రహదారులు రక్తసిక్తం

ABN , First Publish Date - 2022-05-10T17:23:56+05:30 IST

రాష్ట్రంలో రోడ్లు నెత్తురోడాయి. సోమవారం, ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదాల్లో పదిమంది దుర్మరణం పాలయ్యారు

రహదారులు రక్తసిక్తం

వేర్వేరు ప్రమాదాల్లో పదిమంది దుర్మరణం

ఆరుగురికి గాయాలు


చెన్నై/పెరంబూర్‌: రాష్ట్రంలో రోడ్లు నెత్తురోడాయి. సోమవారం, ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదాల్లో పదిమంది దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు గాయాలబారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వివరాలిలా వున్నాయి... 

తిరుచ్చి జిల్లాలో..

తిరుచ్చి సమీపంలో సోమవారం వేకువజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. స్థానిక మధురవాయల్‌ ప్రాంతానికి చెందిన బాలకృష్ణన్‌ (34), తన స్నేహితులు ఏళుమలై (29), కవియరసు, సురేష్‌, కామరాజ్‌, కార్తీ, సెల్వకుమార్‌లతో కలసి కొడైకెనాల్‌కు కారులో విహారయాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దిండుగల్‌-తిరుచ్చి జాతీయ రహదారిలో సోమవారం తెల్లవారుజామున కారు హఠాత్తుగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో బాలసుబ్రమణ్యం సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఏళుమలై మృతిచెందాడు. మిగిలిన వారిని తిరుచ్చిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. 

మనలి సమీపంలో...

స్థానిక వాషర్‌మెటకు చెందిన శ్రీనివాసన్‌ ఆదివారం సాయంత్రం తన సోదరి నివేదతో కలసి బైక్‌పై మనలి పుదునగర్‌లోని ఆలయానికి వెళ్లాడు.  మనలి జంక్షన్‌ సమీపంలో రెండు లారీలు ఢీకొని ఓ లారీ నుంచి విడిపోయిన ట్రాలీ రోడ్డుపై పడింది. అదే సమయంలో ఆలయం నుంచి తిరిగి వస్తున్న శ్రీనివాసన్‌, నివేద ట్రాలీ కింద చిక్కుకొని సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు పరారైన లారీ డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు.

చోరీ చేసిన బైకే ప్రాణం తీసింది

ఓ బైక్‌ను చోరీ చేసి తప్పించుకువెళ్తున్న ఓ ముగ్గురు స్నేహితులు ప్రమాదానికి గురయ్యారు. ఇందులో ఒకరు మరణించగా, మరో ఇద్దరి తీవ్రంగా గాయపడి ఆస్సత్రిలో చికిత్స పొందుతున్నారు. దిండుగల్‌ వడచెందూర్‌కు చెందిన కుమార్‌, తులసి, శక్తివేల్‌ ఆదివారం రాత్రి కృష్ణగిరిలో ఓ మోటారు సైకిల్‌ను దొంగిలించి దాంతో ఉడాయించారు. వారు దిండుగల్‌-తిరుచ్చి జాతీయ రహదారి మనప్పారై సమీపంలో వస్తుండగా ఎదురుగా వచ్చిన మినీ వ్యాన్‌ ఢీకొంది. ఈ ఘటనలో శక్తివేల్‌ సంఘటనా స్థలంలో మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు చేపట్టిన విచారణలో, వీరు ముగ్గురూ కృష్ణగిరిలో మోటార్‌ సైకిల్‌ చోరీ చేసినట్లు వస్తున్నట్లు తెలిసింది.

తిరునల్వేలి జిల్లాలో...

తిరునల్వేలి జిల్లా పాలై శాంతినగర్‌ 30వ వీధికి చెందిన మణికంఠన్‌ (17) ఓ ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువుతున్నాడు. తన స్నేహితు డు ఎంకేబీ నగర్‌కు ప్లస్‌ టూ విద్యార్థి ఇనియన్‌ (18)తో కలసి ఆదివారం సాయంత్రం తామ్రభరణి నదీతీరానికి వెళ్లి తిరిగి వస్తుండగా నాలుగు రోడ్ల జంక్షన్‌లో బైక్‌ అదుపుతప్పి కిందపడడంతో వారికి గాయాలయ్యాయి. చట్టుపక్కల వారు వారిని తిరునల్వేలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మణికంఠన్‌ను మెరుగైన చికిత్స కోసం నాగర్‌కోయిల్‌లోని ఓ ప్రైవేటు ఆసుఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.

సేలం జిల్లాలో...

సేలం జిల్లా ఆత్తూర్‌ కోట ప్రాంతానికి చెందిన ధనపాల్‌ (35) ఆత్తూర్‌ బైపాస్‌ రోడ్డులో టింబర్‌ డిపో నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం ఇంటి నుంచి దుకాణానికి మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ధనపాల్‌కు నాలుగు నెలల క్రితం వివాహం కాగా, ప్రస్తుతం ఆయన భార్య మూడు నెలల గర్భవతి.

తిరుప్పూర్‌ జిల్లాలో...

తిరుప్పూర్‌ జిల్లా పల్లడం అన్నానగర్‌కు చెందిన పాడప్పన్‌ (61) ఆదివారం రాత్రి కోవై-తిరుచ్చి జాతీయ రహదారి దాటుతుండగా ఓ  స్కూటర్‌ ఢీకొని తీవ్రగాయాల పాలయ్యాడు. అతడిని వెంటనే పల్లడం ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుప్పూర్‌ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు తెలిపారు. కానీ, కుటుంబసభ్యులు అతడిని ఇంటికి తీసుకెళ్లారు. సోమవారం ఉదయం ఎంతసేపటికీ ఆయన నిద్ర లేవకపోవడంతో అనుమానించిన కుటుంబసభ్యులు పరిశీలించగా, మృతి చెందినట్లు తేలింది. 

కడలూరు జిల్లాలో..

కడలూరు జిల్లా చిదంబరం సమీపం అరియకోష్టి ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకే ప్రముఖుడు శివ ప్రకాశం (47). ఆదివారం రాత్రి తమ గ్రామం నుంచి చిదంబరానికి మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా మూడలూరు మండపం సమీపంలో ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొంది. ఆయనపై బస్సు వెనుక చక్రం ఎక్కడంతో తీవ్రగాయాలతో సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు.

అవినాశిలో...

తిరుప్పూర్‌ జిల్లా అవినాశి సమీపం దేవరాయంపాళయంకు చెందిన శరవణన్‌ (28) బనియన్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలసి జన్మదినం జరుపుకున్నాడు. అనంతరం మోటార్‌సైకిల్‌పై ఇంటికి వస్తుండగా, మంగళం రోడ్డులో ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన శరవణన్‌ను చుట్టుపక్కల వారు అవినాశి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స ఫలించక అతను మృతిచెందాడు.

Read more