ఇంకో ఏడు సీట్లు గెలవాల్సిందే!

ABN , First Publish Date - 2022-05-10T08:45:23+05:30 IST

ఆలిండియా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం).. మజ్లిస్‌ పార్టీ.. తెలంగాణలోనే కాదు..

ఇంకో ఏడు సీట్లు గెలవాల్సిందే!

  • శాసనసభ ఎన్నికలకు మజ్లిస్‌ కసరత్తు
  • కొత్త నియోజకవర్గాల్లో పాగాకు పావులు
  • పార్టీ నేతలకు ఒవైసీ దిశానిర్దేశం


హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): ఆలిండియా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం).. మజ్లిస్‌ పార్టీ.. తెలంగాణలోనే కాదు.. దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. మజ్లిస్‌ పార్టీకి రాష్ట్రంలో ప్రస్తుతం ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఈ సీట్లను రెట్టింపు చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ కసరత్తు ప్రారంభించింది. మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఈ మేరకు పావులు కదుపుతున్నారు. గ్రేటర్‌ పరిధిలోనే కాకుండా ముస్లిం మైనారిటీ కుటుంబాలు అధికంగా నివసించే శాసనసభ నియోజకవర్గాల్లో పాగా వేయడానికి పార్టీ యంత్రాంగం కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రధానంగా మహబూబ్‌నగర్‌, నల్లగొండ, కరీంనగర్‌, వరంగల్‌ నగరాల్లో ముస్లిం జనాభాతో పాటు దళితులు, గిరిజనులు, బీసీ వర్గాలను పార్టీ వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బీజేపీని వ్యతిరేకిస్తున్న మజ్లిస్‌..


రాష్ట్రంలో అఽధికార టీఆర్‌ఎ్‌సతో ఎన్నికల్లో పొత్తులు లేకుండానే మిత్ర పక్షంగా వ్యవహరించడం గమనార్హం. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే పార్టీ పరంగా వచ్చే ప్రయోజనం కంటే పరస్పర అవగాహనతో పనిచేస్తేనే ఎక్కువగా లబ్ధి చేకూరుతుందని భావిస్తోంది. అవగాహనతో పనిచేస్తేనే మేలని అంటున్నారు. అందుకు అనుగుణంగా ఆయా జిల్లాల్లో, గ్రేటర్‌, శివారు ప్రాంతాల్లోనూ ఇతర పార్టీల్లో క్రియాశీలంగా ఉన్న ముస్లిం నాయకులను సమన్వయం చేసుకోవడంతోపాటు దళిత వర్గాలను దగ్గరకు తీసుకునేందుకు పార్టీ యంత్రాంగం కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. భవిష్యత్‌లో మజ్లిస్‌ జాతీయ స్థాయిలో బీజేపీకి రాజకీయంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని.. కొత్తగా పార్టీలో చేరే నాయకులకు విస్తృత అవకాశాలు లభిస్తాయని సీనియర్లు ప్రచారం చేస్తున్నారు. 


ఆ నియోజకవర్గాల్లో పాగా వేయాల్సిందే!

జూబ్లీహిల్స్‌, సనత్‌నగర్‌, ముషీరాబాద్‌, అంబర్‌పేటతోపాటు శివార్లలోని రాజేంద్రనగర్‌, మహేశ్వరం, శాసనసభ నియోజకవర్గాల్లో ఈసారి పాగా వేసి తీరాలని మజ్లిస్‌ భావిస్తోంది. ఇటీవల పార్టీ ముఖ్య కార్యకర్తలు, కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో.. పార్టీ సానుభూతిపరులు, ప్రధానంగా ముస్లిం వర్గాల వారి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించాలని నాయకులను ఒవైసీ ఆదేశించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని పార్టీ కార్యకర్తలు, నేతలు, బస్తీల వారీగా సమీక్షలు జరిపి ఓటరు లిస్టులను అప్‌డేట్‌ చేయించాలని సూచించారు.

Read more