YSRCPతో పొత్తులకు వచ్చే పార్టీ ఒక్కటైనా ఉందా..!?

ABN , First Publish Date - 2022-05-14T12:35:11+05:30 IST

ఎన్నికల్లో పొత్తులనేది ఒకపార్టీపై మరొక పార్టీకి ఉన్న గౌరవమని

YSRCPతో పొత్తులకు వచ్చే పార్టీ ఒక్కటైనా ఉందా..!?

  • అంటరాని పార్టీగా చూస్తున్నారనే భయం
  • రైతుల్ని తాకట్టుపెట్టి అప్పు తెచ్చుకుంటున్నారు
  •  సీఎం జగన్‌ విమర్శలకు సోమిరెడ్డి కౌంటర్‌

ఎన్టీఆర్ జిల్లా/తోట్లవల్లూరు : ఎన్నికల్లో పొత్తులనేది ఒకపార్టీపై మరొక పార్టీకి ఉన్న గౌరవమని, ఇలాంటి గౌరవం వైసీపీకి (YSRCP) లేదని మాజీ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (Somireddy) అన్నా రు. టీడీపీ, జనసేన (TDP-Janasena) పొత్తులు పెట్టుకుంటున్నాయని, పవన్‌ చంద్రబాబుకు దత్తపుత్రుడని సీఎం జగన్‌ (CM Jagan) చేసిన విమర్శలపై మండలంలోని భద్రిరాజుపాలెంలో టీడీపీ నేత చాగంటి తిమ్మారెడ్డి నివాసంలో శుక్రవారం సోమిరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. పొత్తులు లేకుండా పోటీ చేయాలని పదేపదే వైసీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 


పొత్తులనేది ఎన్నికల సమయంలో తీసుకునే నిర్ణయమని, ఇపుడే ఎలాంటి నిర్ణయం జరగకపోయినా వైసీపీకి ఎందుకు భయం పట్టుకుందో తెలియటం లేదన్నారు. అసలు రాష్ట్రంలో వైసీపీతో పొత్తుకు వచ్చే పార్టీ ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. వైసీపీని అన్ని పార్టీలు అంటరానిదిగా చూస్తున్నాయని, అందుకే ఆ పార్టీతో పొత్తుకు వచ్చే పార్టీ లేదన్నారు. అప్పు తెచ్చుకునేందుకు రైతులను తాకట్టు పెట్టి వ్యవసాయ బోర్లకు మీటర్ల పెట్టేందుకు జగన్‌ సిద్ధమయ్యారన్నారు.


 ఒక సీఎంగా తానేం చేస్తున్నారో చెప్పలేక చంద్రబాబుని తిట్టటమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నెల్లూరులో క్రాప్‌ హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చిందన్నారు. రైతుకు ఏమి చేశారో దమ్ముంటే చెప్పాలన్నారు. ఎన్నికల ముందు ఏమి మాట్లాడారో ఇప్పుడేమి చేస్తున్నారో జగన్‌ పరిశీలించుకుంటే ఎంత మోసం చేస్తున్నారో తనకే అర్ధమవుతుందన్నారు. ఈ సమావేశంలో మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, గోపు సత్యనారాయణ, కొనకళ్ళ నారాయణరావు, వర్ల కుమార్‌ రాజా, తలశిల స్వర్ణలత, నాయకులు పాల్గొన్నారు.

Read more