కూరగాయల సాగు భారం

ABN , First Publish Date - 2022-05-15T04:45:18+05:30 IST

ప్రభుత్వాలు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల దృష్టి మళ్లించాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వడం లేదు. కూరగాయల విత్తనాలపై ప్రభుత్వం పూర్తిగా సబ్సిడీని ఎత్తివేసింది. అంతేకాకుండా కూరగాయల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వకపోవడంతో మెదక్‌ జిల్లా రైతులు గత మూడు, నాలుగేళ్లుగా ఆసక్తి చూపడం లేదు.

కూరగాయల సాగు భారం

విత్తన సబ్సిడీ ఎత్తివేతతో నాలుగేళ్లుగా రైతుల్లో అనాసక్తి

 తగ్గుతున్న సాగు విస్తీర్ణం.. ఈ వానాకాలం సీజన్‌లో 1200 ఎకరాల్లోనే పండించే అవకాశం

 2వేల ఎకరాలకు పెంచేందుకు   ఉద్యానవన అధికారుల యత్నం


మెదక్‌, మే 14: ప్రభుత్వాలు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల దృష్టి మళ్లించాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వడం లేదు. కూరగాయల విత్తనాలపై ప్రభుత్వం పూర్తిగా సబ్సిడీని ఎత్తివేసింది. అంతేకాకుండా కూరగాయల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వకపోవడంతో మెదక్‌ జిల్లా రైతులు గత మూడు, నాలుగేళ్లుగా ఆసక్తి చూపడం లేదు. వరి వైపే మొగ్గు చూపడంతో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గుతోంది. ప్రస్తుతం వానాకాలం సీజన్‌లో కేవలం 1,200 ఎకరాల్లోనే రైతులు కూరగాయల సాగు చేయనున్నట్లు సమాచారం. అయితే ఉద్యాన వన అధికారులు మాత్రం 2వేల ఎకరాల విస్తీర్ణానికి పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. 


మార్కెట్‌ నుంచి కూరగాయల దిగుమతి 


తూప్రాన్‌, చిన్నశంకరంపేట, చేగుంట, హవేళిఘనపూర్‌, రామాయంపేట, టేక్మాల్‌, నిజాంపేట, నర్సాపూర్‌, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట మండలాల్లో క్యాబేజీ, పచ్చిమిర్చి, టమాటా, బెండకాయ, చిక్కుడు, గోరు చిక్కుడు, కాకరకాయ, బీరకాయ, కాలీఫ్లవర్‌తో పాటు పాలకూర, తోటకూర, బచ్చలి, గోంగూర, మెంతికూర, చుక్కకూర, కొత్తిమీర, పుదీన తదితర ఆకుకూరలను పండిస్తున్నారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా జిల్లాలో కూరగాయల ఉత్పత్తి లేకపోవడంతో హైదరాబాద్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌ నుంచి కూరగాయలను వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. 2016కు ముందు 50 శాతం సబ్సిడీపై ప్రభుత్వం రైతులకు విత్తనాలు అందించేది. ఆ తర్వాత సబ్సిడీని ఎత్తివేయడంతో బహిరంగ మార్కెట్‌లో రైతులు విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తుంది. వేలాది రూపాయలు వెచ్చించి విత్తనాలు కొనుగోలు చేస్తే అవి నకిలీవైతే ఆర్థికంగా నష్టపోతామని రైతులు కూరగాయల సాగుకు మొగ్గు చూపడం లేదు.


విత్తనాలకు బదులు నారు సరఫరా


ప్రభుత్వం ములుగు ఉద్యానవన యూనివర్సిటీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు విత్తనాలకు బదులుగా 90 శాతం సబ్సిడీపై కూరగాయల నారును సరఫరా చేస్తోంది. అయినా కూడా నారు కావాల్సిన రైతులు నెల రోజుల ముందే డీడీ చెల్లించి ఎదురుచూడాల్సి వస్తుంది. టమాటా, వంకాయ, మిర్చిలకు సంబంధించిన విత్తన నారు మాత్రమే సరఫరా చేస్తున్నారు. మిగతా కూరగాయల విత్తనాలను రైతులు మార్కెట్‌లోనే కొనుగోలు చేయాల్సి వస్తున్నది. 


కోతుల బెడద


కూరగాయల సాగుకు కలుపుతీయడం తదితర పనులు చేసే కూలీలకు డబ్బు పెద్దమొత్తంలో వెచ్చించాల్సి వస్తుంది. కూలీ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడం కూడా రైతుల అనాసక్తికి ఓ కారణం. వీటికి తోడు జిల్లా వ్యాప్తంగా కోతుల బెడద తీవ్రమవుతోంది. చేతికి వచ్చే పంటలపై పడి కోతులు ధ్వంసం చేయడం రైతులను కలవరపరుస్తోంది. 


వానాకాలంలో వరిసాగుకే రైతుల మొగ్గు 


ఏటా వానాకాలం సీజన్‌లో జిల్లాలో రైతులు వరి పంట సాగుకే ఆసక్తి చూపుతున్నారు. వరి పండించడం మిగతా ఉద్యాన వన పంటలతో పోల్చితే తేలిక. సమృద్ధిగా పంటకు నీరుంటే చాలా వరకు వరి రైతులు గట్టెక్కినట్లే. కూరగాయల పంటలకు రేయింబవళ్లు రైతు కష్టపడాల్సి వస్తుంది. అనుక్షణం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. పైగా ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడం, పంట చేతికొచ్చే సమయానికి కూరగాయల ధరలు పడిపోవడం వంటి విపత్కర పరిస్థితుల వల్ల రైతులు ఆసక్తి చూపడం లేదు. వరిసాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు.

Read more