆర్‌ఎన్‌ఏ టీకాను తయారుచేసిందని వివరించారు. పరిశోధనలో కీలకపాత్ర పోషించిన రాజేష్‌ అయ్యర్‌, నందిత, క్రాంతి, ప్రీతి, అన్విత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

                                                                        - స్పెషల్‌ డెస్క్‌/తార్నాక (ఆంధ్రజ్యోతి)


పాన్‌ కరోనా వాక్సిన్‌ ఎంఆర్‌ఎన్‌ఏతో సాధ్యం

అన్నిరకాల కరోనా వైర్‌సలను నిరోధించే పాన్‌ వ్యాక్సిన్‌ను ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో అభివృద్ధి చేయొచ్చు. కరోనాను మాత్రమే కాదు డెంగీ, క్షయ, మలేరియాతో పాటు ఇతర వైర్‌సల కారణంగా వచ్చే వ్యాధులకు కూడా టీకాలను అందుబాటులోకి తేవచ్చు. ఫైజర్‌, మోడెర్నా కంపెనీలు చాలాకాలంగా ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్నా, కరోనా మొదలైన వెంటనే ఈ సాంకేతిక పరిజ్ఞానంతో టీకాలను తయారు చేశాయి. అవసరానికి తగ్గట్లు వేగంగా మార్పులు చేసే అవకాశం ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీ ప్రత్యేకత.

- వినయ్‌ నందికూరి, డైరెక్టర్‌, సీసీఎంబీ




Read more