Tambaram-Velacheri ఫ్లైఓవర్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-14T13:44:25+05:30 IST

రాష్ట్ర రహదారులశాఖ ఆధ్వర్యంలో రూ.95.21 కోట్లతో మేడవాక్కం రహదారి వంతెన నిర్మితమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో తాంబరం - వేళచ్చేరి వరకు పూర్తయిన

Tambaram-Velacheri ఫ్లైఓవర్‌ ప్రారంభం

                     - స్వయంగా పరిశీలించిన సీఎం 


చెన్నై: రాష్ట్ర రహదారులశాఖ ఆధ్వర్యంలో రూ.95.21 కోట్లతో మేడవాక్కం రహదారి వంతెన నిర్మితమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో తాంబరం - వేళచ్చేరి వరకు పూర్తయిన 2.3 కి.మీ మేర ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. తాంబరంలో శుక్రవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన కారులో ఫ్లైఓవర్‌పై కొంతదూరం ప్రయాణించి, స్వయంగా పరిశీలించారు. ఈ ఫ్లైఓవర్‌ను మౌంట్‌ మేడవాక్కం రహదారి కూడలి, మేడవాక్కం - మాంబక్కం రహదారి కూడలి, మేడవాక్కం - షోళింగనల్లూరు రహదారి కూడలిని కలిపేలా నిర్మించారు. ఈ రహదారి వంతెన ప్రారంభించడంతో మేడవాక్కం ప్రాంతంలో ట్రాఫిక్‌ రద్దీ బాగా తగ్గుతుందని, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, వాహన చోధకులు సులువుగా గమ్యస్థానాలకు చేరుకోగలరని ముఖ్యమంత్రి తెలిపారు. తాంబరం, వేళచ్చేరి, దురైపాక్కం, పళ్ళిక్కరణి,ఈస్టు కోస్టు రోడ్డు, ఐటీ కారిడార్‌ రోడ్డు, తరమణి, అడయారు, మేడవాక్కం, షోళింగనల్లూరు, మడిపాక్కం ప్రాంతాలకు వెళ్లే ప్రజలు సకాలంలో గమ్యస్థానాలకు వెళ్ళగలుగుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఏవీ వేలు, దామో అన్బరసన్‌, ఎం.సుబ్రమణ్యం, రహదారులు, చిన్న ఓడరేవుల శాఖ ప్రధాన కార్యదర్శి ధీరజ్‌కుమార్‌, శాసనసభ్యుడు ఎస్‌. అరవింద్‌ రమేష్‌, చెంగల్పట్టు జిల్లా కలెక్టర్‌ ఏఆర్‌ రాహుల్‌నాధ్‌, రాష్ట్ర రహదారుల శాఖ ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ పీఆర్‌ కుమార్‌, చీఫ్‌ ఇంజనీర్లు ఆర్‌ కోదండరామన్‌, ఆరి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.



Read more