పగబట్టిన ప్రకృతి

ABN , First Publish Date - 2022-05-11T05:30:00+05:30 IST

జిల్లాలోని ఉద్యాన రైతులపై ప్రకృతి పగబట్టింది.

పగబట్టిన ప్రకృతి
రైల్వేకోడూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న అరటి

పది రోజుల్లో రూ.20 కోట్ల నష్టం

నిండా మునిగిన ఉద్యాన రైతు

మామిడి, అరటి రైతులకు తీరని నష్టం

వెంటాడిన.. ఈదురుగాలులు, వడగండ్ల వాన


జిల్లాలోని ఉద్యాన రైతులపై ప్రకృతి పగబట్టింది. ఒకటి కాదు.. రెండు కాదు. పది రోజులుగా.. విలయతాండవం చేస్తోంది. ఈదురుగాలులు, వడగండ్లు, వర్షం దెబ్బకు ఉద్యాన రైతు నిండా మునిగిపోయాడు. నోటికాడ కూడు జారిపోయినట్లు.. చేతికొచ్చిన పంట గాలివాన బారిన పడి కేవలం పది రోజుల వ్యవధిలోనే.. సుమారు రూ.20 కోట్లకు పైనే ఉద్యాన రైతు నష్టపోయాడు.


రాయచోటి, మే 11 (ఆంధ్రజ్యోతి): రైల్వేకోడూరు, రాయచోటి, రాజంపేట, పీలేరు ప్రాంతాలలో మామిడి ఎక్కువగా సాగవుతుంది. రైల్వేకోడూరు నియోజకవర్గంలో 20 వేల హెక్టార్లకు పైనే మామిడి  సాగులో ఉంది. పీలేరు నియోజకవర్గ పరిధిలో 10 వేల హెక్టార్లలో మామిడి ఉంది. రాజంపేట, రాయచోటి నియోజకవర్గాలలో 20 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగు చేశారు. అదేవిధంగా రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాలలో అరటి సుమారు 35 వేల హెక్టార్లలో సాగులో ఉంది. ఈనెల 1వ తేదీ నుంచి పలుమార్లు ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం పడింది. దీంతో మామిడికాయలు రాలిపోయాయి. చాలాచోట్ల మామిడి చెట్లు సైతం పూర్తిగా విరిగి పడిపోయాయి. అదేవిధంగా అరటి కూడా పూర్తి స్థాయిలో దెబ్బతింది. రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాలలో బొప్పాయి పంట కూడా దెబ్బతింది. 


నష్టం రూ.20 కోట్ల పైమాటే...

ఉద్యాన శాఖ అధికారుల లెక్కల ప్రకారం.. గత పది రోజులుగా కురిసిన వర్షాలకు 6830 హెక్టార్లలో మామిడి పంట దెబ్బతింది. ఎక్కువగా రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాలలో ఈ నష్టం వాటిల్లింది. అరటి 400 హెకార్టలో పూర్తి స్తాయిలో దెబ్బతింది. పంట నష్టపోయిన శాతాన్ని బట్టి నివేదికలు తయారు చేసినట్లు ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఎకరా మామిడి సరాసరి రూ.20 వేలు, అరటి ఎకరా రూ.30 వేల వరకు నష్టపోయినట్లు అధికారులు నివేదికలు తయారు చేస్తున్నారు. అయితే పెనుగాలులకు చాలాచోట్ల చెట్లు నేలకూలిపోగా.. పలుచోట్ల కాయలు భారీగా నేలరాలిపోయాయి. అదేవిధంగా రైతులు పెట్టిన పెట్టుబడులు, కూలీలు, ఖర్చులతో పాటు కోల్పోయిన ఆదాయాన్ని లెక్కిస్తే.. సుమారు రూ.20 కోట్ల వరకు ఉద్యాన రైతులు నష్టపోయారు. 


నడ్డి విరిగిన ఉద్యాన రైతు

శత్రువు పగపట్టినట్లు సుమారు పది రోజుల పాటు ఈదురుగాలులు, వడగండ్ల వర్షం పడడంతో ఉద్యాన రైతు నడ్డి విరిగిందని చెప్పవచ్చు. రైల్వేకోడూరు, రాజంపేట నియోకవర్గాలలో వేల మంది రైతులు ఉద్యాన పంటలపైనే ఆధారపడతారు. కరువు నేలలైన రాయచోటి, పీలేరు ప్రాంతంలో కూడా ఎక్కువగా మామిడి పంటపైన ఆధారపడతారు. అయితే పంట దిగుబడి తీయాల్సిన సమయంలో ఈ వర్షాలు పడడంతో ఉద్యాన రైతు కోలుకోలేని విధంగా నష్టపోయాడు. ఎకరాలకు ఎకరాలే పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల వ్యాపారులు రైతుల దగ్గర తోటలు కొనుగోలు చేశారు. నేడో.. రేపో కాయలు కోయాల్సిన సమయంలో ఈ వర్షాలు వచ్చి.. అందరికీ నష్టాన్ని మిగిల్చాయి.  


జిల్లా వ్యాప్తంగా 442.8 మి.మీ.ల వర్షపాతం

జిల్లావ్యాప్తంగా మంగళవారం 442.8 మి.మీ.వర్షపాతం నమోదైంది. జిల్లా సరాసరి 14.8 మి.మీ.గా నమోదైంది. మదనపల్లె డివిజన్‌ మొత్తం 71.6 మిల్లీ మీటర్లు నమోదు కాగా... డివిజన్‌ సరాసరి 6.5 మి.మీ.గా ఉంది. ఇందులో అత్యఽధికంగా నిమ్మనపల్లెలో 13.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాయచోటి డివిజన్‌ మొత్తం 239 మి.మీ. కాగా డివిజన్‌ సరాసరి 23.9 మిల్లీమీటర్లుగా ఉంది. ఇందులో అత్యధికంగా లక్కిరెడ్డిపల్లెలో 52.8 మి.మీ. నమోదైంది. రాజంపేట డివిజన్‌ మొత్తం 132.2 మి.మీ. కాగా సరాసరి 14.7 మి.మీ, ఇందులో అత్యధికంగా వీరబల్లి మండలంలో 28.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. 


నష్టం మేరకే నివేదికలు  

- రవీంద్రనాధరెడ్డి, ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు 

పది రోజుల నుంచి ఈదురుగాలులు, వర్షాలకు జిల్లా వ్యాప్తంగా మామిడి, అరటి తోటలు ధ్వంసం అయ్యాయి. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా క్షేత్రస్థాయిలో పంట నష్టపోయిన వివరాలు సేకరిస్తున్నాం. ఈ మేరకే ప్రభుత్వానికి నివేదికలు పంపుతాం. 


వరి వర్షార్పణం

తుఫాను తాకిడికి 797.6 హెక్టార్లలో పంట నష్టం


రాయచోటి టౌన్‌, మే 11: అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా మంగళ, బుధవారాల్లో గాలి, వాన బీభత్సానికి 797.6 హెక్టార్లలో వరి, పొద్దుతిరుగుడు, నువ్వుల పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయశాఖాధికారులు అంచనా వేశారు. రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం మండలంలో 19 మంది రైతులకు చెందిన 72 హెక్టార్లలో, సంబేపల్లె మండలంలో ముగ్గురు రైతులకు చెందిన 3 హెక్టార్లలో పొద్దుతిరుగుడు పంట వర్షానికి దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. అలాగే లక్కిరెడ్డిపల్లె మండలంలో 78 మంది రైతులకు చెందిన 182 హెక్టార్లలోని వరి, రామాపురం మండలంలో 113 మంది రైతులకు సంబంధించిన 87 హెక్టార్లలోని వరి పంట వర్షం తాకిడికి పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లె మండలంలో 350 మంది రైతులకు 304.8 హెక్టార్లు, సుండుపల్లె మండలంలో 15 మంది రైతులకు చెందిన 10 హెక్టార్లు, రాయచోటి మండలంలో 18 మంది రైతులకు సంబంధించిన 45 హెక్టార్లు, చిన్నమండెం మండలంలో 61 మంది రైతులకు చెందిన 69 హెక్టార్లలోని వరిపంట వర్షార్పణం అయినట్లు అధికారులు గుర్తించారు. అలాగే రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేట మండలంలో 21 మంది రైతులకు సంబంధించిన 21 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. రాజంపేట మండలంలో ఒక రైతుకు చెందిన 3.2 హెక్టార్లలోని నువ్వుల పంట వర్షానికి దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మహేశ్వరమ్మ తెలియజేశారు. అసాని తుఫాను దెబ్బకు వరి, పొద్దుతిరుగుడు, నువ్వుల పంటలు నష్టపోయిన రైతుల జాబితాను సిద్ధం చేశామని, నివేదికలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆమె తెలియజేశారు. 



Read more