ఊపిరి నిలిచేనా.. KCR సర్కారు పట్టించుకునేనా.. ప్రాభవం కోల్పోతున్న చెస్ట్‌ ఆస్పత్రి..!

ABN , First Publish Date - 2022-05-08T19:28:26+05:30 IST

ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడేవారికి ఊపిరి అందించే ఆస్పత్రి అది. ఒకప్పుడు 670

ఊపిరి నిలిచేనా.. KCR సర్కారు పట్టించుకునేనా.. ప్రాభవం కోల్పోతున్న చెస్ట్‌ ఆస్పత్రి..!

  • కుదించుకుపోతున్న పడకలు
  • శిథిల భవనాలతో ఇప్పటికే 370 రద్దు
  • సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రితో తగ్గనున్న మరో 180 పడకలు
  • ఇక మిగిలేవి 120 మాత్రమే
  • వైద్యుల వినతులను సర్కారు పట్టించుకునేనా?

ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడేవారికి ఊపిరి అందించే ఆస్పత్రి అది. ఒకప్పుడు 670 పడకలతో రోగులకు సేవలు అందించేది. కేవలం క్షయ జబ్బులకే కాదు.. ఆస్తమా, కేన్సర్‌, కార్డియో థోరాసిక్‌, ఆర్థోపెడిక్‌, పీడియాట్రిక్‌, హెచ్‌ఐవీ.. ఇలా అనేక రుగ్మతలకు చికిత్సలు అందించిన చెస్ట్‌ ఆస్పత్రి  పరిస్థితి ఇప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమయ్యేలా ఉంది.


హైదరాబాద్‌ సిటీ : ఒకప్పుడు చెస్ట్‌ ఆస్పత్రి ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం జనరల్‌ ఆస్పత్రిగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అవి అమలు కాలేదు. ఆస్పత్రి అభివృద్ధి కొత్త భవనం నిర్మించాలన్న ప్రతిపాదనలూ కార్యరూపం దాల్చలేదు. ఆస్పత్రిపై చిన్నచూపు చూపడంతో పడకల సంఖ్య క్రమేణా కుంచించుకు పోయింది.


670 నుంచి 120 పడకలకు..

చెస్ట్‌ ఆస్పత్రిలో 670 పడకలు ఉండేవి. రోగులకు అవి సరిపోయేవి కావు. క్రమంగా ఉన్న పడకలు కూడా తగ్గిపోయాయి. పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆర్థోపెడిక్‌, సిటీసర్జరీ, పురుషులు, మహిళ విభాగాల్లో సేవలతో పాటు ల్యాబ్‌ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయా యి. ఎంఎం- 6, సీఎ్‌సడీ, ఎంఓటీ-బి, మెడికల్‌ స్టోర్‌, కార్డియో థోరాసిక్‌ యూనిట్లు మూతపడ్డాయి. హిస్టో ప్యాథాలజీ నాచుపట్టి అధ్వానంగా మారింది. ఫిజియోథెరపీ విభాగం శిథిలావస్థకు చేరింది.  అప్పట్లో ఒక్కో యూనిట్‌కు 40 చొప్పున పడకలు ఉండేవి. పాత భవనంలో వైద్య సేవలు నిలిపేయడంతో ఏకంగా 370 పడకలను రద్దు చేశారు. ప్రస్తుతం 300 మాత్రమే మిగిలాయి. ఇప్పుడు ఈ పడకలున్న రేకుల షెడ్డు వార్డులను కూల్చి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించేందుకు ఇటీవలే భూమి పూజ చేశారు. నూతనంగా నిర్మించే ఆస్పత్రి చెస్ట్‌ ఆస్పత్రి పరిధిలో ఉండదు. స్వయం ప్రతిపత్తి (అటానమస్)తో నిర్మిస్తున్నారు. ఈ ఆస్పత్రి ఏర్పాటుతో చెస్ట్‌ ఆస్పత్రి మరో 180 పడకలను కోల్పోనుంది. ఇక మిగిలేవి కేవలం 120 మాత్రమే.


ప్రత్యేక ఆస్పత్రి అవసరం

చెస్ట్‌ ఆస్పత్రిలో క్షయకే కాదు.. కేన్సర్‌, కార్డియోథోరాసిక్‌, ఆర్థోపెడిక్‌, పీడియాట్రిక్‌ సేవలు కూడా గతంలో అందించేవారు. కాలుష్యంతో వచ్చే బ్రాంకైటిస్‌ వ్యాధులకు వైద్యం చేసేవారు. స్వైన్‌ఫ్లూకు మొదటి సారి ఇక్కడే చికిత్సలు అందించి వైద్యులు మన్ననలు పొందారు. అటువంటి ఆస్పత్రిలో సేవలు తగ్గుతూ వస్తున్నాయి. మున్ముందు వచ్చే వ్యాధులన్నీ ఊపిరితిత్తులకు సంబంధించినవే ఉంటాయని, వాటికి ప్రత్యేక వైద్యశాల ఉండడం చాలా అవసరమని వైద్యులు పేర్కొంటున్నారు.


1950లో ట్రైనీలకు శిక్షణ

1950లో అప్పటి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ చెస్ట్‌ ఆస్పత్రిలోని రెండు వార్డులను ప్రారంభించారు. అప్పటి నుంచీ గాంధీ, ఉస్మానియాలోని ట్రైనీ వైద్యులు ఇక్కడ శిక్షణ పొందుతుండేవారు. 1960లో ప్రొఫెసర్‌ డాక్టర్‌ కేఎన్‌. రావు జాతీయ సలహాదారుడిగా రీజనల్‌ కార్డియోథోరాసిక్‌ సెంటర్‌, టీబీకి చెందిన బ్యాక్టీరియాను గుర్తించే లాబోరేటరీ, స్టేట్‌ టీబీ సెంటర్‌ ఏర్పాటు చేశారు. 1978లో ఎండీ ఇన్‌ చెస్ట్‌ మెడిసిన్‌ కోర్సును ప్రారంభించారు. 1986 నుంచి టీబీ, ఛాతీ వ్యాధులకు సంబంధం లేని లంగ్‌ కేన్సర్‌, ఆస్తమా, సీఓపీడీ, లంగ్‌ డిసీసెస్‌, కార్డియాలజీ, ఆర్థోపెడిక్‌ తదితర చికిత్సలను ప్రారంభించారు. 1993లో రెస్పిరేటరీ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. అన్ని రకాల సేవలూ ఇక్కడ లభిస్తుండడంతో 1997లో ప్రభుత్వం జనరల్‌ అండ్‌ చెస్ట్‌ ఆస్పత్రిగా మారుస్తూ జీవోను జారీ చేసింది. ఉత్తర్వులు అమలు కాకపోవడంతో కేవలం శ్వాసకోశ జబ్బులకే పరిమితమైంది. 


550 పడకలతో ప్రతిపాదనలు

పల్మనాలజీ, కార్డియోథోరాసిక్‌, ఆర్థోపెడిక్‌, పీడియాట్రిక్‌, కేన్సర్‌ వంటి విభాగాలతో ప్రత్యేక చాతీ, ఊపిరితిత్తుల ఆస్పత్రి నిర్మాణం అవసరమని వైద్యులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఆరు యూనిట్లతో, అధునాతన ఆపరేషన్‌ థియేటర్లను నిర్మిస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు వైద్య సేవల కోసం వస్తారని పేర్కొన్నారు. ఊపిరితిత్తులకు ప్రత్యేక వైద్యం అందించడానికి కొత్త భవనం అవసరమని అంటున్నారు. మధ్య తరగతి వర్గాలకు నామమాత్రపు రుసుంతో వైద్యం అందించేందుకు పెయిడ్‌ రూమ్‌ల ఏర్పాటు చేస్తే ఆదాయం కూడా సమకూరుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇటీవల సీటీస్కాన్‌ యంత్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు దృష్టికి కూడా వైద్యులు ఈ ప్రతిపాదనలను తీసుకెళ్లారు. వీరి వినతులను సర్కారు ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటుందో చూడాలి.

Read more