ఆర్భాటం ఘనం...ఆచరణ శూన్యం

ABN , First Publish Date - 2022-05-11T04:38:09+05:30 IST

‘‘ఒకటి కాదు..రెండు కాదు..పదహారు రోజులుగా పడిగాపులు కాస్తున్నం. అయినా మా బాధలు ఎవరికీ పట్టడం లేదు.

ఆర్భాటం ఘనం...ఆచరణ శూన్యం
కౌడిపల్లిలోని కొనుగోలు కేంద్రంలో పేరుకుపోయిన ధాన్యం కుప్పలు

టార్గెట్‌ 3.77 లక్షల మెట్రిక్‌ టన్నులు

ఇప్పటి వరకు కొన్నది 13 వేల టన్నులే! 

మెదక్‌ జిల్లాలో మందకొడిగా ధాన్యం కొనుగోలు

వారాల తరబడిగా కేంద్రాల వద్ద  రైతుల పడిగాపులు 

అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడేందుకు నానా తిప్పలు

పేరుకుంటున్న ధాన్యం కుప్పలు


 ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, మే 10: ‘‘ఒకటి కాదు..రెండు కాదు..పదహారు రోజులుగా పడిగాపులు కాస్తున్నం.  అయినా మా బాధలు ఎవరికీ పట్టడం లేదు. పంట పండించడం ఒకెత్తయితే ఆ పంటను అమ్ముకోవడం మరో ఎత్తు. కొనుగోలు కేంద్రాల్లో ధాన ్యం అమ్ముకోవాలంటే దేవుడు కనిపిస్తున్నడు. ఇళ్లు, వాకిలి, పిల్లలను వదిలి కేంద్రాల్లో ఉంటున్నం. వాన పడితే కనీసం టార్పాలిన్‌ కవర్లు కూడా ఇస్తలేరు. మేమే కిరాయికి తెచ్చుకుంటు న్నం. రెండు రోజులు సన్న వడ్లు కొంటున్నరు. ఇంకో రెండు రోజులు దొడ్డు వడ్లు కొంటరట. ఇంత అన్యాయమా?’’ అంటూ మెదక్‌ జిల్లా హవేళిఘనపూర్‌లో రైతు పెంటమ్మ వాపోయింది. ఇది ఒక్క పెంటమ్మ బాధే కాదు.. మెదక్‌ జిల్లాలోని రైతులందరీ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంతో ఆర్భాటం ఏర్పాటు చేసినా కొనుగోళ్లలో మాత్రం వేగం కనిపించడం లేదు.

గత అనుభవాలు, దిగుబడులు పెరగడం వంటి వాటితో దశల వారీగా ధాన్యం కొనుగోలు పూర్తిచేయడానికి అధికారులు కొన్ని లక్ష్యాలను ఎంచుకున్నారు. ఈసారి మెదక్‌ జిల్లాలో 3.77 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. అందులో భాగంగా ఏప్రిల్‌ నెలాఖరు నాటికి 90 వేల మెట్రిక్‌ టన్నులు, మే నెలాఖరు వరకు 2లక్షల మెట్రిక్‌ టన్నులు, జూన్‌లో మొత్తం ధాన్యం కొనుగోలు చేసే విధంగా ప్రణాళికలు రచించినా ఫలితం లేకుండాపోయింది. అధికారులు కొనుగోలు కేంద్రాలను వీలైనంత త్వరగా ప్రారంభిస్తే కొనుగోళ్లలో కొంత పురోగతిని సాధించేవారు.  ఏప్రిల్‌ 14 నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం ఓ తంతుగా మారింది. అధికార పార్టీ నేతలు వచ్చే వరకు కొనుగోలు కేంద్రాలు తెరుచుకోవడం లేదు. మొదట్లో అక్కడక్కడా కొనుగోలు కేంద్రాలు తెరిచినా వడ్లు కొనలేదు. ఇక ప్రభుత్వం చేసిన హడావుడిని చూసి రైతులు కేంద్రాలకు పరుగులు తీశారు. తీరా కొనే దిక్కు లేకపోవడంతో రోజులు తరబడి అక్కడే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. ఎప్పుడు వానొచ్చి ధాన్యం తడుస్తుందోనని రైతాంగం ఆందోళనకు గురవుతున్నది. 


ఇప్పటి వరకు కొన్నది 13.2 వేల మెట్రిక్‌ టన్నులే

ఒక్క ఏప్రిల్‌లోనే 90 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొంటామని అధికారుల ఢంకా భజాయించారు. కానీ సోమవారం నాటికి కొనుగోలు చేసింది మాత్రం 13,274 మెట్రిక్‌ టన్నులు మాత్రమే. ప్రస్తుతం మే నెల గడుస్తుంది. ఈ నెలలో 2లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలి. ఏప్రిల్‌  లక్ష్యమే ఇంకా నెరవేరలేదు. ఇక మే నెల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందన్నది చెప్పలేని పరిస్థితి. అనుకున్న సమయానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఉంటే 90 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యంలో కనీసం సగం ధాన్యమైన కొనుగోలు చేసేవారేమో. మెదక్‌ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు 341, ఇప్పటి వరకు ప్రారంభించింది 329, ఇంకా ప్రారంభించాల్సిన కొనుగోలు కేంద్రాలు 12 వరకు ఉన్నాయి. జిల్లాలో 27 రోజల క్రితం నుంచే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం మొదలు పెట్టినా ధాన్యం కొనుగోళ్లలో మాత్రం వేగం పెరగకపోవడం గమనార్హం. 


మే 9 నాటికి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల వివరాలు

మొత్తం కొనుగోలు కేంద్రాలు : 341

ప్రారంభించినవి : 329

ఐకేపీ-98, పీఏసీఎస్‌-228, ఏఎంసీ-3 కొనుగోలు కేంద్రాలు 

ధాన్యం అమ్మిన రైతులు : 2,788 మంది 

కొనుగోలు చేసిన మొత్తం ధాన్యం : 13,274 మెట్రి క్‌ టన్నులు 

మిల్లులకు తరలించిన ధాన్యం : 2,426 మెట్రిక్‌ టన్నులు 

ఇంకా తరలించాల్సిన ధాన్యం : 1401 మెట్రిక్‌ టన్నులు 

కొనుగోలు చేసిన ధాన్యం విలువ : రూ.26.02 కోట్లు 

ధాన్యం డబ్బు పొందిన రైతులు : 11 మంది 

ఎంత ధాన్యానికి డబ్బు చెల్లింపు : 198 మెట్రిక్‌ టన్నులు 

విడుదలైన డబ్బు : రూ.39 లక్షలు 

ఇంకా డబ్బు పొందాల్సిన రైతులు : 2,777 మంది

ఇంకా విడుదల కావాల్సిన డబ్బు : రూ.25.63 కోట్లు 

ట్యాబ్‌లో ఎంట్రీ చేసినవి : 1,926 మెట్రిక్‌ టన్నులు 

ట్యాబ్‌ ఎంట్రీ పర్సంటేజ్‌ : 16.23 ు

మిల్లులకు ముట్టిన ధాన్యం:260 మెట్రిక్‌ టన్నులు(1.96 శాతం)


మిల్లర్లు దొడ్డురకం ధాన్యం వద్దంటున్నరు 

- యాదగిరి, రైతు, రంగంపేట, కొల్చారం మండలం 

దొడ్డు రకం వరి మూడు ఎకరాలు సాగు చేశాను. కానీ దొడ్డురకం ధాన్యం వద్దని మిల్లర్లు చెబుతున్నారు. సన్నరకం ధాన్యం లారీలు ఖాళీ అయినంక రెండు, మూడు రోజులకు దొడ్డు రకం ధాన్యం దించుకుంటామంటున్నారు. ఓ వైపు తరుగు మరో వైపు హమాలీ చార్జీలతో సతమతమవుతున్న మాకు లారీ కిరాయిలు కూడా చెల్లించాల్సి వస్తుంది. 


ధాన్యం తెచ్చి 15 రోజులు అవుతుంది 

- గొర్రె లింగం, రైతు, కౌడిపల్లి 

కౌడిపల్లి కొనుగోలు కేంద్రానికి ఏప్రిల్‌ 27న ధాన్యం తీసుకొచ్చా.  ఇప్పటి వరకు కొనుగోలు ధాన్యంలో కేవలం రెండు లారీలను మాత్రమే మిల్లులకు తరలించారు. వర్షాలు పడి ధాన్యం తడవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం. టార్పాలిన్లు కూడా లేవు. మేమే కిరాయికి తెచ్చుకుంటున్నాం. హమాలీ, సుతిలీ ఖర్చులతో పాటు రవాణా ఖర్చులు కూడా మేమే భరిస్తున్నాం. 


వడ్లు తెచ్చి వారమైంది 

- పొచయ్య, రైతు, రామాయంపేట

వారం రోజులుగా రామాయంపేట మార్కెట్‌కు వస్తున్నాం. వడ్లు కొంటలేరు. ఇక్కడే ధాన్యం ఆరబోసి కాపలా ఉంటున్నాం. ఎండకు ఎండుతున్నాయి. వానకు తడుస్తున్నాయి. కానీ మా బాధలు ఎవరికీ పట్టడం లేదు. ధాన్యం కొనుగోలు చేయాలని మొత్తుకున్నా కొనడం లేదు. 






Read more